Abn logo
Nov 24 2021 @ 03:49AM

జ్ఞాపకాలే శిల్పాలుగా..

మధుర జ్ఞాపకాలను ఫొటోల్లో నిక్షిప్తం చేసుకుంటాం. కానీ వాటి జీవితకాలం పరిమితమే! అవే జ్ఞాపకాలకు నిజరూప శిల్పాల రూపాన్నిస్తే అవి కలకాలం కళ్ల ముందుంటాయి. ఈ వినూత్న ఆలోచనతో పసిపిల్లలు మొదలు పెద్దల వరకూ వారి ఆనవాళ్లను శిల్పాల్లో పదిలపరుస్తోంది హైదరాబాద్‌కు చెందినపరిణిత బొంతల. వృత్తిపరంగా డెంటిస్ట్‌ అయిన పరిణితి ‘స్కల్ప్‌’ లైఫ్‌ కాస్టింగ్‌ స్కల్‌ప్టర్‌గా ఎదగడం వెనకున్న కథ ఆమె మాటల్లోనే...


పిల్లల బొమ్మలైతే ఫ్రేమ్‌లుగా, పెద్దల బొమ్మలైతే ఫ్రేమ్‌ లేకుండా తయారుచేసి అందిస్తూ ఉంటా. అలాగే బొమ్మలను బాక్స్‌ల్లో కూడా అందిస్తా. పిల్లల రెండు చేతులు, పాదాల బొమ్మల తయారీకి 10 వేలు తీసుకుంటాను. ఇలా సైజును బట్టి, కస్టమైజేషన్‌ను బట్టి ధరను నిర్ణయిస్తాను. ఈ పనిని నేర్చుకోవాలని ఎంతో మంది నన్ను సంప్రతిస్తూ ఉంటారు. అయితే ఇది ఆన్‌లైన్‌లో నేర్పించే ఆర్ట్‌ కాదు. కాబట్టి వ్యక్తిగతంగా వచ్చి నేర్చుకునేపనైతే 15 రోజుల్లో నేర్పిస్తాను. అందుకు 2 లక్షల రుసుం తీసుకుంటాను. 


నిజరూపాలను మైనంతో తయారుచేసే ప్రక్రియలు వాడుకలో ఉన్నాయి. మైనంతో రూపం దక్కుతుంది తప్ప, సూక్ష్మ వివరాలకు వాటిలో ఆస్కారం ఉండదు. పైగా అవి వాతావరణ మార్పులకు రూపం కోల్పోతాయి. కాబట్టి వాటి జీవిత కాలం తక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టుగా కనిపించకపోతే, దాంతో మానసికంగా కనెక్ట్‌ కాలేం. చేతి రేఖలు, వేలిముద్రలు లాంటి వివరాలన్నిటికీ అచ్చుగుద్దినట్టు రూపం ఇవ్వగలిగితే, అలాంటి శిల్పం మనదేననే భావన కచ్చితంగా కలుగుతుంది. అలాంటి బొమ్మల తయారీనే స్కల్పింగ్‌ అంటారు. ఇందుకోసం నేను ఉపయోగిస్తున్న మెటీరియల్‌ జిప్సమ్‌. ఇది ఒక రకమైన రాయిని పోలి ఉంటుంది. మైనంలా కరిగే వీలు లేని దృఢమైన పదార్థం ఇది. అలాగని కింద పడితే పగిలిపోదు అనుకోవడానికి లేదు. ఓ గాజు బొమ్మను ఎలాగైతే మనం భద్రంగా అమర్చుకుంటామో, ఈ శిల్పాలను కూడా కిందపడిపోకుండా చూసుకుంటే కలకాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. స్కల్‌ప్టింగ్‌ అంటే ఇంప్రెషన్‌ తీసుకుని, ఆ అచ్చును అందించడమే కదా! అనుకుంటారు. కానీ నిజానికి ఈ ఆర్ట్‌లోకి అడుగు పెట్టే ముందు వరకూ నేనూ అలాగే అనుకునేదాన్ని. స్కల్‌ప్టింగ్‌లోకి అడుగు పెట్టడం కూడా యాధృచ్చికంగా జరిగింది. 


డెంటి్‌స్టనే అయినా...

మాది హైదరాబాదే. ఇక్కడే పుట్టి పెరిగాను. వృత్తిపరంగా దంత వైద్యురాలిని. ప్రసవం తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని ఏదో ఒక రకంగా సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. బాబు ప్రతిరూపాన్ని పోలిన బొమ్మ తయారుచేయడం కోసం, మొదట శనగపిండితో బొమ్మను తయారుచేశాను. ఆ తర్వాత తోచిన మెటీరియల్స్‌ను ప్రయత్నించాను. క్రమేపీ ఆసక్తి పెరిగింది. మైనం బొమ్మలో ఉండే మైనస్‌ పాయింట్లు తెలిశాయి. అంతిమంగా దృఢంగా, కలకాలం పాడవకుండా ఉండే మెటీరియల్‌ కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించి, చివరకు స్కల్‌ప్టింగ్‌ను ఎంచుకున్నాను. ప్రారంభంలో నేను తయారుచేసిన బొమ్మలను చూసి, తెలిసినవాళ్లు, స్నేహితులు అనుకూలంగా స్పందించారు. అలా ఇతరులకూ బొమ్మలు చేసి అందించాను. టఛిఠజూఞ్ట.జిడఛీ అనే ఇన్‌స్టా హ్యాండిల్‌, ఫేస్‌బుక్‌  ద్వారా ప్రమోట్‌ చేయడం మొదలుపెట్టాను. అలా రెండేళ్ల పాటు ఇంట్లో నుంచే బొమ్మల తయారీ మొదలుపెట్టి, 2018 ఏప్రిల్‌ నుంచి నా స్కల్‌ప్టింగ్‌ను ఆర్డర్స్‌ తీసుకోవడం మొదలుపెట్టాను. 2020లో స్టూడియో ఏర్పాటు చేయాలనే ప్రణాళికకు కరోనాతో బ్రేక్‌ పడింది. ఆ తర్వాత స్టూడియో మొదలుపెట్టి అవసరమైన వాళ్లకు బొమ్మలు చేసి అందిస్తున్నాను. 


ప్రక్రియకు మూడు వారాలు

బొమ్మల కోసం స్టూడియోకు వచ్చేవాళ్లు తక్కువ. ఎక్కువగా క్లయింట్ల ఇళ్లకు వెళ్లి ఇంప్రెషన్స్‌ తీసుకుంటూ ఉంటా. అవసరమైన వస్తువులు, మెటీరియల్‌తో వాళ్ల ఇళ్లకు వెళ్తాను. డిజైన్లు, ధరలను వివరిస్తాను. వాళ్లకు నచ్చితే, పని మొదలుపెడతాను. శిల్పాల తయారీకి ఉపయోగించే మెటీరియల్‌ పిండిలా ఉంటుంది. దీన్లో నీళ్లు కలిపి, తగిన చిక్కదనం వచ్చిన తర్వాత దాన్లో చేయి అచ్చు కావాలంటే చేతినీ, కాలి అచ్చు కావాలంటే కాలినీ ముంచుతా. కొద్ది క్షణాల్లో మెటీరియల్‌ గట్టిపడిపోయి, నమూనా తయారవుతుంది. దానికి అంచులు సరిచేయడం, తేడాలుంటే సరిదిద్దడం చేస్తా. అంతిమంగా సహజసిద్ధమైన రంగులు వేసి, అచ్చుగుద్దినట్టు నిజరూపాన్ని అందిస్తా. చివరిగా వాళ్ల అవసరానికి తగ్గట్టు నచ్చిన మోడల్‌లో బొమ్మలను అందిస్తా. దీనికంతటికీ మూడు వారాల సమయం పడుతుంది. ఇలా ఇప్పటివరకూ సుమారు 200 బొమ్మలు తయారు చేశాను. 


వేర్వేరు వేడుకలకు తగ్గట్టు

పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, షష్ఠి పూర్తులు

ఎక్కువగా అప్పుడే పుట్టిన పసికందుల శిల్పాలకే డిమాండ్‌ ఎక్కువ. పుట్టిన నెల, రెండు నెలల్లోపు పసికందుల చేతులు, పాదాల శిల్పాలను తయారుచేయించుకోవాలని కొందరు అనుకుంటారు. కొందరు పిల్లల మొదటి పుట్టినరోజు నాడు శిల్పాలను చేయించుకుంటారు. ఇక పెళ్లిళ్లు, యానివర్సరీలలో దంపతులు చేతులు కలిపీ, లేదా చిటికెన వేళ్లు కలిపి పట్టుకున్న శిల్పాలను తయారు చేయించుకుంటూ ఉంటారు. పెద్దల షష్ఠిపూర్తి సందర్భాల్లో వాళ్ల చేతుల శిల్పాలను ఫ్రేమ్‌లుగా కావాలనుకుంటారు. పెద్దలు దీవిస్తున్నట్టుగా వాళ్ల చేతుల శిల్పాలు, లేదా పాదాల శిల్పాలను వాళ్ల పిల్లలు తయారు చేయించుకుంటూ ఉంటారు. 


కంట తడి పెట్టించే సందర్భాలు...

ఓ సందర్భంలో ఒకావిడ్‌ తన బాబు చేతుల శిల్పం కోసం నన్ను సంప్రతించింది. నేను ధర చెప్పాను. ఆ తర్వాత ఆవిడ తిరిగి నన్ను సంప్రతించలేదు. నేనూ ఆ విషయం మర్చిపోయాను. అయితే సరిగ్గా ఏడాదికి ఆవిడ నన్ను కలిసింది. శిల్పానికయ్యే ఖర్చు కోసం డబ్బులు దాస్తూ ఉండడం వల్ల అంత ఆలస్యమైందని అంటూ... కూడబెట్టిన ఆ చిల్లర డబ్బులన్నీ నా ముందు ఉంచి, బొమ్మను తయారు చేసిపెట్టమని అడగడంతో నేను అవాక్కయ్యాను. బిడ్డ బొమ్మ తయారు చేయించుకోవాలనే పట్టుదలతో ఆవిడ అంతకాలం డబ్బులు దాచిపెట్టడం నన్నెంతో కదిలించింది. మరో సందర్భంలో మరణానికి చేరువైన తమ తల్లి చివరి జ్ఞాపకం కోసం ఓ కుటుంబం నన్ను సంప్రతించింది. ఆస్పత్రిలో నేరుగా ఐసియులోనే తల్లి చేతుల్లో, తమ చేతులుంచి ముగ్గురు బిడ్డలు నమూనా తీయించుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆ పెద్దావిడ పోయారు. రెండు వారాల సమయం తీసుకుని, శిల్పాన్ని తీసుకెళ్లి ఇచ్చినప్పుడు, ఆ బొమ్మను చూసి ఆ కుటుంబసభ్యులు ఎంతో ఉద్విగ్నానికి లోనయ్యారు. ఆ సందర్భాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. 


                                                                                                 గోగుమళ్ల కవిత