Abn logo
Jun 11 2021 @ 00:00AM

మృత్యుంజయ మహాదేవుడు!

శృంగార శిల్పనగరి ఖజురహోలో ఆధ్యాత్మికత వెల్లి విరిసే చోటు మాతంగేశ్వర ఆలయం. ఖజురహోలో ఇప్పటికీ పూజాదికాలు కొనసాగుతున్న ఏకైక పురాతన ఆలయం ఇదొక్కటే.


ఖజురహో శిల్పం విశ్వవిఖ్యాతం. ఏ కట్టడాన్ని చూసినా ఆనాటి శిల్పుల వైదుష్యం అబ్బురపరుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని ఈ పట్టణంలో సుమారు 1100 ఏళ్ళనాటి హిందూ, జైన ఆలయ సముదాయాలు... ప్రధానంగా వాటి గోడలపై కనిపించే శృంగార శిల్పాలు చూపరులను సమ్మోహనపరుస్తాయి. ఖజురహోలో అరవైకి పైగా ఆలయాలున్నా.... వాటిలో ఎక్కువ శాతం శిథిలమైపోయాయి. నిత్య పూజలు మాతంగేశ్వర ఆలయంలో మాత్రమే ఈనాటికీ జరుగుతున్నాయి. 


మాతంగేశ్వర లింగం సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది. నేల పైభాగంలో ఎంత ఎత్తు ఉందో, భూమిలో కూడా అంతే లోతులో ఈ విగ్రహం విస్తరించి ఉందనీ, ప్రతి సంవత్సరం కార్తీక పున్నమి రోజున ఈ శివలింగం ఎత్తు ఒక అంగుళం పెరుగుతుందనీ భక్తుల విశ్వాసం. ఆ రోజున ఈ లింగం ఎత్తును కొలుస్తారు. కార్తీక పౌర్ణమికీ, మహా శివరాత్రికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. దీన్ని ‘సజీవ’ లింగంగా ఆరాధిస్తారు. ఈ ఆలయ నిర్మాణం తొమ్మిదో శతాబ్దంలో... శివ భక్తుడైన చందేల వంశ పాలకుడు చంద్ర దేవ్‌ కాలంలో జరిగినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయ సముదాయంలో వినాయకుడి గుడి కూడా ఉంది. ఖజురహోలో... ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించిన కట్టడాల్లో ఇదొకటి. 


ప్రణయమూర్తిగా...

పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు భక్తితత్పరతకు శివుడు సంతోషించి, మహిమాన్వితమైన మరకతమణిని ప్రసాదించాడు. ధర్మరాజు నుంచి మాతంగ మహర్షికీ, ఆయన నుంచి హర్షవర్ధనుడనే రాజుకూ ఈ మణి సంక్రమించింది. ఎప్పుడూ శత్రురాజులతో యుద్ధాల్లో తీరిక లేని హర్షవర్ధనుడికి ఆ మణిని భద్రపరుచుకోవడం కష్టమయింది. చివరకు ఆయన దాన్ని భూమిలో పాతి పెట్టాడు. కాలక్రమేణా ఆ మణి చుట్టూ ఒక శివలింగం లాంటి ఆకారం ఏర్పడింది. అదే మాతంగేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం చెబుతోంది. మరో కథ ప్రకారం, మాతంగ మహర్షి సాక్షాత్తూ శివుడి పదవ అవతారం. ఆయన దేశమంతటా పర్యటించి నాలుగు చోట్ల ఆశ్రమాలు ఏర్పాటు చేసి, భక్తులకు జ్ఞానమార్గాన్ని ఉపదేశించాడు. ఆ నాలుగు ఆశ్రమాలు ఉన్న ప్రదేశాల్లో నిర్మితమైన ఆలయాల్లో శివుణ్ణి మాతంగేశ్వరుడిగా కొలుస్తారు. వాటిలో ఒక ఆలయం ఖజురహోలోది కాగా, మిగిలిన మూడు వారణాసి, గయ, కేదార్‌నాథ్‌లలో ఉన్నాయి. ఖజురహోలోని మాతంగేశ్వరుణ్ణి ‘మృత్యుంజయ మహాదేవుడ’ని కూడా పిలుస్తారు. శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశం ఇదేననీ, ఆదిదంపతుల ప్రణయ విహార భూమి కాబట్టే శృంగార శిల్పకళకు ఇది కేంద్రం అయిందనీ మరి కొన్ని కథలున్నాయి. అందుకనే ఇక్కడ శివుణ్ణి ‘ప్రణయమూర్తి’గా భక్తులు భావిస్తారు. మాతంగేశ్వర లింగాన్ని స్పృశించి, స్వామిని ప్రార్థిస్తే కోరుకున్నవన్నీ లభిస్తాయన్న నమ్మకం ఉంది.


Advertisement