నెత్తుటి హోలీ

ABN , First Publish Date - 2020-03-10T10:03:36+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చరిత్రలో అతిపెద్ద ఒక్కరోజు పతనాన్ని చవిచూశాయి. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 2,467 పాయింట్లు, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 695 పాయింట్ల వరకు క్షీణించాయి. చివరికి సెన్సెక్స్‌ 1,941.67 పాయింట్ల నష్టంతో...

నెత్తుటి హోలీ

  • మదుపరి గుండె గు‘బేర్‌’
  • స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద పతనం 
  • ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,467 పాయింట్లు డౌన్‌
  • చివరికి 1,941 పాయింట్ల నష్టంతో ముగింపు 
  • రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరి


హోలీ.. రంగుల కేళీ.. పండగకు ముందు రోజే దలాల్‌ స్ట్రీట్‌పై రంగు పడింది. బేర్‌ పంజాకు బలైన ఇన్వెస్టర్ల రక్తంతో సూచీలు ఎరుపు రంగు పులుముకున్నాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాలు, ముడి చమురు ధరల యుద్ధంతో మార్కెట్లు మారణహోమాన్ని తలపించాయి.   


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చరిత్రలో అతిపెద్ద ఒక్కరోజు పతనాన్ని చవిచూశాయి. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 2,467 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 695 పాయింట్ల వరకు క్షీణించాయి. చివరికి సెన్సెక్స్‌ 1,941.67 పాయింట్ల నష్టంతో 35,634.95 వద్ద స్థిరపడింది. గడిచిన 13 నెలల్లో సూచీకిదే కనిష్ఠ ముగింపు స్థాయి. ఇక నిఫ్టీ 538 పాయింట్ల నష్టం తో 10,451.45 వద్ద ముగిసింది. కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతోపాటు ముడి చమురు ధరల భారీ పతనం ఈక్విటీ మార్కెట్లను కకావికలం చేశాయి. ప్రధాన షేర్లతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించారు. ఒక్కరోజులో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 4.20 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 4.73 శాతం జారుకున్నాయి. దాంతో దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల సంపద రూ.7 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీలన్నింటి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.137,46,946.76 కోట్లకు జారుకుంది. 


ఆ 30 నష్టాల్లోనే...

సెన్సెక్స్‌లోని ముప్ఫై లిస్టెడ్‌ కంపెనీల షేర్లూ నేలచూపులు చూశాయి. ప్రభుత్వ రంగ ఇంధన ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీ అత్యధికంగా 16.26 శాతం నష్టపోయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 12.35 శాతం, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 10.66 శాతం క్షీణించాయి. టాటా స్టీల్‌ 8.23 శాతం  కోల్పోగా.. టీసీఎస్‌, ఎస్‌బీఐ 6 శాతం పైగా జారుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాం క్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా 5 శాతం పైగా పతనమయ్యాయి. 


 అన్ని రంగాల సూచీలదీ నేలచూపే 

బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఇంధన సూచీ అత్యధికంగా 9.74 శాతం తగ్గింది. లోహ రంగ సూచీ 7.62 శాతం విలువను కోల్పోగా.. ఐటీ, టెక్నాలజీ, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌లు 5 శాతం పైగా క్షీణించాయి. 


 ఇండియాబుల్స్‌ షేరు 16 శాతం డౌన్‌ 

యెస్‌ బ్యాంక్‌ దెబ్బకు ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు భారీ పతనాన్ని చవిచూసింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు 16.06 శాతం తగ్గి రూ.213.55 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 19 శాతానికి పైగా నష్టపోయినప్పటికీ చివర్లో కాస్త కుదురుకుంది. గతంలో యెస్‌ బ్యాంక్‌ జారీ చేసిన అదనపు టైర్‌-1 క్యాపిటల్‌ బాండ్లలో రూ.662 కోట్ల పెట్టుబడులు కలిగి ఉన్నట్లు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రకటించడం ఇందుకు కారణమైంది. యెస్‌ బ్యాంక్‌ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ బాండ్లను శాశ్వతంగా, పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 


సెన్సెక్స్‌ 5088 పాయింట్లు తగ్గుదల 

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్‌ 5,088.54 పాయింట్లు (12.49 శాతం), నిఫ్టీ 1,510.65 పాయింట్లు (12.62 శాతం) పడ్డాయి. గత ఏడాది మొత్తానికి సెన్సెక్స్‌ 14 శాతం, నిఫ్టీ 12 శాతం పెరిగాయి. అంటే, గడిచిన నెలకు పైగా రోజుల్లోనే గత ఏడాది సూచీలు పంచిన ప్రతిఫలాలు తుడిచిపెట్టుకు పోయాయన్నమాట. 


పతనానికి కారణాలివి.. 

కరోనా వైరస్‌ 

ఇప్పటికే 100 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌ 1.10 లక్షల మందికి సోకింది. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దాంతో ప్రపంచ, దేశీయ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. 


యెస్‌ బ్యాంక్‌ 

యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మార్కెట్‌ వర్గా ల్లో దేశీయ బ్యాంకింగ్‌ రంగ స్థిరత్వంపై ఆందోళనలు పెరిగాయి. దాంతో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లపైనా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. 


సెన్సెక్స్‌ భారీ పతనాలు

తేదీ                            పాయింట్ల నష్టం  

2020 మార్చి 9           1,941.67

2015 ఆగస్టు 24           1,624.51

2020 ఫిబ్రవరి 28           1,448.37

2008 జనవరి 21           1,408.35

2008 అక్టోబరు 24           1,070.63


రూ.45 వేల ఎగువనే గోల్డ్‌ 

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.22 పెరిగి రూ.45,063కు చేరుకుంది. వెండి రేటు మాత్రం కిలోకు రూ.710 తగ్గి రూ.47,359కు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 1,680 డాలర్లు, సిల్వర్‌ 16.82 డాలర్లు పలికింది. 


17 నెలల కనిష్టానికి రూపాయి..

ఈక్విటీల్లో అమ్మకాల ఒత్తిడి, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలతో రూపాయి మరింత బక్కచిక్కింది. విలువ 17 నెలల కనిష్ఠ స్థాయికి జారుకుంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 30 పైసలు బలహీనపడి 74.17 వద్దకు చేరుకుంది. అంటే, ఒక అమెరికా డాలర్‌ విలువ మన కరెన్సీలో రూ.74.17 అన్నమాట.


రూ.లక్ష కోట్ల దిగువకు ఓఎన్‌జీసీ మార్కెట్‌ విలువ

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 30 శాతం పైగా పడిపోవడం దేశీయ ఇంధన ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీపై భారీ ప్రభావం చూపింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఓఎన్‌జీసీ షేరు ధర 16 శాతం పైగా తగ్గి రూ.74.65కి పడిపోయింది. తత్ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.93,911 కోట్లకు పడిపోయింది. దాదాపు 16 ఏళ్ల (2004 ఆగస్టు) తర్వాత కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్ల దిగువకు చేరడం మళ్లీ ఇదే మొదటిసారి. 


ఆర్‌ఐఎల్‌ గింగిరాలు 

ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు  గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నష్టపోయాయి. చమురు ధరల తాజా పతనం ఆర్‌ఐఎల్‌ ముడిచమురు శుద్ధి, పెట్రోకెమికల్‌ వ్యాపారాలపై భారీ ప్రభావం చూపే అవకాశాలుండటం ఇందుకు కారణం. బీఎ్‌సఈలో కంపెనీ షేరు ధర 12.35 శాతం క్షీణించి రూ.1,113.15 వద్దకు జారుకుంది. ఇంట్రాడేలోనైతే దాదాపు 14 శాతం మేర పతనమైన షేరు ధర రూ.1,094.95 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసుకుంది. బీఎ్‌సఈలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.7.05 లక్షల కోట్లకు పడిపోయింది. దాంతో టీసీఎస్‌ రూ.7.40 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్‌తో మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఈ మార్కెట్‌ క్రాష్‌లో ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత ఆస్తి కూడా రూ.45,000 కోట్ల మేర తరిగిపోయింది.  


నిఫ్టీ 10,000 దిగువకు?

ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలు, ట్రేడింగ్‌ తీరును బట్టి చూస్తే స్టాక్‌ సూచీలు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కన్పించడం లేదని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. సూచీలు మరికొంత కాలం బేరిష్‌ ట్రెండ్‌లోనే కొనసాగవచ్చని, నిఫ్టీ 10,000 కీలక స్థాయి దిగువకు పడిపోవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ నిఫ్టీ 10,294కు ఎగువన నిలదొక్కుకోగలిగితే, సూచీ తిరిగి 10,750 స్థాయికి ఎగబాకవచ్చని లేదంటే 10,000 దిగువ స్థాయికి జారుకోవవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.


ఆరు నెలలు ఇలాగే..

కరోనా, యెస్‌ బ్యాంక్‌ భయాలు ఒక పక్క.. అంతర్జాతీయ మార్కెట్ల పతనం.. స్టాక్‌ మార్కెట్‌ రికార్డు స్థాయిలో క్షీణించడానికి కారణమయ్యాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకు ఖాతాదారులు, ప్రజల్లో యెస్‌ బ్యాంకు భయాలు వెంటాడుతున్నాయని.. మరిన్ని బ్యాంకులకు ఇటువంటి పరిస్థితులు ఎదురుకాగలవేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్ఠంగా ఉన్నందున పతనం, ఒడిదొడుకులు కొనసాగినప్పటికీ అది వచ్చే ఆర్నెల్ల వరకే ఉండగలదని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ స్థిరపడగలదని చెబుతున్నారు. దీర్ఘకాలం వ్యూహంతో మదుపు చేసే వారికి ఇప్పటి పతనం ఒక అవకాశమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేచి ఉండగలిగిన మదుపర్లు మూలాలు పటిష్ఠంగా ఉండి ప్రస్తుత సెంటిమెంట్‌ కారణంగా పడిపోయిన షేర్లపై దృష్టి పెట్టవచ్చంటున్నారు.

Updated Date - 2020-03-10T10:03:36+05:30 IST