కర్నూలులో తిరగనివ్వం

ABN , First Publish Date - 2020-02-28T10:59:08+05:30 IST

అధికార వైసీపీలో వర్గపోరు పతాకస్థాయికి చేరింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ నివాసంలో ..

కర్నూలులో తిరగనివ్వం

  • రౌడీషీటర్లు, హంతకులకు భయపడేవాళ్లం కాదు
  • మంత్రి అనిల్‌కు ఎమ్మెల్యే ఆర్థర్‌ అనుచరుల హెచ్చరిక
  • ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన సమావేశంలోనే ఘటన
  • వైసీపీలో పతాక స్థాయికి వర్గ పోరు

కర్నూలు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీలో వర్గపోరు పతాకస్థాయికి చేరింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలోనే ఆయన అనుచరులు జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. మంత్రి అనిల్‌ని జిల్లాలో ఎక్కడా తిరగనివ్వబోమన్నారు. 


సమావేశంలో పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ మంత్రి అనిల్‌ కుమార్‌తోపాటు వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘జిల్లాలో ఇంకో నియోజకవర్గ వ్యవహారంలో జోక్యం చేసుకున్నావా? నందికొట్కూరులోనే అత్యుత్సాహమెందుకు? ఎస్సీ అభ్యర్థి అంటే అంత చులకనా! మార్కెట్‌ కమిటీని యథావిథిగా ప్రమాణ స్వీకారం చేయించకుంటే బిడ్డా.. మళ్లీ కర్నూలులో అడుగు కూడా పెట్టవు. ఇప్పట్నుంచి అనిల్‌ కుమార్‌ ఎక్కడ అడుగు పెట్టినా ఎదుర్కోవాలే! నేరస్థులు, హంతకులు, రౌడీషీటర్లకు భయపడే వాళ్లం కాదు’ అంటూ ఆర్థర్‌ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికొట్కూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిని తమ వర్గానికి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆర్థర్‌ ఒక పేరును పార్టీ అధిష్ఠానానికి పంపారు. అయితే తమ వర్గానికి కూడా న్యాయం చేయాలంటూ సిద్ధార్థ రెడ్డి కూడా మరో పేరును ప్రతిపాదించారు. సిద్ధార్థ రెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపుతోందని, అందుకు మంత్రి అనిల్‌ మద్దతు పలుకుతున్నారని స్థానికంగా విమర్శలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 


స్థానికంగా అనేక కాంట్రాక్టులపై కూడా సిద్ధార్థ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్గ పోరు మొదలైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీలో చీలికలు ఏర్పడి అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో నేటికీ యార్డు చైర్మన్లపై ఉత్తర్వులు జారీ కాలేదు. కాగా పార్టీలో కొందరు కార్యకర్తల్ని చేర్చుకుంటున్నామంటూ ఎమ్మెల్యే అనుచరులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్‌ ఉండగానే ఈ హెచ్చరికలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  కర్నూల్లో ఇప్పటికీ ఏ నీటి ప్రాజెక్టూ చేపట్టకపోవడంతో వైసీపీపై జిల్లావాసులు గుర్రుగా ఉన్నారు. 


ఈ క్రమంలో ఎమ్మెల్యేల రూపంలో రోజుకో వివాదం ఆ పార్టీ పరువును బజారున పడేస్తోంది. ఈనెల 18న కర్నూలు వచ్చిన సీఎం సభలోనూ సిద్ధార్థరెడ్డికి అవమానం తప్పలేదు. కాన్వాయ్‌ వస్తున్న క్రమంలో ఆ పక్కనే నడుస్తున్న ఆయనను భద్రతా సిబ్బంది పక్కకు తోసేశారు. దీంతో అధికారులతో సిద్ధార్థకు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నియోజకవర్గంతోపాటు జిల్లాలోనూ తనపై వివాదాలు సృష్టిస్తున్నారని నాయకుల వద్ద సిద్ధార్థరెడ్డి వాపోయినట్లు సమాచారం. 


వైసీపీ రాష్ట్ర కార్యదర్శిపై ఎమ్మెల్సీ దాడి 

అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలు... దాడుల వరకూ వెళ్లాయి. ఉగాదికి ఇచ్చే ఇళ్ల స్థలాల చదును విషయంలో మాటామాటా పెరిగి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి మహ్మద్‌ ఇక్బాల్‌ దాడిచేశారన్న వార్త హిందూపురంలో ఉద్రిక్తతకు దారి తీసింది. కొటిపి వద్ద పట్టణ ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని ఎమ్మెల్సీ వర్గీయులు కొన్ని రోజులుగా చదును చేస్తున్నారు. ఈ పనులను హనుమంతరెడ్డి అడ్డగించి.. మాట్లాడేందుకు ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇరువురి మధ్య మాటామాటా పెరిగి జరిగిన ఘర్షణలో హనుమంతరెడ్డి ముక్కులోంచి రక్తస్ర్తావమైంది. ఎమ్మెల్సీ తన ముఖంపై పిడిగుద్దులు గుద్దినట్లు హనుమంతరెడ్డి చెప్పారు. దీనిపై  ఇక్బాల్‌ స్పందిస్తూ... తన ఇంటి వద్దకు హనుమంతరెడ్డి వచ్చారని, అయితే తామెవరూ దాడి చేయలేదని చెప్పారు.

Updated Date - 2020-02-28T10:59:08+05:30 IST