బ్రిటన్‌కు భారతీయుల క్యూ.. కొవిడ్ వ్యాక్సినే కారణం!

ABN , First Publish Date - 2020-12-05T02:27:53+05:30 IST

ఫైజర్ టీకా వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వేళ.. భారతీయుల చూపు ఇప్పడు యూకేవైపు మళ్లింది. బ్రిటన్‌కు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీస్తున్నారు.

బ్రిటన్‌కు భారతీయుల క్యూ.. కొవిడ్ వ్యాక్సినే కారణం!

న్యూఢిల్లీ: ఫైజర్ టీకా వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వేళ.. భారతీయుల చూపు ఇప్పడు యూకేవైపు మళ్లింది. బ్రిటన్‌కు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ దేశాలను కొవిడ్ మహమ్మారి కుదిపేస్తోంది. అమెరికా సహా బ్రిటన్‌లోనూ ఈ కొవిడ్ విలయం సృష్టిస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. తాము అభివృద్ధి చేసిన టీకా సమర్థవంతంగా పని చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రభుత్వం అత్యవసర వినియోగం కోసం ఫైజర్ టీకాకు బుధవారం రోజు పచ్చజెండా ఊపింది. వచ్చే వారం ఆ దేశ ప్రజలకు టీకాను అందించేందుకు సిద్ధం అవుతోంది.



ఈ క్రమంలో భారతీయులు బ్రిటన్ వైపు చూస్తున్నారు. యూకే వెళ్తే టీకా వేయించుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైజర్ టీకాకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత యూకే ప్రయాణంపై ఎంక్వైరీలు పెరిగాయని ట్రావెల్ ఏజెంట్ సంస్థలు తెలిపాయి. వ్యాక్సిన్ పొందడానికి బ్రిటన్‌కు ఎప్పుడు.. ఎలా వెళ్లొచ్చని చాలా మంది తమను ఫోన్ తదితర మాద్యమాల ద్వారా సంప్రదించారని ఓ ట్రావెల్ ఏజెంట్ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ కోసం యూకే వెళ్లే విదేశీయులకు క్వారెంటైన్ నిబంధన వర్తిస్తుందా? ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులా? కాదా? అనే అంశాలపై స్పష్టత లేదని ఇందకోసం బ్రిటన్ అధికారులను సంప్రదిస్తున్నట్టు ఈస్‌మైట్రిప్.కామ్ సీఈఓ నిశాంత్ తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ కోసం యూకే వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను కూడా రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ మొదటగా కొవిడ్ వారియర్స్‌కు, 80ఏళ్లుపైబడిన వృద్ధలకు ఇవ్వనున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటి ప్రకటించింది. 


Updated Date - 2020-12-05T02:27:53+05:30 IST