అన్నమయ్య అన్నది - 31

ABN , First Publish Date - 2020-03-27T18:55:26+05:30 IST

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ

అన్నమయ్య అన్నది   - 31

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక  అంతర్జాతీయ కవి అన్నమయ్య. మనకై‌ ఉన్నది అన్నమయ్య‌ అన్నది. స్మరించుకుందాం రండి 

--


**




"వెలుపల వెదికితే వెస నాత్మఁగనునా
పలుమాఱు నిదే యభ్యాసము‌గా వలెను"


బయట లేదా బాహ్యంలో వేగంగా వెతికితే  ఆత్మ తెలిసివస్తుందా (తెలియదు కనుక) అదే పనిగా ఈ చెప్పబోయే దాన్ని అభ్యసించాలి అంటూ అవసరమైన సంకీర్తన్ను‌ అందిస్తున్నారు అన్నమ్మయ్య.


" శుద్ధం, బుద్ధం,‌ ప్రియం, పూర్ణం / నిష్ప్ఫపంచం నిరామయం" అని ఆత్మ గుఱించి అష్టావక్రగీత (ప్రకరణం 18 శ్లోకం  35) చెబుతోంది. అంటే శుద్ధమైనదీ, జ్ఞాన(రూప)మైనదీ, ప్రియమైనదీ, పూర్ణమైనదీ ఆత్మ అని‌ అర్థం. ఆత్మే భగవంతుడు. భగవంతుణ్ణి‌ అంతర్యామి అంటారు. అంటే లోపల తిరిగే వాడు అని అర్థం. తమిళ్‌ భాషలో భగవంతుణ్ణి కడవుళ్ (கடவுள்) అంటారు. అంటే లోపలికి దాటు‌ లేదా వెళ్లు అని అర్థం. భగవంతుని కోసం వెతకాల్సింది బయట కాదు మన లోపల వెతకాలి. "నేను నా టెలిస్కవ్‌ప్ (telescope)తో స్వర్గాల్ని గాలించాను కానీ భగవంతుణ్ణి కనుక్కోలేదు" అని లలంద (Lalande 1732-1807) అన్న ఫ్రెంఛ్ ఖగోళ శాస్త్రవేత్త చెప్పినదాన్ని ఉటంకిస్తూ బ్రిటిష్‌‌ ఆధ్యాత్మిక‌ రచయిత పోల్ బ్రంటన్ (Paul Brunton 1898-1981) ఇలా‌ అంటారు: "లలంద  టెలిస్కవ్‌ప్ ను పక్కన పెట్టి‌ తన మనసును నిశ్చలం చేసుకుని ఉండాల్సింది.‌ అక్కడ  భగవంతుడు కనుక్కోబడే వాడు". పోల్ బ్రంటన్ సరిగ్గా చెప్పారు ఇక్కడ అన్నమయ్య లాగా.


"ఇన్ని చింతలు మఱచి యింద్రియాలఁ గుదియించి
పన్నియుండిన హృదయ పద్మమందును
ఎన్న నంగుష్ఠమాత్రపు టీశ్వరు పాదాల కింద
తన్ను నణుమాత్రముగఁ‌ దలఁచఁగ వలెను"


అన్ని చింతలను మఱిచిపోయి ఇంద్రియాల్ని నిగ్రహించి సిద్ధంగా ఉన్న హృదయ పద్మంలో ఆలోచిస్తే అంగుళం‌ మాత్రమే ఉన్న ఈశ్వరుని‌ పాదాల కింద తనను ఒక అణువుగా తలచుకోవాలి అని బోధిస్తున్నారు అన్నమయ్య.


అష్టావక్రగీత (ప్రకరణం 2 శ్లోకం‌16) ఇలా చెబుతోంది:‌ " ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజమ్".‌ అంటే దుఃఖం ద్వైతానికి మూల‌కారణం. ఆ‌ ద్వైత మూలకారణమైన దుఃఖానికి విరుద్ధమైన మందులేదు అని అర్థం.‌ అందుకే ఇక్కడ చింతల్ని మఱిచిపోవాలంటున్నారు అన్నమయ్య.  భగవద్గీత (అధ్యాయం 2 శ్లోకాలు 60,‌ 61)లో ఇలా చెప్పబడ్డది:‌ "యతతో హ్యపి కౌంతేయ పురుషస్య వివశ్చితః / ఇంద్రియాణి ప్రమాథీని‌ హరంతి ప్రసభం మనః""తాని‌ సర్వాణి‌ సంయమ్య యుక్త అసీత మత్పరః / వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా". అంటే  కుంతీపుత్రా,  మోక్షం కోసం ప్రయత్నిస్తున్న వివేకవంతుడి మనసును కూడా కలతపెట్టగలిగే ఇంద్రియాలు హరించేస్తున్నాయి... కనుక వాటిని నిగ్రహించుకుని తగినవాడవై నన్ను  ఆశ్రయించి ఉండాలి  ఎవరి స్వాధీనంలో ఇంద్రియాలు ఉంటాయో వారి జ్ఞానం నిలకడగా ఉంటుంది అని అర్థం. అందుకే ఇంద్రియాల్ని కుదించాలి అన్నారు అన్నమయ్య. "అంగుష్ఠమాత్రః పురుషోSన్తరాత్మా‌ సదా జనానాం హృదయే సన్నివిష్టః" అని కఠోపనిషత్ చెప్పింది. అంటే మనుషుల హృదయాల్లో పరమాత్మ సర్వదా అంగుష్ఠమాత్రుడై నివశిస్తాడు అని అర్థం. ఆ మాటనే ఇక్కడ ఉటంకించారు అన్నమయ్య.


"పలుదేహపుఁ గాళ్లఁ బరువులు వారక
బలుదేహపు టింటిలోపల చొచ్చి
చలివేఁడిఁబొరలకే సర్వేశు పాదాల కింద
తలకొన్న తన్నుఁ దానే తలఁచఁగవలెను"


లుసార్లు జన్మించిన దేహాలకు చెందిన కాళ్లతో పరుగులెత్తకుండా పలు దేహాల ఇంటిలోపలకెళ్లి చలి,‌ వేడి వీటిలో దొల్లకుండా సర్వేశ్వరుడి పాదాల కింద ఉన్న తనను తానే తలచుకోవాలి అని అంటూ బోధను‌ కొనసాగిస్తున్నారు అన్నమయ్య.



భగవద్గీత (అధ్యాయం 9 శ్లోకం 8)లో "ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః / భూతగ్రామమిమం కృత్స్న మవశం ప్రకృతేర్వశాత్" అని చెప్పబడ్డది. అంటే కారణవిశేషాన్ని అనుసరించి ఈ‌ సకల  భూతసమూహాల్ని నేను నా‌దైన విధానంలో మళ్లీ‌,‌ మళ్లీ సృష్టిస్తున్నాను అని అర్థం. సర్వేశ్వరుడి పాదాల కింద ఉన్న తనను తానే తలచుకుంటూ ఉన్నట్టయితే పలుసార్లు జన్మించిన దేహాలకు చెందిన కాళ్లతో పరుగులెత్తకుండా పలు దేహాల ఇంటిలోపలకెళ్లి చలి,‌ వేడి వీటిలో దొల్లుతూ ఉండే స్థితి ఉండదు‌. కాబట్టి అలా ఉండమంటున్నారు అన్నమయ్య. 


"కైకొన్న భక్తితో నిక్కపు శరణాగతితో
చేకొని విన్నపములు చేసుకొంటాను
ఏకాంతాన శ్రీ‌ వేంకటేశ్వరు పాదాల కింద
దాకొని తన్నుఁ దానే తలఁచఁగవలెను"


ఉద్యమించిన భక్తితో నిజమైన శరణాగతితో నమ్మకంతో విన్నపాలు చేసుకుంటూ ఏకాంతంలో శ్రీ వేంకటేశ్వరుని పాదాల కింద చేరి తనను తానే తలచుకోవాలి అంటూ సంకీర్తన్ను ముగించారు అన్నమయ్య. 


తనను తానే తలచుకోవడం అన్నది‌ ఒక‌ ఉత్కృష్టమైన స్థితి. ఈ ఆత్మవిచారణ‌ చేసుకోవడం ఎంతో ముఖ్యం. రమణమహర్షి మనకు సూచించిన గతి కూడా ఇదే. అన్నమయ్య ఈ‌ సంకీర్తనలో దాన్నే చెబుతున్నారు.


భక్తి ఏకాంతాత్మకం. ఏకాంత భక్తి ఉండాలి.  రామానుజులు ఇలా చెప్పారు: "యాః క్రియాస్సంప్రయుక్తాస్స్యురేకాంత గతబుద్ధిభిః / తా స్సస్సర్వాశ్శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వై స్వయం". అంటే ఏకాంత భక్తి ఉన్న వాళ్ల చేత ఈశ్వరుని కోసం ఏ యే క్రియలు సమర్పించబడుతున్నాయో వాటిని భగవంతుడు శిరస్సుతో అంగీకరిస్తున్నాడు అని అర్థం. ఏకాంతంగానే భగవంతుణ్ణి చేరడానికి వెళ్లాలి.

 

భగవద్గీత (అధ్యాయం 9 శ్లోకం 26)లో కృష్ణుడు ఇలా చెప్పాడు: "పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి /  తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః". భగవద్గీత శ్లోకాల్లో ఈ శ్లోకం చాలా తప్పుడు అర్థంతో చలామణిలో ఉంది.  ఈ శ్లోకం వల్ల మనం గ్రహించాల్సిన సరైన అర్థం ఇది:  ఎవరు (యః) నాకు (మే) పరిశుద్ధమైన (ప్రయత) మనసు యొక్క‌ (ఆత్మనః) సవాలు అంటే‌ ఉనికిని ప్రశ్నించడం (పత్రం) వికాసం (పుష్పం) క్రియ (ఫలం) ఈ‌ మూడిటి సమ్మేళనాన్ని (తోయం) భక్తితో‌ (భక్త్యా) సమర్పిస్తారో (ప్రయచ్ఛతి) భక్తితో  ఇచ్చిన (భక్తి+ఉపహృతం) ఆ సమ్మేళనాన్ని (తత్) నేను (అహం) తీసుకుంటున్నాను (అశ్నామి).  మనం ఇప్పటికైనా, ఇకనుంచైనా ఈ సత్యార్థాన్ని గ్రహించాలి. అవార్థాలనూ, అపార్థాలనూ లేకుండా చెయ్యాలి. పరిశుద్ధమైన మనసుతో సవాలు (ఉనికిని‌ ప్రశ్నించడం), వికాసం, క్రియల‌ సమ్మేళనంగా  తనకు సమర్పించబడుతున్న భక్తిని  పరమాత్మ స్వీకరిస్తాడు అని భగవద్గీతలో మనకు తెలియజెయ్యబడింది.  తెలుసుకుందాం.


ఆ భగవంతుణ్ణి లోపల వెతకాలనీ అందుకు అభ్యాసం చెయ్యాలనీ, ఆత్మవిచారం‌తో, ఏకాంత భక్తితో  పరమాత్మ‌ పాదాలను చేరాలనీ బోధిస్తూ‌ అలరారుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.


ఈ శీర్షికలో ఇంతవఱకూ వచ్చిన రచనల లింక్‌లు


కర్మణ్యే వాధికారస్తే.. అర్థం అది కాదా?

వేంకటేశ్వరుని మతం ఇదే!

ఆ చోటు కోసం మళ్లీ ఇక్కడే పుట్టాలి!

దంచుతున్న ఈ స్త్రీ ఎవరంటే..

తొందరపడి ఆ పని చేయలేదు 

వేంకటేశ్వరుడి నవ్వులు.. ఆమెకు అక్షింతలు! 













రోచిష్మాన్
9444012279
rochishmon@gmail.com

Updated Date - 2020-03-27T18:55:26+05:30 IST