వైన్స్‌ల్లో నిల్‌.. ‘బెల్టు’లో ఫుల్‌..!

ABN , First Publish Date - 2021-11-24T05:58:30+05:30 IST

వైన్స్‌ల్లో నిల్‌.. ‘బెల్టు’లో ఫుల్‌..!

వైన్స్‌ల్లో నిల్‌.. ‘బెల్టు’లో ఫుల్‌..!
మరిపెడ మునిసిపాలిటీ పరిధిలో, తొర్రూరులో మద్యం స్టాకు లేక వెలవెలబోతున్న వైన్స్‌

బ్రాండెడ్‌ మద్యం బ్లాక్‌ దందా

ఈ నాలుగు రోజులు చీప్‌ లిక్కరే..

షాపులు రాని వారి రూటే సప‘రేటు’

దాచుకున్నోడికి దోచుకున్నంత


మహబూబాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (ఐఎంఎ్‌ఫఎల్‌) వైన్స్‌ల్లో హఠాత్తుగా లిక్కర్‌ షాటేజీ వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో పాత మద్యం దుకాణాల లైసెన్స్‌లు గడువు ముగిసిపోతుండడంతో పె ద్దమొత్తంలో అన్ని బ్రాండ్‌లకు సంబంధించి న స్టాకు కొట్టించడం (తెప్పించడం) లేదు. ఏ మంటే మళ్లీ షాపు రానివారి వద్ద  ఆఖరి రో జులోగా ఆ స్టాకు అమ్మకాలు జరగకుంటే ఆపై ఎక్సైజ్‌శాఖ నిబంధనలతో సరుకు అమ్మకాలు చేయడం సాధ్యం కాదన్న భయంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందని సమాచా రం. దీంతో పలు దుకాణాలు అన్ని రకాల బ్రాండ్‌లు లేక వెలవెలబోతున్నాయి. అంటే పూర్తిగా మద్యం దొరకడం లేదని కాదు.. వైన్స్‌లకు వచ్చిన స్టాకు ఎప్పుడో దొడ్డిదారిన బెల్టుషాపులకు చేరిపోయిందన్న మాట..!! అక్కడ కూడా కొంత అసలైన మందు కు తోడు బాటిళ్ళ నుం చి మద్యం మరో బా టిల్‌లోకి చేరే కల్తీ మ ద్యం తోడవుతోంది. ఇక దొరికిందే తడవుగా కొం టున్న మద్యపాన ప్రియులకు జేబుకు చిల్లు పడడం తో పాటు కొంత కల్తీతో ఒళ్లు సైతం గుళ్లవుతోంది. 


జిల్లాలో దుకాణాలు పెరిగినా..

జిల్లా వ్యాప్తంగా పూర్వ లెక్కల ప్రకారం 52 వైన్స్‌లు ఉండగా తాజాగా 2021–23 సంవత్సరానికి నూతన మ ద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించడానికి ముందే మరో ఏడు వైన్స్‌లను పెంచడంతో సంఖ్య 59కి చేరింది. ఈ టెండర్లు నిర్వహించిన రోజు నుంచే పాత మద్యం దుకాణాల్లో స్టాకు నిల్వలు తగ్గిపోయాయి. మళ్లీ టెండర్లలో షాపు దక్కుతుందో.. లేదోనన్న సందేహాలతో పలు దుకాణాల నిర్వాహకులు, భాగస్వాములు స్టాకు తెప్పించడంపై ఆసక్తి చూపలేదు. సరికదా.. ఉన్న స్టాకును బెల్టుషాపులకు అమ్మేసుకున్నారు. తీరా టెండర్లలో చూస్తే పాత, కొత్త కలయికలతో కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం 59 మద్యం దుకాణాలు డిసెంబర్‌ 1 నుంచి కొలువుతీరనున్నాయి. 


జిల్లా కేంద్రంలో ఇదివరకు 13 దుకాణాలు ఉండగా ఈ సారి టెండర్లలో ఒకటిపెరిగిం ది. వ్యాపారులు పోటాపోటీగా నాన్‌రిఫండబుల్‌ పైకం రూ.2లక్షల చొప్పున డీడీ, చలాన్‌లతో రంగంలో దిగారు. మద్యం దుకాణాలపై వ్యాపార నాడీ పసిగట్టిన రాటుతేలిన సీనియర్లు ఎలాగైనా వైన్స్‌షాపులను దక్కించుకోవాలని ఒక్కొక్కరు 10 నుంచి 30, మరికొందరు 40 వరకు టెండర్లు వేశారు. ఏమైతేనేం అనుకున్నట్టే కొందరు పాత వ్యాపారులు చావుదప్పి కన్నులొట్టబోయిన చందంగా ఒకట్నుంచి మూడు చొప్పున దక్కించుకున్నారు. వచ్చిందే తడవుగా పెట్టిన టెండర్‌ దరఖాస్తుల పైకాన్ని వ్యాపారంలో రాబట్టుకోవడానికి అప్పుడే దూరాలోచన చేస్తున్నారు. పాత షాపుల్లో ని ల్వలు తెప్పించి ఈ లైసెన్స్‌ గడువు తీరే లోపే చేతనైనంతా లాబార్జన చేసుకోవాలని బెల్టుషాపుల నిర్వాహకులతో దోస్తీ కడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న చీప్‌లిక్కర్‌తో పాటు మద్య తరహా బ్రాండ్‌లు, హైఫై క్వాలిటీ బ్రాండ్‌లను సైతం వారికి చేరవేస్తున్నారు. దీంతో వైన్స్‌ల్లో నిల్వలు కనబడడం లేదు. 


వారు..వీరని కాదు..అందరి దారి..

జిల్లాలో ఈ దఫా కూడా మద్యం టెండర్లలో అవకాశం దక్కించుకున్న వారితో పాటు చేజారిన మద్యం వ్యాపారులు ఉన్న మద్యం స్టాకును ఏ రోజుకు ఆరోజే బెల్టుషాపులకు ఇబ్బడిముబ్బడి రేట్లకు అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇంకా కొత్తగా స్టాకు తెప్పించుకుంటున్న వారు సైతం అడిగిందే తడవుగా బెల్టుషాపుల నిర్వాహకులకు రేట్లు పెంచి ఇచ్చేస్తున్నారు. ప్రధానంగా షాపులు ఈ సారి రానివారైతే తమ రూటే సపరేటంటూ విచ్చలవిడిగా బెల్టుషాపులకు మద్యం చేరవేస్తుండడంతో జిల్లాలోని లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాల్లో స్టాకు ఎక్కడ కన్పించడం లేదు. బెల్టుషాపులు మాత్రం 24 గంటలు ఇరానీ టీ కేఫ్‌ల్లాగా గ్లాసుల గల..గలలతో కాసులు సంపాదిస్తూ కళకళలాడుతున్నాయి. దాచుకున్నోడికి దోచుకున్నంతా చందంగా మద్యం దుకాణాల పూర్వ లైసెన్స్‌ గడువు నవంబర్‌ 30తో ముగుస్తున్న సందర్భంగా ఉన్నంతలో సంపాదించుకునేందుకు క్లాస్‌ మద్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేస్తున్నారు. 


జిల్లా కేంద్రంలో డిమాండ్‌ కలిగిన మద్యం బ్రాండ్‌లు ఇక్కడికి సమీపంలోని ప్రధాన గ్రామాల్లోని బెల్టుషాపుల్లో దర్జాగా లభిస్తున్నాయి. కాకుంటే కాస్తంతా ధర ఎక్కు వే సుమి... అయితేనేం..ఆయా బ్రాండ్‌లకు అలవాటుపడ్డ మద్యపాన ప్రియులు క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.50 వరకు కూడ అదనంగా ఇచ్చి తెప్పించుకుంటున్నారు. ఇక చీప్‌లిక్కర్‌ విషయానికొస్తే వైన్స్‌ల్లో డిమాండ్‌ లేని బ్రాండ్‌ల మద్యం అందుబాటులో ఉంటోంది. డిమాండ్‌ కలిగిన రెండు, మూడు రకాల బ్రాండ్‌ మద్యం 180 ఎంఎల్‌ బాటిళ్లు కావాలంటే మాత్రం బెల్టుషాపుల మెట్లు ఎక్కాల్సిందేనంటున్నారు. చలికాలం ఆరంభమైనప్పటికి బీర్ల డిమాండ్‌ ఏమి తగ్గలేదు. దీంతో వివిధ రకాల బీర్లు సైతం దొడ్డిదారిన బెల్టుషాపుల్లోకి చేరుతున్నాయి. ధర పెంచేసుకుని మందుబాబులకు చేరుతున్నాయి. ఈ నాలుగు రోజులు బెల్టుషాపుల్లో దొరికిందే చాలన్నంటూ మందుబాబులు సరిపెట్టుకోకతప్పడం లేదు. 

Updated Date - 2021-11-24T05:58:30+05:30 IST