Abn logo
Feb 14 2020 @ 00:05AM

ప్రేమ బంధం... మధురం!

ప్రేమను వ్యక్తపరచడానికి, బలపరుచుకోవడానికి మార్గాలు బోలెడు. కలిసి సాగించే ఆ ప్రయాణం, ప్రేమ... వివాహనుబంధంగా మారే ఆ పరిణామక్రమం ఆరోగ్యకరమైన రీతిలో సాగాలి. ‘ప్రేమను బలపరిచే చర్యలు దాని ఔన్నత్యాన్ని పెంచేవిగా ఉన్నప్పుడే, ప్రేమ విలువ కలకాలం తరగకుండా ఉంటుంది’ అంటున్నారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి.


ప్రేమించిన వ్యక్తితో సన్నిహితంగా గడపాలని కోరుకోవడం సహజం. ఏకాంతంగా ఊసులు చెప్పుకోవాలనీ, సాన్నిహిత్యంలో మైమరిచిపోవాలనీ అనుకోవడమూ సహజమే! అలాంటి సమయాలు ప్రతి జంటకూ ఏదో ఓ సందర్భంలో దక్కుతూనే ఉంటాయి. మురిపాలు, ముసిముసి నవ్వులు, గుసగుసలు, మనసును గిలిగింతలు పెట్టి, పారవశ్యానికి లోను చేస్తాయి. మధురోహల్లో తేలిపోయే ఆ క్షణాల్లో, గమ్మత్తైన ప్రేమ మత్తులో కూరుకుపోకుండా మెలగడం కష్టతరమే! అయితే ఆ సాన్నిహిత్యానికి పరిధిలు విధించడం, హద్దులు మీరకుండా మెలగడం మీదే ప్రేమికుల ఔన్నత్యం ఆధారపడి ఉంటుంది. ప్రేమలో కచ్చితంగా రొమాన్స్‌కు స్థానం ఉంటుంది. అయితే అదొక అందమైన అనుభవంగా, జీవితాంతం గుర్తుండిపోయే మధురక్షణంగా మిగిలిపోవాలంటే  పట్టు తప్పే మనసు పగ్గాల మీద ప్రేమికులు పట్టు ఏర్పరుచుకోవాలి. ప్రేమానుబంధాన్ని వైవాహికబంధంగా మలుచుకోవాలనే బలమైన ఆకాంక్ష పెంచుకోవాలి. ప్రేమించిన వ్యక్తితో సుదీర్ఘంగా సాగించబోయే జీవన ప్రయాణంలో పొందే శాశ్వత ఆనందాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. 


ప్రేమ విలువ పెంచుకోవాలి! 

ప్రేమ భావనలు, మనసును మధురోహల్లో తేలిపోయేలా చేస్తాయి. కాలంతో పాటు వాటి తీవ్రతా పెరుగుతుంది. బంధం బలపడే చర్యల గురించిన ఆలోచనలూ కలుగుతాయి. ఆ క్రమంలో ఒకరికొకరు మరింత దగ్గరయ్యే సందర్భాలూ చోటుచేసుకుంటాయి. అయితే ఆ పరిస్థితి పెళ్లి కన్నా ముందే ఎదురైతే, భావోద్వేగాల తీవ్రతలో కూరుకుపోకుండా, స్పష్టమైన ఆలోచనలతో మెలగాలి. మనసులు కలిసిన తర్వాత సన్నిహితంగా మెలగడానికి సంకోచాలెందుకు? అనుకోవడం పొరపాటు. తమ ప్రేమ ఎలా వికసించబోతోంది? ప్రేమ పెళ్లి రూపం దాల్చే వీలు ఉందా? లేదా? అనే విషయాల పట్ల ప్రేమికులు ఇద్దరూ సమాంతర అవగాహనతో ఆలోచించాలి. అలాగే ప్రేమ తీవ్రత, స్పష్టత, పరిణామం, పెళ్లికి దారి తీసే క్రమం... ఈ అంశాలన్నిటినీ ప్రేమికులు విశ్లేషించి, పెళ్లికి ముందే సన్నిహితంగా మెలగడం ఎంతవరకూ అవసరం? అని ప్రశ్నించుకోవాలి. సాన్నిహిత్యం ఓ అద్భుతమైన అనుభవం. అంతటి అపురూపమైన అనుభవాన్ని తాత్కాలికమైన సంతోషం కోసం పణంగా పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు. ఆ ఆనందం శాశ్వతమై, వివాహబంధం రూపంలో ముందుకు సాగాలంటే ఊగిసలాడే మనసులకు పగ్గాలేయాలి. ఉర్రూతలూగించే కోరికలకు కళ్లెం వేయాలి. అప్పుడే ప్రేమ విలువ, వన్నె తరగకుండా ఆనందమయంగా సాగుతుంది.


గోగుమళ్ల కవిత

Advertisement
Advertisement
Advertisement