Abn logo
Sep 19 2021 @ 00:14AM

మనమ్మాయి మిస్‌ సింగపూర్‌

  • వలస వెళ్లిన దేశంలో స్వదేశీయులను అధిగమించి, నెగ్గుకురావడం కష్టం. 
  • అలాంటిది.. అందాల పోటీలో ఏకంగా ఏడుగురు ఫైనలిస్టు అందగత్తెలను వెనక్కి నెట్టి, 
  • మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుందో అమ్మాయి.
  • ఆ 21 ఏళ్ల అందాల బొమ్మ మన తెలుగమ్మాయి కావడం విశేషం!
  • అటు చదువులో, ఇటు అభిరుచిలో సమానంగా రాణిస్తున్న, బాన్న నందిత తల్లితండ్రులు 
  • నవ్యతో మాట్లాడారు. 
  • వాళ్లు పంచుకున్న నందితకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు... 


‘‘లితాన్ని పట్టించుకోకుండా చేసే పని మీద దృష్టి పెట్టాలి అని మా పిల్లలిద్దరికీ చెప్పేవాళ్లం. కాబట్టేనేమో నందిత తను ఏ పనిని ఎంచుకున్నా పూర్తి మనసు పెట్టి చేస్తుంది. చదువులో, అభిరుచుల్లో తను రాణించడానికి కారణం ఆ గుణమే! పాతికేళ్లకు పూర్వం మేం ఉద్యోగరీత్యా సింగపూర్‌ వలస వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నందిత పుట్టింది. అయితే తనకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గురించిన అవగాహన కల్పించడం కోసం విశాఖపట్నంలోని టింఫనీ స్కూల్లో 5, 6, 7 తరగతులు చదివించాం. ఆ తర్వాత సింగపూర్‌లో ప్రతిష్ఠాత్మకమైన రాఫుల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించాం. ఈ స్కూల్లో సీటు దొరకడం చాలా కష్టం. అయినప్పటికీ నందిత ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో మెరుగ్గా రాణించి, సీటు దక్కించుకోగలిగింది. ఈ స్కూల్లో 8 నుంచి 12వ తరగతి వరకూ చదివి, సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్శిటీలో డబుల్‌ డిగ్రీ చేసే అర్హత పొందింది. సాధారణంగా ఒకే సమయంలో డబుల్‌ డిగ్రీ చేసే అవకాశం అందరికీ దొరకదు. అందుకు చదువులో ఎంతో రాణించి ఉండాలి. చదువులో ముందుండడం, రాఫుల్స్‌లో చదువుకుని ఉండడం నందితకు అదనపు అర్హతలయ్యాయి. దాంతో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టం మేనేజ్‌మెంట్‌... రెండింట్లోనూ డిగ్రీ చేసే అవకాశం పొందింది. నందిత తమ్ముడు హర్ష సౌరవ్‌ కూడా మెరుగైన విద్యార్థే. ప్రస్తుతం కెనడా, వాంకోవర్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు.

అంచెలంచెలుగా పదును పెట్టుకుంటూ...

రాఫుల్స్‌లో చదువుకునేటప్పుడే క్లబ్‌లోని సాంస్కృతిక కార్యక్రమాల్లో నందిత చురుగ్గా పాల్గొనేది. తనకు సంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలను కలిపి మిక్స్‌డ్‌ జోనర్‌ డాన్స్‌ చేయడం ఇష్టం. హిప్‌హాప్‌ను తలపించే ఆ నృత్యాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. అలా కాలేజీలో అడుగు పెట్టిన నాటి నుంచే ఫ్యాషన్‌, మోడల్‌ ఏజెన్సీల దృష్టిలో పడింది. అలా గత మార్చి నెలలో లూయి విట్టాన్‌ విమెన్స్‌ స్ర్పింగ్‌ సమ్మర్‌ 2021కు మోడల్‌గా పని చేసింది. ప్రపంచ ప్రఖ్యాత వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీలో కూడా నందిత ఫొటో ప్రచురితమైంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌ పోటీలకు కూడా గెలవాలనే పట్టుదలతో కాకుండా, పోటీలు జరిగే తీరును ఆస్వాదించడం కోసం పోటీల్లోకి ప్రవేశించింది. అయితే నందిత ఈ అందాల పోటీల కోసమే కాదు, దేన్లోనూ ఎప్పుడూ, ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. నిజానికి అందాల పోటీల్లో పాల్గొనాలనే తన నిర్ణయాన్ని కూడా మాకు ముందుగా చెప్పలేదు. అప్లికేషన్‌ ఇచ్చిన తర్వాత యధాలాపంగా మాతో చెప్పింది. అయితే తనకిష్టమైన పని చేస్తున్నప్పుడు, ప్రోత్సహించడమే తప్ప, అడ్డుచెప్పే అలవాటు మాకు లేదు. 

ఆ క్రెడిట్‌ ఆమెదే!

ఒక ప్రవాస భారతీయురాలిగా సింగపూర్‌లోని అందాల పోటీల్లో గెలవడం అనేది చిన్న విషయం కాదు. నందిత గెలుపునకు కారణం ఆమెకున్న ప్రత్యేకతలే అని మా గట్టి నమ్మకం. మోడలింగ్‌, డాన్సింగ్‌, సమాజ సేవ, పర్యావరణ స్పృహ నందిత ప్రత్యేకతలు. ఇంట్లో సైతం ప్లాస్టిక్‌ వాడకాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. రీసైక్లింగ్‌ చేయిస్తూ ఉంటుంది. నందిత కేర్‌ కార్నర్‌ సింగపూర్‌ వాలంటీర్‌ కూడా. ఆ సంస్థ తరఫున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పిల్లలకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటుంది. నిధులను సేకరిస్తూ, పిల్లలకు ఆర్ట్‌ మెటీరియల్‌ లాంటివి పంచి పెడుతూ ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇజ్రాయెల్‌లో జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో నందిత పాల్గొనవలసి ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే సన్నాహకం తప్పదు. తాజా విజయం తాలూకు కార్యక్రమాల్లో ప్రస్తుతం నందిత మునిగిపోయి ఉంది. అయితే ఈ పోటీలలాగే, మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో కూడా, విజయం కోసం కాకుండా పోటీలో పాల్గొనే ప్రక్రియను ఆనందించడమే ప్రధానంగా నందిత నడుచుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఆ పోటీల్లో నందిత మిస్‌ యూనివర్స్‌గా గెలిస్తే, ఆ క్రెడిట్‌ పూర్తిగా ఆమెకే సొంతం! 

- బాన్న మాధురి (నందిత తల్లి)


ప్రస్తుతం సింగపూర్‌లో ఏవియేషన్‌ సప్లై చెయిన్‌ సీనియర్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాను. నాది శ్రీకాకుళం. సివిల్‌ ఇంజినీరింగ్‌ బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలర్‌గా పని చేస్తున్న భార్య మాధురి వాళ్లది విజయవాడ దగ్గరున్న ఉయ్యూరు. అత్తగారి ఊరు వెళ్లినప్పుడు దార్లో విజయవాడలోని కనకదుర్గ గుడికి వెళ్లి, అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు. అమ్మవారి వదనంలోని ప్రసన్నత నన్ను కట్టిపడేసేది. నందిత పుట్టినప్పుడు అమ్మవారి చిరుదరహాసం పాపలోనూ నాకు కనిపించింది. అందుకే అమ్మవారి ప్రతిరూపాన్ని తలపించే పేరునే పాపకు పెట్టుకున్నాం. నందిత అంటే సౌమ్యమైన దుర్గాదేవి అని అర్థం. 

- బాన్న గోవర్ధన్‌, (నందిత తండ్రి)


నందితకు చికెన్‌ టిక్కా ఇష్టం. కారంగా ఉండేవి, కరకరలాడేవీ ఇష్టంగా తింటుంది. తన ఇష్టానికి తగ్గట్టు ప్రయాణాల్లో అలాంటి స్నాక్స్‌ అందిస్తూ ఉంటాం. మోడలింగ్‌కు సూటయ్యే నాజూకైన శరీర లావణ్యం నందితకు స్వతహాగానే అందింది. డైటింగ్‌ అంటూ ప్రత్యేంగా దేన్నీ అనుసరించదు. పరిమితంగా తింటుంది. తనకున్న డాన్స్‌ అభిరుచితో నందితకు అవసరమైన వ్యాయామం దక్కుతుంది. నందిత అందం వెనకున్న రహస్యాలు అవే!


నందిత చిట్‌ చాట్‌!

ఖాళీ సమయాల్లో: స్కేటింగ్‌, డాన్సింగ్‌, కుకింగ్‌

సిగ్నేచర్‌ వంటకం: ఆమ్లెట్‌. ఎందుకంటే దాన్ని చేయడం తేలిక.

తీపి లేదా కారం: కారం

సింగపూర్‌లో నచ్చింది: భిన్నమైన వ్యక్తులను కలవడం

చిరునవ్వు తెప్పించే అంశం: కుటుంబం ఆనందంగా ఉండడం

సింగపూర్‌: వైవిద్యభరితమైన చిన్న దేశం

స్వాంతన: ప్రకృతిలో మమేకమై దూరాలు నడవడం

సుస్థిరత: భూగ్రహాన్ని మనందరం కాపాడుకోవాలి. మనం చేయకపోతే, ఇంకెవరు చేస్తారు?

నచ్చే రంగు: ఆకుపచ్చ