ముందుతరానికి పండగ-తోరణం!

ABN , First Publish Date - 2022-01-15T06:38:54+05:30 IST

నగరాల్లో వుండిపోయి నాగరీకం అలవాటుపడి ఊరు మారిపోయిందనుకున్నాను మారిపోయింది ఊరు కాదు....

ముందుతరానికి పండగ-తోరణం!

నగరాల్లో వుండిపోయి

నాగరీకం అలవాటుపడి

ఊరు మారిపోయిందనుకున్నాను

మారిపోయింది ఊరు కాదు, నేను.

ధనుర్మాసపు రోజులు కదా!

ఊరు పొలిమేరల నుంచే ముస్తాబైంది.

ప్రతి చెట్టూ స్వాగత తోరణం పట్టుకుంది

కళ్ళాపి చల్లి, ముగ్గులు తీర్చిన ముంగిళ్ళు

ఆనందపు లోగిళ్ళు.


గొబ్బెమ్మలు సరే, పూలు ముడుచుకుని

భూమి మీదకొచ్చిన నక్షత్రాల్లా వున్నాయి.

గంగిరెద్దు ఆటలు, పులివేషాల విన్యాసాలు

పండగపూట మా ఊరు తగిలించుకున్న 

ముఖచిత్రంలా వున్నాయి.

కుర్రతనం పోటీపడుతున్న కబడీ ఆటలు

పెద్దరికం హద్దులు చెరిపేసిన కోడిపందాలు.

రంగులరాట్నాలతో హోరెత్తించే తీర్థాలు

విచిత్ర వేషధారణలతో

జాతరలు.


ఒకటేమిటి?

ఊరు ఊరంతా హడావిడి.

హరిదాసులు నడచి వస్తుంటే

వీధులన్నీ కళాప్రాంగణాల్లా వున్నాయి.

వేణుగోపాలస్వామి ఆలయం

సూర్యుడి కన్నా ముందే నిద్రలేచి,

ఊరు వాడా జనాన్ని

తిరుప్పావై గానాలతో మేల్కొలపడం

ఇప్పటికీ ఆశ్చర్యంగానే వుంటుంది.


గుమ్మాలన్నీ ఘుమ ఘుమలాడి పోతున్నాయి.

చక్కర పొంగలి, దద్దోజనాలు

దేవుడి నైవేద్యానికి

మినపగారెలు, అరిసెలు

విందు భోజనానికి

గుమ్మడి పులుసు, పనసపొట్టు కూరలు

అనుపానానికి

సిద్ధం అంటూ సువాసనలు జారీ చేస్తున్నాయి.


కొత్త బట్టలు కట్టుకుని

మధ్యాహ్నపు మండుటెండలో

డాబా మీదకి ఎక్కితే

మాంజా దారాలతో ముడివేసిన

రంగు రంగుల గాలిపటాల మేళా.


బాల్యం నుంచీ నేనెరిగిన

సంక్రాంతి శోభను

మనవళ్ళకి, మనవరాళ్ళకి అందించాలి.

నిన్న నాన్న కట్టిన సంక్రాంతి తోరణంలో

నేనూ ఒక మామిడికొమ్మను కదా!

ఇప్పుడు నేను కట్టే పండగ తోరణంలో

పిల్లల నవ్వులు

పువ్వులై పూయాలి.


ఆ సంతసాలు

తెలుగు సంస్కృతికి పాదులు తీయాలి.


– మద్దాళి రఘురామ్‌

Updated Date - 2022-01-15T06:38:54+05:30 IST