‘దళితబంధు’ పేరుతో మరో మోసానికి సీఎం కుట్ర

ABN , First Publish Date - 2021-08-02T07:30:43+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘దళితబంఽధు’ పథకం పేరుతో దళితులను మరోసారి మోసగించేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.

‘దళితబంధు’ పేరుతో   మరో మోసానికి సీఎం కుట్ర

ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే ఆ పథకం అమలు చేయాలి

నేటి నుంచి జిల్లాల వారీగా సదస్సులు

వచ్చే నెల 5న హుజూరాబాద్‌లో దళిత గర్జన: మంద కృష్ణమాదిగ


భువనగిరి టౌన్‌, ఆగస్టు 1: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘దళితబంఽధు’ పథకం పేరుతో దళితులను మరోసారి మోసగించేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతిపై సీఎంకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితబంధును ఉపఎన్నిక నోటిఫకేషన్‌కు ముందే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో.. మిగతా నియోజకవర్గాల్లో 100 రోజుల్లోగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆ పథకం కోసం రూ.2వేల కోట్లు వ్యయం చేస్తామని ఒకసారి.. దశలవారీగా అమలు కోసం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని మరోసారి ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని విమర్శించారు.


దళితబంధు అమలు కోసం దశల వారీగా ఉద్యమాలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నెల 2 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు, 9న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, 10 నుంచి 15 వరకు మండల కేంద్రాల్లో మహాదీక్షలు, 16 నుంచి సెప్టెంబరు 4 వరకు మహాపాదయాత్రలు, 5న హుజూరాబాద్‌లో దళిత గర్జన మహాసభ నిర్వహిస్తాన్నారు. మాదిగల వైఖరిని వెల్లడిస్తామని చెప్పారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వైఖరిపై దళితులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అంబేడ్కర్‌ కంటే సీఎం కేసీఆర్‌ గొప్పని ఆయన ప్రకటించడం వెనుక రాజకీయ లబ్ధికోణం ఉందన్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి రాజకీయ అరంగేట్రం చేస్తున్న మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై ఆయన స్పందిస్తూ.. ఎవరి దృక్పథం వారికి ఉంటుందని అభిప్రాయపడ్డారు.  

Updated Date - 2021-08-02T07:30:43+05:30 IST