భార‌త్, జ‌ర్మ‌నీ మ‌ధ్య విమాన స‌ర్వీసుల‌పై.. లుఫ్తాన్సా కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ABN , First Publish Date - 2021-05-17T01:25:57+05:30 IST

భార‌త్, జ‌ర్మ‌నీ మ‌ధ్య విమాన స‌ర్వీసులు న‌డిపించ‌డంపై లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

భార‌త్, జ‌ర్మ‌నీ మ‌ధ్య విమాన స‌ర్వీసుల‌పై.. లుఫ్తాన్సా కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌: భార‌త్, జ‌ర్మ‌నీ మ‌ధ్య విమాన స‌ర్వీసులు న‌డిపించ‌డంపై లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దుబాయ్ బ‌దులు బ‌హ్రెయిన్ మీదుగా భార‌త్‌కు వీక్లీ 10 విమాన స‌ర్వీసులు న‌డిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం యూఏఈ ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై విధించిన ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇవాళ్టి(మే 16) నుంచే ఈ స‌ర్వీసులు ప్రారంభం అవుతాయ‌ని తెలిపింది. ఫ్రాంక్‌ఫ‌ర్ట్ నుంచి బ‌హ్రెయిన్ మీదుగా భార‌త్‌లోని ముంబై, బెంగ‌ళూరు, ఢిల్లీ న‌గ‌రాల‌కు విమానాలు న‌డ‌ప‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. 


ఇక క‌రోనా కార‌ణంగా అత‌లాకుత‌లం అవుతున్న భార‌త్‌కు ఎమ‌ర్జెన్సీ వైద్య సామాగ్రిని త‌ర‌లించ‌డంలో త‌మ సంస్థ సాయం కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌మ విమానాల్లో జ‌ర్మ‌నీ, ఇత‌ర దేశాల నుంచి ట‌న్నుల కొద్ది అత్య‌వ‌స‌ర వైద్య సామాగ్రిని భార‌త్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపింది. వీటిలో టీకాలు, రెస్పిరేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేట‌ర్లతో పాటు ఇత‌ర కీల‌క వైద్య ప‌రిక‌రాలు ఉన్నాయంది. ఇదిలాఉంటే.. భార‌త్ గ‌తేడాది మార్చి 23 నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. కానీ, సుమారు 27 దేశాల‌తో ఎయిర్ బ‌బూల్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ దేశాల నుంచి భార‌త్‌కు ప్ర‌త్యేక‌ విమాన స‌ర్వీసులు న‌డుస్తున్నాయి. ఈ దేశాల జాబితాలో జ‌ర్మ‌నీ కూడా ఉంది. గ‌తేడాది జూలై నుంచి ప్ర‌త్యేక ఆంక్షల నడుమ ఈ విమాన స‌ర్వీసులు ప‌ని చేస్తున్నాయి.   

Updated Date - 2021-05-17T01:25:57+05:30 IST