లవ్లీ సింధు

ABN , First Publish Date - 2021-07-31T08:34:41+05:30 IST

షూటర్లు.. ఆర్చర్లు.. టీటీ స్టార్లు.. ఆఖరికి ఆర్చరీలో పతకానికి చేరువైన దీపికా కుమారి, షూటింగ్‌లో మనూ భాకర్‌ ఇంటిముఖం.

లవ్లీ సింధు

లవ్లీనాకు పక్కా.. సింధు కేక

సెమీస్‌ చేరిన అసోం బాక్సర్‌.. కాంస్యం ఖాయం

క్వార్టర్స్‌ విజయంతో మెడల్‌కు చేరువలో సింధు

షూటింగ్‌లో మనూ, ఆర్చరీలో దీపికకు నిరాశ

 సెమీ్‌సలో ప్రవేశం

పతకం ఖాయం చేసుకున్న బాక్సర్‌ లవ్లీనా

దీపికా, మనూ భాకర్‌ నిష్క్రమణ

హాకీ అమ్మాయిలకు తొలి గెలుపు


షూటర్లు.. ఆర్చర్లు.. టీటీ స్టార్లు.. ఆఖరికి ఆర్చరీలో పతకానికి చేరువైన దీపికా కుమారి, షూటింగ్‌లో మనూ భాకర్‌ ఇంటిముఖం. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజతం తప్ప మరో మెడల్‌ కష్టమేనేమో..? అనుకుంటున్న సమయంలో అసోం బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌, తెలుగు షట్లర్‌ పూసర్ల వెంకట సింధు శుక్రవారం అద్భుత ప్రదర్శనతో మెరిశారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ నీన్‌ చిన్‌ చెన్‌పై విరుచుకుపడ్డ లవ్లీనా.. 69 కిలోల విభాగంలో సెమీ్‌సకు దూసుకెళ్లింది. ఇక ఆమె ఓడినా కాంస్యం దక్కుతుంది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో యమగూచిని సింధు చిత్తు చేసింది. శనివారం సెమీస్‌లో గెలిస్తే వరుసగా రెండో ఒలింపిక్‌ పతకం ఖరారవుతుంది. లేదంటే.. కాంస్యం కోసం జరిగే మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది.


భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అంచనాలకు తగ్గట్టే అదరగొడుతోంది. స్వర్ణమే లక్ష్యంగా దేశం గర్వించదగ్గ ఆటతో.. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్‌లో పవర్‌ఫుల్‌ స్మాష్‌, ర్యాలీలతో యమగూచిని ఇంటికి పంపింది. ఇక బాక్సర్‌ లవ్లీనా సంచలన ఆటతీరుతో సెమీ్‌సకు చేరి దేశానికి మరో పతకాన్ని ఖాయం చేసింది. హాకీ జట్లకు విజయాలు లభించగా ఎనిమిదో రోజు ఆర్చర్‌ దీపికా, షూటర్‌ మనూ భాకర్‌కు నిరాశే ఎదురైంది. ఇక అథ్లెటిక్స్‌లో మనకు తొలి రోజే ప్రతికూల ఫలితాలు లభించాయి.

  

టోక్యో: వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు విజయపరంపర కొనసాగుతోంది. తన అద్భుత ప్రదర్శనతో పతక ఆశలపై భరోసానిస్తూ సెమీఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌)పై 21-13, 22-20 తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు సింధు ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. సెమీస్‌లో తన ప్రధాన శత్రువు, నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌తో సింధు తలపడనుంది. 56 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్స్‌లో 26 ఏళ్ల సింధు అత్యుత్తమ ఆటతీరును చూపింది. ప్రత్యర్థి ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు చూసినా సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. తొలి గేమ్‌లో 2-4తో వెనుకబడినా.. 6-6తో సింధు పోటీలోకొచ్చింది. బ్రేక్‌ సమయానికి చక్కటి క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌ ద్వారా 11-7తో  ఆధిక్యం సాధించింది. కానీ రెండో గేమ్‌ మాత్రం థ్రిల్లర్‌ను తలపించింది.


8-13తో వెనుకబడిన దశలో యమగూచి వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించడంతోపాటు ఆపై 16-15తో ముందంజ వేసింది. ఈ సమయంలో తను సుదీర్ఘ ర్యాలీలతో సింధు శక్తిని హరించేలా ప్రయత్నించింది. ఓ ర్యాలీ అయితే ఏకంగా 54 స్ట్రోక్స్‌ పాటు సాగింది. ఇక్కడి నుంచి ఇద్దరి మధ్య అసలైన ఆట కనిపించింది. ఓ దశలో 20-18తో యమగూచి రెండో గేమ్‌ను గెలుచుకునే అవకాశం వచ్చినా సింధు పట్టువీడలేదు. అద్భుత స్మాష్‌లతో విరుచుకుపడి 22-20తో మ్యాచ్‌ను ముగిస్తూ విజయనాదం చేసింది.


భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అంచనాలకు తగ్గట్టే అదరగొడుతోంది. స్వర్ణమే లక్ష్యంగా దేశం గర్వించదగ్గ ఆటతో.. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్‌లో పవర్‌ఫుల్‌ స్మాష్‌, ర్యాలీలతో యమగూచిని ఇంటికి పంపింది. ఇక బాక్సర్‌ లవ్లీనా సంచలన ఆటతీరుతో సెమీ్‌సకు చేరి దేశానికి మరో పతకాన్ని ఖాయం చేసింది. హాకీ జట్లకు విజయాలు లభించగా ఎనిమిదో రోజు ఆర్చర్‌ దీపికా, షూటర్‌ మనూ భాకర్‌కు నిరాశే ఎదురైంది. ఇక అథ్లెటిక్స్‌లో మనకు తొలి రోజే ప్రతికూల ఫలితాలు లభించాయి.


మహ్మదలీ  స్ఫూర్తితో..

ఈశాన్య రాష్ట్రాల నుంచి వెలుగు చూసిన మరో బాక్సర్‌ లవ్లీనా బోర్గొహైన్‌. అసోం.. గోల్ఘార్‌ జిల్లాలోని బరా ముఖియా గ్రామం ఆమె స్వస్థలం. తండ్రి టికెన్‌ చిరు వ్యాపారి కాగా.. తల్లి మమోనీ గృహిణి. చిన్నతనం నుంచే లవ్లీనాకు ఆటలపై ఆసక్తి ఉండేది. కవలలైన అక్కలు లాచా, లిమాలతో కలసి మువాయ్‌ థాయ్‌ అనే మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్‌ చేసేది.

అలీ స్ఫూర్తితో..:

దిగ్గజ బాక్సర్‌ మహ్మద్‌ అలీ జీవితం.. ఎంతో స్ఫూర్తిదాయకం. యాదృచ్ఛికంగా ఆయన గురించి తెలుసుకున్న లవ్లీనా.. బాక్సింగ్‌వైపు ఆకర్షితురాలైంది. ఆమె చిన్నతనంలో.. తండ్రి కొన్ని మిఠాయిలను ఓ న్యూస్‌ పేపర్‌లో చుట్టుకొని తీసుకువచ్చాడట..! అయితే, స్వీట్స్‌ తీసుకొని కాగితాన్ని పారేశారు. కానీ, ఆ పేపర్‌లో మహ్మద్‌ అలీ గురించి రాసిన ఓ ఆర్టికల్‌ను చదివిన లవ్లీనా ఎంతో స్ఫూర్తిపొందిందని ఆమె తల్లి తెలిపింది. మైక్‌ టైసన్‌కు కూడా పెద్ద అభిమాని అని చెప్పింది. ఆరంభంలో మువాయ్‌ థాయ్‌ నేర్చుకున్న లవ్లీనా.. ఆ తర్వాత బాక్సింగ్‌కు వైపు మళ్లింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన సాయ్‌ కోచ్‌.. ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేశాడు. అప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు. 2018, 2019 వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో కాంస్య పతకాలతో ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకుంది. ప్రస్తుతం టోక్యోలో ఆమె తలపడుతున్న బరువు విభాగంలో అందరికంటే లవ్లీనానే ఎత్తు. అదే ఆమెకు కలిసొచ్చే అంశం.  


అమ్మ కోసం..

ఈ ఏడాది ఫిబ్రవరిలో లవ్లీనా తల్లికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దీంతో లవ్లీనా శిబిరాన్ని వదిలేసి ఇంటికి చేరాల్సివచ్చింది. ఓ వైపు పొలంలో తండ్రికి సాయపడుతూనే, మరోవైపు తల్లి ఆరోగ్యాన్ని కూడా చూసుకునేది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఉన్న సిలిండర్లతో  కసరత్తులు చేసింది. తాను ఎలాగైనా ఒలింపిక్‌ పతకం సాధిస్తానని దీమాగా చెప్పేది. ఇప్పుడు అనుకున్నది సాధించింది. 


తైజుతో జాగ్రత్త..

క్వార్టర్స్‌లో యమగూచిని చిత్తుచేసిన సింధుకు ఇప్పుడిక అసలైన సవాల్‌ ఎదురవనుంది. ఎందుకంటే సెమీఫైనల్‌ ప్రత్యర్థి ఎవరో కాదు ప్రస్తుత ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌. చైనీస్‌ తైపీకి చెందిన 27 ఏళ్ల తై జుతో ముఖాముఖి రికార్డులో సింధు వెనుకంజలో ఉంది. ఇద్దరూ ఇప్పటిదాకా 18 సార్లు తలపడితే.. ఏకంగా 13 మ్యాచుల్లో తై జు గెలుపొందింది. అంతేకాదు.. ఇద్దరి మధ్య జరిగిన చివరి మూడు మ్యాచుల్లోనూ సింధు ఓటమిపాలైంది. నిరుడు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌తో పాటు ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచి తై జు జోరు మీదుంది. అయితే, టోక్యోలో ఒక్క గేమ్‌ కూడా చేజార్చుకోకుండా సెమీస్‌ చేరిన సింధు.. తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా చిత్తుచేయడంలో ఘనాపాటి. మరి.. తై జును ఓడించి వరుసగా రెండోసారి సింధు ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టిస్తుందా చూడాలి. 


 బాక్సింగ్‌

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అసోం యువ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ (64-69 కేజీ) సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో లవ్లీనా ప్రపంచ మాజీ చాంపియన్‌ నీన్‌ చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై 4-1తో గెలిచింది. దీంతో మేరీ కోమ్‌ నిరాశపరిచిన చోట 23 ఏళ్ల లవ్లీనా కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. గతేడాది కరోనాతో బాధపడి యూర్‌పలో శిక్షణ శిబిరానికి హాజరుకాలేకపోయినా ఈ స్థాయి ఆటతీరుతో ఆకట్టుకోగలిగింది. గతంలో తనను ఓడించిన చిన్‌ చెన్‌పై లవ్లీనా ఈసారి దూకుడు కాకుండా వ్యూహాత్మక పంచ్‌లను విసిరింది. తన ఎత్తును అవకాశంగా తీసుకుంటూ కౌంటర్‌ ఎటాకింగ్‌కు దిగి ఫలితం రాబట్టింది. మరోబౌట్‌లో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (57-60కేజీ) ప్రీక్వార్టర్స్‌లో 1-5తో సుడపోర్న్‌ సీసాండీ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది.


 హాకీ

వరుసగా మూడు పరాజయాల తర్వాత మహిళల హాకీ జట్టుకు విజయం లభించింది. ప్రపంచ ఏడో ర్యాంక్‌ జట్టు ఐర్లాండ్‌పై 1-0తో గెలిచి క్వార్టర్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నవ్‌నీత్‌ కౌర్‌ (57) ఏకైక గోల్‌ను సాధించింది. శనివారం జరిగే చివరి పూల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌కు గెలుపు అత్యవసరం. అలాగే గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగే మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓడిపోతేనే మనోళ్లకు క్వార్టర్స్‌ చాన్స్‌ ఉంటుంది. పురుషుల హాకీ జట్టు ఆఖరి పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌లో 5-3తో జపాన్‌ను ఓడించి అధికారికంగా క్వార్ట ర్స్‌ చేరింది. అలాగే తాజా వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఫురుషుల హాకీ జట్టు తొలిసారిగా మూడో స్థానంలో నిలవడం విశేషం.


అథ్లెటిక్స్‌

ప్రారంభ రోజునే భారత అథ్లెట్లు నిరాశపరిచారు. మహిళల 100మీ. హీట్స్‌లో ద్యూతీ చంద్‌ (11.54సె.) ఏడో స్థానంలో నిలిచి నిష్క్రమించింది. ఇక 3000మీ. స్టీపుల్‌ చేజ్‌ హీట్‌లో అవినాశ్‌ సబ్లే కూడా ఏడో స్థానంలో నిలిచాడు. అయితే 8.18.12 టైమింగ్‌తో అతడు జాతీయ రికార్డు నెలకొల్పాడు. పురుషుల 400మీ. హర్డిల్స్‌లో మదరి పల్లియలిల్‌ 50.77సెకన్లతో ఏడో స్థానంలో చివర నిలిచాడు. మిక్స్‌డ్‌ 4్ఠ400మీ. రిలేలో భారత బృందం ఆఖరు (8)న నిలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించలేదు.


ఆర్చరీ

వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ స్టార్‌ ఆర్చర్‌ దీపికా కుమారి పతక ఆశలకు బ్రేక్‌ పడింది. మహిళల వ్యక్తిగత క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ అన్‌ సాన్‌ (కొరియా) చేతిలో దీపిక 0-6 తేడాతో చిత్తుగా ఓడింది. తన పేలవ ప్రదర్శనతో మూడు సెట్లలోనే పోరు ముగిసింది. అంతకుముందు ప్రీక్వార్టర్స్‌లో దీపికా 6-5తో రష్యా ఆర్చర్‌ సెనియాను ఓడించింది.


షూటింగ్‌

మహిళల 25మీ. పిస్టల్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌, రాహీ సర్నోబాత్‌ల పోరాటం ముగిసింది. ప్రెసిషన్‌లో ఐదో స్థానంలో నిలిచిన మనూ ర్యాపిడ్‌ ఫైర్‌లో 290 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తంగా 582 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు వెళ్లలేకపోయిరది. రాహీ సర్నోబాత్‌కు 32వ స్థానం దక్కింది.

 

సెయిలింగ్‌

మహిళల లేజర్‌ రేడియల్‌ తొమ్మిదో రేసులో నేత్రా కుమనన్‌ 33వ, పదో రేసులో 35వ స్థానంలో నిలవగా.. 49 ఇఆర్‌ ఎనిమిది, తొమ్మిదో రేసుల్లో గణపతి-వరుణ్‌ జోడీ 17వ స్థానాల్లో నిలిచింది. పురుషుల లేజర్‌లో విష్ణు శరవణన్‌ తొమ్మిది, పదో రేసుల్లో 20వ స్థానాల్లో నిలిచాడు.


 ఈక్వెస్ట్రియన్‌

ఫౌవాద్‌ మీర్జా డ్రెస్సేజ్‌ రౌండ్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఆదివారం క్రాస్‌ కంట్రీలో పాల్గొంటాడు.

Updated Date - 2021-07-31T08:34:41+05:30 IST