అర్ధరాత్రి అరణ్య రోదన

ABN , First Publish Date - 2020-08-05T09:40:12+05:30 IST

అర్ధరాత్రి.. అటవీ ప్రాంతం.. జోరువానలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ మరమ్మతులకు గురికావడంతో

అర్ధరాత్రి అరణ్య రోదన

అడవిలో నిలిచిన అంబులెన్స్‌

కరోనా బాధితుడి మృతదేహంతో 4గంటలపాటు తల్లి, భార్య పడిగాపులు

సాయం అందించిన బూర్గంపాడు యువకుడు

 

బూర్గంపాడు, ఆగస్టు 4: అర్ధరాత్రి.. అటవీ ప్రాంతం.. జోరువానలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ మరమ్మతులకు గురికావడంతో సహయంకోసం ఆదివాసీ మహిళలు నాలుగు గంటల పాటు ఎదురుచూసిన హృదయ విధారకమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో సోమవారం ఆర్ధరాత్రి జరిగింది. కరకగూడెం మండలానికి చెందిన ఓ యువకుడు కరోనాతో సోమవారం సాయంత్రం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందాడు. కరోనా మృతదేహం కావడంతో ప్రత్యేక ఆంబులెన్స్‌లో గ్రామానికి తరలించేందుకు ఆదికారులు ఏర్పాట్లు చేశారు. మృతదేహంతో బయలుదేరిన ప్రభుత్వ ఆంబులెన్స్‌ సోమవారం ఆర్ధరాత్రి సమయంలో బూర్గంపాడు మండల పరిధిలోని మణుగూరు క్రాస్‌ రోడ్డు నుంచి మెండికుంట వైపునకు వెళ్లే దారిలో నిలిచిపోయింది. రాత్రి సమయంతో పాటు భారీ వర్షం కురుస్తుండడంతో మృతుడి తల్లి, భార్య సహయం కోసం నాలుగు గంటల పాటు ఎదురు చూశారు. మరో వాహనంలో మృతదేహన్ని తరలించేందుకు ప్రయత్నించినా కరోనా బాధితుడి మృతదేహం కావడంతో ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. దయనీయమైన స్థితిలో దుఃఖాన్ని దిగమింగుకుని ఆ ఆదివాసీ మహిళలు సహయం కోసం ప్రయత్నం చేశారు.


ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని గమనించి బూర్గంపాడుకు చెందిన గొనెల నాని అనే యువకుడికి సమాచారం ఆందించాడు. దీంతో ఆ యువకుడు మృతదేహన్ని వారి గ్రామానికి తరలించేందుకు ముందుకు వచ్చి ట్రాలీ ఆటోను ఏర్పాటు చేశాడు. అంత భాదలో భర్తను కోల్పోయిన భార్య, కొడుకు కోల్పోయిన తల్లి మృతదేహన్ని అంబులెన్స్‌ నుంచి దించి ట్రాలీలోకి ఎక్కించిన దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆభివృద్ధికి కోట్ల రుపాయలు ఖర్చు చేస్తున్నామని చేప్పే ప్రభుత్వాలు, నాయకుల మాటలు నీటి మీద రాతలేనని చెప్పడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు. ఆర్ధరాత్రి జోరు వానలో మృతదేహం తరలింపునకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసిన యువకుడిని పలువురు ఆభినందించారు. 

Updated Date - 2020-08-05T09:40:12+05:30 IST