కట్టలేం.. కొనలేం!

ABN , First Publish Date - 2022-01-08T06:52:26+05:30 IST

నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఎదురవుతున్న సమస్యలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ ధరలు సామాన్యులనే కాకుండా.. డెవలపర్లు, బిల్డర్లను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. భవన నిర్మాణంలో ప్రధానమైన స్టీల్‌ ధర టన్నుకు రూ.67,540 పలుకుతోంది. ఐదేళ్లలో స్టీల్‌ ధర ఏకంగా..

కట్టలేం.. కొనలేం!

  • భారీగా పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు
  • మండిపోతున్న స్టీల్‌ ధర.. టన్ను రూ.67,540
  • తాజా పెంపుతో 340కి చేరిన సిమెంట్‌ బస్తా
  • భగ్గుమంటున్న 78 రకాల నిర్మాణ వస్తువులు
  • నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో..
  • ఫ్లాట్లు, ఇళ్ల ధరలపై తీవ్ర ప్రభావం
  • సిటీలో రూ.50 లక్షలకు ఫ్లాట్‌ దొరకడం కష్టమే
  • 100 గజాల్లో నిర్మాణానికి 15 లక్షలకు పైగా ఖర్చు!


ఎల్బీ నగర్‌లోని నాగోల్‌లో నివసించే వెంకటరమణ.. ఎప్పుడో తన తండ్రి నిర్మించిన ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు పెద్దవారవడంతో ఇల్లు సరిపోవడంలేదు. దీంతో వంద చదరపు గజాల్లో ఉన్న తమ పాత ఇంటిని కూల్చేసి.. రెండేళ్ల క్రితం కొత్త ఇంటి  నిర్మాణం మొదలు పెట్టారు. నిర్మాణం పూర్తయ్యేందుకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేసుకున్నాడు. కానీ, అంచనాలు తలకిందులయ్యాయి. నిర్మాణం కోసం ఇప్పటికే సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చవగా, ఇంకా రూ.2 లక్షల వరకు ఖర్చయ్యే పనులు మిగిలే ఉన్నాయి. 


లంగర్‌హౌజ్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్న శ్రీధర్‌ ఆటోమొబైల్‌ రంగంలో పని చేస్తున్నాడు. పిల్లల చదువులు, ఉపాధి నేపథ్యంలో నగరంలోనే స్థిరపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా రూ.8 వేల మేర అద్దె చెల్లిస్తున్న శ్రీధర్‌కు నగరంలో ఇల్లు కట్టుకోవాలనేది కల. మధ్య తరగతి కుటుంబం కావడంతో నగరంలో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం తమ వల్ల కాదని, అపార్ట్‌మెంట్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సొంత ఊరైన వరంగల్‌ జిల్లాలోని జనగాంలో ఉన్న తన సొంత ఇంటిని అన్నదమ్ములకు విక్రయించగా రూ.7లక్షల వరకు వచ్చాయి. వీటికితోడు తాను కొన్నాళ్లుగా పొదుపు చేసుకున్న రూ.10 లక్షలు ఉండడంతో మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నెలా నెలా చెల్లించే ఇంటి అద్దెను బ్యాంకు రుణంగా కట్టుకోవాలని భావించారు. రూ.35 లక్షలకు ఫ్లాట్‌ దొరుకుతుందేమోనని ప్రయత్నించగా.. రూ.45 లక్షలకు కూడా ఎక్కడా దొరకడంలేదని శ్రీధర్‌ వాపోతున్నారు. 


మణికొండలో ఓ డెవలపర్‌ 2 బ్లాక్‌లతో 80 ఫ్లాట్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. మూడేళ్ల క్రితం ప్రీ లాంచ్‌ కింద చ.అ.కు రూ.4200 చొప్పున 55 ఫ్లాట్లను అమ్మారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని, అప్పటివరకు విడతల వారీగా ఫ్లాట్‌ మొత్తం ఖరీదు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు.. నిర్ణీత గడువులో కొనుగోలుదార్లు మొత్తం డబ్బు చెల్లించారు. అప్పటి ధరల ప్రకారం ఖర్చులూ పోను తనకు 15-18 ఫ్లాట్‌ల వరకు మిగులుతాయని డెవలపర్‌ అంచనా వేసుకున్నాడు. కానీ, కొవిడ్‌ పరిస్థితులు, పెరిగిన ధరలతో ప్రాజెక్టు ఇంకా తుది దశలో ఉంది. నిర్మాణ సామగ్రి ధరలు 60-100ు వరకు పెరగడంతో.. అంచనా వేసుకున్న ఫ్లాట్‌లలో సగం కూడా మిగిలే పరిస్థితి లేదని వాపోతున్నాడు.


హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఎదురవుతున్న సమస్యలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ ధరలు సామాన్యులనే కాకుండా.. డెవలపర్లు, బిల్డర్లను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. భవన నిర్మాణంలో ప్రధానమైన స్టీల్‌ ధర టన్నుకు రూ.67,540 పలుకుతోంది. ఐదేళ్లలో స్టీల్‌ ధర ఏకంగా రూ.35 వేలు పెరగడం గమనార్హం. స్టీల్‌తోపాటు లేబర్‌ ధరలు, సిమెంట్‌, మార్బుల్‌, ఇటుక, పైపులు.. ఇలా నిర్మాణానికి అవసరమైన 78 రకాల వస్తువుల ధరలూ భారీగా పెరిగిపోయాయి. దీంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, డెవలపర్లు కుదేలవుతున్నారు. ఇప్పటికే ఫ్లాట్ల బుకింగ్‌ పూర్తయిన బహుళ అంతస్తుల ప్రాజెక్టులను తప్పనిసరిగా చేపట్టాల్సి ఉండడం, ధరలు భారీగా పెరగడంతో నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. కొవిడ్‌ కంటే ముందు నగరంలో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షలకు సరసమైన ధరగా ఉండగా, ప్రస్తుతం రూ.75 లక్షలకు నిర్ణయించే పరిస్థితి ఉంది. ఈ స్థాయి ధర వెచ్చించి ఫ్లాట్‌ కొనుగోలు చేయడం మధ్య తరగతి ప్రజలకు సాధ్యం కాదని, హైదరాబాద్‌ రియాల్టీ కొంతమంది కోసమే ఉంటే మున్ముందు మార్కెట్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని ఓ నిపుణుడు పేర్కొన్నాడు.


మండిపోతున్న ధరలు..

భవనాలు, ఇళ్ల నిర్మాణంలో ప్రధాన వస్తువైన స్టీల్‌ ధర మండిపోతోంది. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసే టీఎంటీ స్టీల్‌ ధర రెండు, మూడు నెలలకోసారి పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం టన్ను రూ.35,813 ఉన్న స్టీల్‌ ధర ప్రస్తుతం రూ.67,540కు పెరిగింది. అంటే ఐదేళ్లలో రూ.31,727 పెరిగింది. 90 శాతం పెరిగినా.. ఇంకా నిలకడగా ఉండడం లేదు. మధ్య తరగతి కుటుంబం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రెండు టన్నుల స్టీల్‌ అవసరమవుతుంది. అంటే కేవలం స్టీల్‌కే అదనంగా రూ.70 వేల వరకు భారం పడుతుంది. ఇక బహుళ అంతస్తుల ప్రాజెక్టుల కోసం డెవలపర్లు, బిల్డర్లు టన్నుల కొద్దీ స్టీల్‌ను వినియోగిస్తున్నందున.. దీని కొనుగోలు కోసం పడే భారం అంతా ఇంతా కాదు. మరోవైపు ఇళ్లు, భవనాల నిర్మాణంలో అవసరమైన పైపులు, రేకులు, రంగులు, ప్లంబింగ్‌, టైల్స్‌, రాతిబండలు, వైర్లు, ఎలక్ర్టికల్‌ వస్తువులు.. ఇలా ప్రతి వస్తువు ధర పెరిగింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్‌లో నాణ్యమైన టైల్స్‌ బాక్స్‌ రూ.230 మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది రూ.370కి పెరిగింది. సిమెంట్‌, కంకర ధరల పెరుగుదల, డీజిల్‌ భారంతో రెడిమిక్స్‌ కూడా టన్నుకు రూ.1000కి పైగా పెరిగింది. ఇక సిమెంట్‌ ధర ఐదేళ్లలో 50 శాతం నుంచి 60 శాతం మేర పెరిగింది.


2020లో లాక్‌డౌన్‌కు ముందు వరకు బస్తా సిమెంట్‌ ధర రూ.220 నుంచి రూ.250 వరకు ఉండగా, లాక్‌డౌన్‌ సమయంలో రూ.320 నుంచి రూ.350 వరకు పెరిగింది. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. మళ్లీ పెరుగుతోంది. తాజాగా మరో రూ.20 పెంచారు. మరోవైపు ఒక్కో ఇటుక ధర ఏడాది క్రితం వరకు రూ.3 నుంచి రూ.5 వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.8 అయింది. ఇక కంకర ధర టిప్పర్ల సైజు ఆధారంగా రూ.1500 నుంచి రూ.2 వేల మేర పెరిగింది. నిర్మాణ సామగ్రిలో ఇసుక ధర మాత్రమే అందరికీ కాస్త అందుబాటులో ఉంది. ప్రస్తుతం టన్ను ఇసుక రూ.1300కు దొరుకుతోంది.


వంద గజాల్లో ఇంటి నిర్మాణానికి 15 లక్షలకు పైగా ఖర్చు..

వంద గజాల్లో ఓ ఇంటిని నిర్మించుకోవాలంటే యజమాని చేతిలో కనీసం రూ.15 లక్షలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎన్ని అంచనాలు వేసుకొని నిర్మాణం ప్రారంభించినా, ఎప్పుడు ఏ మేరకు ధరలు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. మేస్ర్తీ, లేబర్‌ ఖర్చు కోసం ఒక చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.350 వరకు ఉంది. నిర్మాణ సామగ్రి బాధ్యత కూడా వారిదే అయితే చదరపు అడుగుకు రూ.1800 నుంచి రూ.2 వేల వరకు తీసుకుంటున్నారు. లేబర్‌ దొరకడం లేదని, రోజుకు రూ.వెయ్యికి పైగా చెల్లించడంతోపాటు ‘ఇతర’ ఖర్చులు చూసుకోవాల్సి వస్తుందని ఓ మేస్ర్తీ తెలిపారు. ఇక బుకింగ్‌లన్నీ పూర్తయి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డెవలపర్లకు, బిల్డర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గడువు లోపు ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగదారులకు ప్లాట్లను అందించాల్సి ఉండగా పెరిగిన ధరలతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ




ధరలను అదుపు చేయాలి

హైదరాబాద్‌లో ఫ్లాట్లు అందుబాటు ధరలకు లభిస్తాయే పేరుంది. కానీ, ఇటీవల పెరిగిన నిర్మాణ ధరలతోపాటు భూముల ధరలు కూడా అపార్ట్‌మెంట్ల ఫ్లాట్‌లపై ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన ధరలకనుగుణంగా ప్లాట్లు, ఇళ్ల విక్రయించాల్సి వస్తోంది. అంతిమంగా ఇది వినియోగదారులకు భారంగా మారుతోంది. ధరలను అదుపు చేయాలి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఫ్లాట్లను అందించేలా డెవలపర్లను ప్రోత్సహించాలి.

మారం సతీష్‌కుమార్‌, ఎండీ, మారం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 


స్థానికంగా ఉత్పత్తి లేకపోవడం వల్లే

రాష్ట్రంలో నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలకు కారణం హార్డ్‌వేర్‌కు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి స్థానికంగా లేకపోవడమే. దాంతోపాటు బొగ్గు ఉత్పత్తి తగ్గడం, ట్రాన్స్‌పోర్టు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కూడా కారణమే. కేంద్ర ప్రభుత్వం విదేశీ వస్తువుల దిగుమతిని తగ్గించి స్వదేశీ వస్తువులను వాడాలనే నిబంధన విధించడం కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. వాటికి సంబంధించిన ముడి సరుకులు ఇక్కడ లేవు. కరోనా కారణంగా గతేడాదితో పోల్చితే వ్యాపారం 10 శాతం తగ్గింది.  

ఎం.శ్రీనివాస్‌, హార్డ్‌వేర్‌, ప్లైవుడ్‌, గ్లాస్‌ వ్యాపారి

Updated Date - 2022-01-08T06:52:26+05:30 IST