మున్సిపాలిటీల్లో రెండు రోజుల పాటు ముమ్మర పారిశుధ్య డ్రైవ్ - అర్వింద్ కుమార్

ABN , First Publish Date - 2021-04-20T00:39:00+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో విస్తృత స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు.

మున్సిపాలిటీల్లో రెండు రోజుల పాటు ముమ్మర పారిశుధ్య డ్రైవ్ - అర్వింద్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో విస్తృత స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. నేడు మున్సిపల్ శాఖ సంచాలకులు, రాష్ట్రంలోని అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై టెలీ కాన్ఫ్ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త, మున్సిపల్ వ్యర్థాలను రానున్న రెండు రోజులు శ్రీరామనవమి లోగా తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను పూర్తిగా తొలగించడంతో పాటు కరోనా, అంటువ్యాధుల వ్యాప్తి నిరోధానికై సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని విస్తృత స్థాయిలో స్ప్రేయింగ్ చేయాలని అన్నారు.


ప్రజా సమూహాలు అధికంగా ఉండే మార్కెట్లు, బస్ స్టేషన్లు, రిక్రియేషన్ సెంటర్లు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక ప్రాధాన్యతతో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వివిధ సమస్యలపై పౌరుల నుంచి అందే గ్రీవెన్స్ ల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయమై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, వాట్సప్, ఫేస్ బుక్ ల ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ సంచాలకుల కార్యాలయాల నుండి వచ్చే విజ్ఞాపనలు,  ఫిర్యాదులపై వెంటనే స్పందించి తీసుకున్న చర్యలపై ఫోటోలను జతపరిచి పంపాలని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో మెరుగైన ఫలితాలు ఉండాలని, ఈ విషయంలో స్థానిక సంస్థలు అడిషనల్ కలెక్టర్లు పర్యవేక్షించాలని అరవింద్ కుమార్ అన్నారు. 


మున్సిపల్ పరిధిలోని శ్మశానవాటికల నిర్వహణ మరింత మెరుగైన రీతిలో చేపట్టాలని ఆదేశించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తెలంగాణ పారిశ్రామిక అభివృద్ది, మౌలిక సదుపాయాల సంస్థ (టి.ఎస్.ఐ.ఐ.డి.సి) ఆధ్వర్యంలోని అన్ని ఐలా పరిధిలోని రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తకుప్పలను యుద్ద ప్రాతిపధికపై తొలగించాలని టి.ఎస్.ఐ.ఐ.డి.సి మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డ్రిస్ట్రిక్ట్, బాలానగర్, కాప్రా లలోని ఐలాల్లో ని రహదారుల వెంట ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా వీధి వ్యాపార కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న మాదిరిగానే ఐలా పరిధిలో కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు తొలగించిన ప్రాంతాల్లో, జనసమ్మర్థ ప్రాంతాలైన మార్కెట్లు, బస్ షెల్టర్లు, పార్కులు, ప్రధాన కూడళ్లలో డిస్-ఇన్ఫెక్టెంట్ స్ప్రేయింగ్ చేపట్టాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. 

Updated Date - 2021-04-20T00:39:00+05:30 IST