అసలే నష్టాలు... ఆపై రూ. 200 కోట్ల జరిమానా...

ABN , First Publish Date - 2021-08-24T23:13:19+05:30 IST

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా పరిస్థితి... ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ చందంగా తయారైంది. కరోనా నేపధ్యంలో నష్టాల బాటలో పయనిస్తున్న మారుతి కంపెనీకి... నిబంధనలు అతిక్రమించిందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) రూ. 200 కోట్ల జరిమానా విధించింది.

అసలే నష్టాలు... ఆపై రూ. 200 కోట్ల జరిమానా...

న్యూఢిల్లీ : ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా పరిస్థితి... ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ చందంగా  తయారైంది. కరోనా నేపధ్యంలో నష్టాల బాటలో పయనిస్తున్న మారుతి కంపెనీకి... నిబంధనలు  అతిక్రమించిందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) రూ. 200 కోట్ల జరిమానా విధించింది. మారుతి సుజుకీ డిస్కౌంట్‌ కంట్రోల్‌ విధానం ద్వారా డీలర్లు ఇస్తున్న డిస్కౌంట్లను పరిమితం చేస్తున్నందుకు సీసీఐ ఈ జరిమానా విధించింది. ఇలాంటి అనుచిత వ్యాపార ధోరణులను అనుసరించడం ద్వారా పోటీ నిరోధక విధానాలకు మారుతి పాల్పడుతోందని సీసీఐ పేర్కొంది.


కంపెనీ ఇస్తున్న డిస్కౌంట్లు కాకుండా, ఇకపై అదనంగా సొంత డిస్కౌంట్లేవీ ఇవ్వరాదంటూ డీలర్లతో మారుతి ఇటీవల ఒక ఒప్పందంపై సంతకం చేయించుకుంది.  అంతేకాదు... అలా ఎవరైనా అదనపు డిస్కౌంట్లు ఇస్తున్నారేమో కనుక్కునేందుకు మిస్టరీ షాపింగ్‌ ఏజెన్సీలను నియమించుకుంది కూడా. కస్టమర్లలా షోరూమ్‌లకు వెళ్ళే ఈ ఏజెన్సీల ఉద్యోగులు... అదనపు డిస్కౌంట్లు ఏవైనా ఇస్తున్నారా అని తెలుసుకుని,  డీలర్లు సొంత డిస్కౌంట్లు ఇస్తున్నట్టు తేలితే... వెంటనే కంపెనీకి నివేదిస్తారు. ఈ నివేదిక ఆధారంగా కంపెనీ ఆయా డీలర్లు, షోరూమ్‌లలోని సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లపై జరిమానా విధిస్తుంది. విషయం తెలుసుకున్న సీసీఐ...  మారుతి సుజుకీ కంపెనీ పోటీ నిరోధక విధానాలకు పాల్పడుతోందంటూ రూ. 200 కోట్లు జరిమానాను  విధించింది. కాగా... సీసీఐ తీర్పును సమీక్షించిన అనంతరం చట్టానికి లోబడి చర్యలు తీసుకోనున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది.  కాగా... మారుతి సుజుకి జూన్‌ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ఇటీవలే వెల్లడించింది. నికర లాభం రూ. 440.8 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే సీజన్‌లో కంపెనీ రూ. 249.4 కోట్ల నికర నష్టాలను ప్రకటించిన విషయం తెలిసిందే. క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కంపెనీ లాభాలు 62.19 శాతం పెరిగింది. 

Updated Date - 2021-08-24T23:13:19+05:30 IST