జీతం ఇవ్వలేదని.. యజమానిని ఉద్యోగి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-03-20T15:42:29+05:30 IST

జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన యజమానిని ఉద్యోగి అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన అజ్మాన్‌లో చోటుచేసుకుంది.

జీతం ఇవ్వలేదని.. యజమానిని ఉద్యోగి ఏం చేశాడంటే..

అజ్మాన్: జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన యజమానిని ఉద్యోగి అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన అజ్మాన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 35 ఏళ్ల నిందితుడు తనతో పాటు తన తోటి తొమ్మిది మంది ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా యజమానిని సాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో అతడ్ని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా హత్య జరిగిన ముందురోజు యజమానితో తమ జీతాల విషయమై మాట్లాడాడు నిందితుడు. దాంతో యజమాని ఓ కాఫీ షాపు వద్ద కలుద్దామని చెప్పాడు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బాస్‌పై కక్ష పెంచుకున్న అతగాడు.. ముందే ఓ ప్లాస్టిక్ కవర్‌లో కత్తితో అతను చెప్పిన చోటుకు చేరుకున్నాడు. 


తోటి ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వెంటనే తమకు సాలరీ ఇవ్వాలని యజమానితో అన్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ముందే తనతోపాటు తీసుకెళ్లిన కత్తితో యజమానిని పలుమార్లు పొడిచాడు. అతని నుంచి బాస్ తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి మరీ గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి, తాజాగా కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో 4 నెలలుగా యజమాని జీతాలు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. తోటి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతోనే ఇలా బాస్‌ను పొడిచి చంపేసినట్లు కోర్టుకు తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది.          


Updated Date - 2021-03-20T15:42:29+05:30 IST