హోరెత్తిన కొమురవెల్లి మల్లన్న పట్నంవారం

ABN , First Publish Date - 2022-01-17T01:11:38+05:30 IST

కోరమీసాల మల్లన్నకు హైదరాబాద్‌కు చెందిన యాదవభక్తులు బోనమెత్తారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానఘట్టమైన

హోరెత్తిన కొమురవెల్లి మల్లన్న పట్నంవారం

చేర్యాల: కోరమీసాల మల్లన్నకు హైదరాబాద్‌కు చెందిన యాదవభక్తులు బోనమెత్తారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానఘట్టమైన పట్నంవారాన్ని ఆదివారం అత్యంత భక్తిప్రపత్తులతో ఘనంగా జరుపుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల చిందులతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. వేలాదిమంది భక్తులు తరలిరావడంతో కొమురవెల్లి జనసంద్రంగా మారింది. మల్లన్నకు సాంప్రదాయబద్ధంగా భక్తిప్రపత్తులతో బోనాలు తయారుచేసి నైవేద్యాన్ని నివేదించారు. బసచేసిన ప్రాంతంలో, ఆలయ గంగరేగుచెట్టు ప్రాంతంలో, ముఖ మండపంలో మల్లన్నకు చిలుకపట్నం, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని చీర, సారెలతో ఒడిబియ్యాలు పోశారు. తమ కోర్కెలు నెరవేర్చని గంగరేగుచెట్టుకు ముడుపులు కట్టారు. సంతానం కలిగించాలంటూ మహిళలు వల్లుబండ వద్ద వరంపట్టారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లికి బోనం నివేదించి, బెల్లంపానకం, కల్లు శాకపెట్టి ఒడిబియ్యం పోసి తమ కోర్కెలు ఈడేర్చమని వేడుకున్నారు.

Updated Date - 2022-01-17T01:11:38+05:30 IST