హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌

ABN , First Publish Date - 2021-07-22T06:46:10+05:30 IST

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌

  • రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం
  • స్థలాన్ని ఎంపిక చేసుకున్న సంస్థ.. సర్కారుతో  చర్చలు
  • ఇప్పటికే రాజధానిలో అమెజాన్‌, వాల్‌మార్ట్‌ కేంద్రాలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. అమెజాన్‌, వాల్‌మార్ట్‌ తర్వాత... తాజాగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికోసం రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ సమీపంలో స్థలాన్ని కూడా కంపెనీ ఎంచుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి మరో 3 నెలలు పట్టే అవకాశం ఉంది.


మైక్రోసా్‌ఫ్టకు ఇప్పటికే హైదరాబాద్‌లో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఉంది. భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్‌ జియోతో మైక్రోసాఫ్ట్‌ చేతులు కలిపిన సంగతి తెలిసిందే.  కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్‌ వంటి కొత్తతరం టెక్నాలజీల వినియోగం పెరగడంతో డేటా సెంటర్ల ఏర్పాటు కంపెనీలకు కీలకంగా మారింది. వీటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు భారత్‌లో అందుబాటులో ఉండటంతో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి.  డేటాను స్థానికంగానే ఉంచాలన్న నిబంధన కూడా అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా కేంద్రాలను ఏర్పాటుచేయడానికి ఊతమిస్తోంది.



హైదరాబాద్‌లోనే ఎందుకు..?


హైదరాబాద్‌లో అనేక సానుకూల అంశాలు ఉండటంతో దిగ్గజ కంపెనీలు తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి నగరానికి వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగానికి హైదరాబాద్‌ ముఖ్య కేంద్రంగా మారడం, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండటం, డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించి ప్రోత్సహించడం వంటి అంశాలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.


భారత్‌లో రెండో డేటా సెంటర్‌ రీజియన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గత నవంబరులో ప్రకటించింది. దీనికోసం రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు తెలంగాణలో అతిపెద్ద విదేఽశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే కావడం   విశేషం. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఏర్పాటు చేసే డేటా కేంద్రం 2022లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.


వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌కు హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు డేటా కేంద్రాలు ఉన్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో టయిర్‌-4 స్మార్ట్‌ డేటా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోంది. ఒరాకిల్‌ కంపెనీ తన రెండో డేటా కేంద్రాన్ని నగరంలో ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్‌ ఎస్‌ కంపెనీ కూడా డేటా కేంద్రాల సామర్థ్యాలను పెంచుకుంటోంది.


Updated Date - 2021-07-22T06:46:10+05:30 IST