రావాలంటే.. బాదాల్సిందే!

ABN , First Publish Date - 2020-03-10T10:16:54+05:30 IST

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తిరిగి భారత జట్టు జెర్సీ వేసుకోలేదు. ఈ ఎనిమిది నెలల కాలంలో జట్టులో ఎందుకు లేడనే విషయంలో ఎవరికీ

రావాలంటే.. బాదాల్సిందే!

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తిరిగి భారత జట్టు జెర్సీ వేసుకోలేదు. ఈ ఎనిమిది నెలల కాలంలో జట్టులో ఎందుకు లేడనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం అతడికి విశ్రాంతినిస్తున్నారా.. లేక తనంతట తాను కొన్నాళ్లపాటు జట్టుకు దూరంగా ఉంటున్నాడా? అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మిగిలింది. అటు ధోనీ కానీ ఇటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. అయితే రాబోయే ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. 


ధోనీ రీఎంట్రీకి  ఐపీఎల్‌ కీలకం

సెలెక్షన్‌ కమిటీదీ  అదే మాట


నిజానికి దేశంలో ఇంకా ఐపీఎల్‌ ఫీవర్‌ ప్రారంభం కాలేదు.. కానీ భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అందరికన్నా ముందే తన సన్నాహకాలను ప్రారంభించేశాడు. అందుబాటులో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌  (సీఎ్‌సకే) ఆటగాళ్లతో జోరుగా ప్రాక్టీ్‌సలో మునిగిపోయాడు. నెట్స్‌లో సిక్సర్లతో బౌలర్లపై దాడికి దిగుతున్నాడు. అయితే ఇంటా.. బయటా అంతా రిటైర్మెంట్‌ గురించి చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఐపీఎల్‌ అతడి కెరీర్‌కు అత్యంత కీలకం కానుంది. గత సీజన్‌లో ముంబైపై తృటిలో టైటిల్‌ను కోల్పోయిన తమ జట్టుకు ఈసారి కచ్చితంగా కప్‌ అందించాలనే కసితో పాటు బ్యాట్స్‌మన్‌గానూ రాణించి తన స్టామినా ఏమిటో చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిన అనంతరం పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో భారత్‌ ఎన్ని సిరీ్‌సలు ఆడినా అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అటు బీసీసీఐ వార్షిక ఒప్పంద ఆటగాళ్ల జాబితా నుంచి కూడా తొలగించారు. అయితే ఇదే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉండడంతో ఈ అపార అనుభవజ్ఞుడి విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచన ఎలా ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది.


లీగ్‌లో నిరూపించుకోవాల్సిందే..

జాతీయ జట్టులో ధోనీ పునరాగమనం చేయాలంటే ఐపీఎల్‌లో రాణించాల్సిందేనని నూతన సెలెక్షన్‌ కమిటీ కూడా స్థిరమైన అభిప్రాయంతోనే ఉన్నట్టు బోర్డు వర్గాల సమాచారం. అలాగైతేనే అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచక్‌పలో చోటు దక్కదన్నది నిర్వివాదాంశం. జోషితో పాటు మరో నూతన సెలెక్టర్‌ హర్విందర్‌ సింగ్‌తో కలిసి కొత్త సెలెక్షన్‌ కమిటీ ఆదివారం సమావేశమైంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపిక చేయగా.. ఎప్పటిలాగే ధోనీ పేరును ఇందులో చర్చించలేదు. యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను అతడి స్థానంలో చాలాకాలం నుంచి ప్రోత్సహిస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో ధోనీ రాకపై బోర్డు అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘రానున్న ఐపీఎల్‌లో మెరుగ్గా ఆడితేనే అతడు జాతీయ జట్టులోకి మళ్లీ వస్తాడు.అతనొక్కడే కాదు.. చాలామంది సీనియర్‌, యువ ఆటగాళ్లు కూడా లీగ్‌లో ఆడనున్నారు. ఒకవేళ వారు కూడా రాణిస్తే మా దృష్టిలో పడినట్టే. అందుకే జట్టు ఎంపిక అందరినీ ఆశ్చర్యపరచవచ్చు కూడా’ అని ఆయన తేల్చారు. గతంలోనే కోచ్‌ రవిశాస్త్రి కూడా ఐపీఎల్‌ ప్రదర్శ కీలకమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.


ధోనీ రాక సాధ్యమే..

భారత జట్టులో చోటు కోసం ఎంఎస్‌ ధోనీకి ద్వారాలేమీ మూసుకుపోలేదు. ఎందుకంటే ఎంఎస్‌ తర్వాత కీపర్‌గా పంత్‌ను ఎంతగా ప్రోత్సహిస్తున్నా అతడి నుంచి ఆశించిన ప్రదర్శన కనిపించడం లేదు. ఈ విషయంలో బయటి నుంచి ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా అద్భుత నైపుణ్యం కలిగిన వాడిగా పంత్‌ వైపే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపుతోంది. అయితే ఈ మధ్యకాలంలో కేఎల్‌ రాహుల్‌ను ఫుల్‌టైమ్‌ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా జట్టు నమ్ముకోవాల్సి వస్తోంది. ఇది అతడిపై భవిష్యత్‌లో ఒత్తిడిపెంచి అసలుకే మోసం తేవచ్చు. అందుకే ఓరకంగా స్పెషలిస్ట్‌ కీపర్‌ పాత్ర ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఏదిఏమైనా ఐపీఎల్‌లో దుమ్మురేపితే ధోనీ స్థానానికి ఢోకా లేదనేది కాదనలేని సత్యం.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)  


Updated Date - 2020-03-10T10:16:54+05:30 IST