పభుత్వాస్పత్రుల్లో కరోనాకు మెరుగైన చికిత్స

ABN , First Publish Date - 2021-05-17T05:32:50+05:30 IST

పభుత్వాస్పత్రుల్లో కరోనాకు మెరుగైన చికిత్స

పభుత్వాస్పత్రుల్లో కరోనాకు మెరుగైన చికిత్స
హన్మకొండలోని హరిత హోటల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 ఆస్పత్రుల పర్యవేక్షణకు కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ

 అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు  

 ఔట్‌సోర్సింగ్‌ ద్వారా వైద్య సిబ్బంది నియామకం

 రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


హన్మకొండ టౌన్‌/వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, మే 16: కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించినట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం హన్మకొండలోని హరిత హోటల్‌లో వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో కరోనా వ్యాప్తికి చేపట్టిన చర్యలు, కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఎర్రబెల్లి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌

రావు మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, రెమిడిసివర్‌ అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌ తర్వాత అత్యధికంగా వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రతీరోజు వెయ్యి సిలిండర్ల ఆక్సిజన్‌, బాధితుల సంఖ్యను బట్టి ప్రతిరోజు 1,650 రెమిడిసివర్‌ ఇంజక్షన్‌లను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. అలాగే ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ సేవలను సమర్థవంతంగా నిర్వహించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని సీఎం నిర్ణయించినట్టు తెలిపారు. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆందిస్తున్న సేవలను మానిటరింగ్‌ చేసేందుకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీ వేసినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ కమిటీ ఆస్పత్రుల్లో ఆందిస్తున్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నివేదిక ఇస్తారని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే సదరు ఆస్పత్రులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల వారు తమ సేవలను పెంచాలన్నారు. రెండు గంటలకోసారి వైద్యసేవల వివరాలను సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు సహకరించాలని మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. కరోనా కట్టడి కోసం తమ వంతు సహకారం అందిస్తున్న దాతలకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలిగించే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాంటాలైన ధాన్యం రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు విమర్శలు మాని వ్యాక్సిన్‌ సరఫరాకు సహకరించాలన్నారు. 

వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ.. కరోనా మృతదేహాలను అప్పగించేటప్పుడు బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు పేదవారిని ఆదుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఇంటింటి సర్వే వల్ల కరోనా బారిన నుంచి ప్రజలను కాపాడుతున్నట్లు చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలను తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది తీరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కరోనా బారినపడిన పేద కుటుంబాలపై సానుభూతితో వ్యవహరించాల న్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ప్రైవేటు ఆస్పత్రిలో అన్ని వైద్య సేవలకు ఒకే రేటు ఉండాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, అర్బన్‌, రూరల్‌ జిల్లా కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎం.హరిత, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్‌, వైద్య అధికారులు డీఆర్‌డీవోలు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:32:50+05:30 IST