క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి.. కటకటాలపాలైన భారతీయుడు!

ABN , First Publish Date - 2020-08-14T01:42:16+05:30 IST

క్వారెంటైన్ నిబంధనలు ఉల్లంఘించి, ఇతరులు వైరస్ బారిన పడటానికి కారణమైన ఓ భారతీయుడు మలేషియాలో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.

క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి.. కటకటాలపాలైన భారతీయుడు!

కౌలాలంపూర్: క్వారెంటైన్ నిబంధనలు ఉల్లంఘించి, ఇతరులు వైరస్ బారిన పడటానికి కారణమైన ఓ భారతీయుడు మలేషియాలో  కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. 57ఏళ్ల భారతీయుడు గత కొన్నేళ్లుగా మలేషియాలో నివసిస్తున్నాడు. మలేషియాలోని కేదా రాష్ట్రంలో ఆయనకు ఓ రెస్టారెంట్ ఉంది. కాగా.. కరోనాకు ముందు ఆ వ్యక్తి.. ఇండియాకు వచ్చి లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకున్నాడు. ఈ క్రమంలో ఆయన గత నెలలో తిరిగి మలేషియాలో వెళ్లాడు. ఈ నేపథ్యంలో మలేషియా అధికారులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ 14 రోజులపాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు ఆయనకు సూచించారు. అయితే ఆ 57ఏళ్ల భారతీయుడు మాత్రం.. క్వారెంటైన్ నిబంధనలను ఉల్లంఘించి తన రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి మరోసారి కరోనా పరీక్షలు చేయగా.. అందులో అతను కరోనా బారినపడ్డట్లు తేలింది. అంతేకాకుండా అతని కుటుంబ సభ్యులు.. రెస్టారెంట్ సిబ్బందికి కూడా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి.. మరికొందరు కరోనా బారినపడటాకనికి కారణమయ్యాడనే ఆరోపణలతో 57ఏళ్ల భారతీయుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా ఆ వ్యక్తి తప్పు ఒప్పుకోవడంతో.. కోర్టు అతనికి 5నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా దాదాపు 3వేల డాలర్ల జరిమానా విధించింది. ఇదిలా ఉంటే మలేషియాలో ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది కరోనాబారినపడగా.. 125 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-08-14T01:42:16+05:30 IST