భగీరధ డిజైన్‌చూశాకే నేను మనసు మార్చుకున్నా- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-01-20T20:02:40+05:30 IST

మిషన్‌ భగీరధ పనులు మొదలైనప్పుడు టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న తాను ఈ ప్రాజెక్ట్‌ డిజైన్‌ చూసిన త్వాతనే మనసు మార్చుకుని టీఆర్‌ఎస్‌లో చేరినట్టు పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి

భగీరధ డిజైన్‌చూశాకే నేను మనసు మార్చుకున్నా- ఎర్రబెల్లి

సిద్ధిపేట: మిషన్‌ భగీరధ పనులు మొదలైనప్పుడు టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న తాను ఈ ప్రాజెక్ట్‌ డిజైన్‌ చూసిన త్వాతనే మనసు మార్చుకుని టీఆర్‌ఎస్‌లో చేరినట్టు పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌లోకి రావడానికి ఈ ప్రాజెక్ట్‌కారణమని, దీనికి తాను గర్విస్తున్నట్టు చెప్పారు. గతంలో డబ్బులుఉన్నా నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. మిషన్‌ భగీరధతో ఇప్పుడు రాష్ట్రంలో నీటి కొరత తీరినట్టేనని మంత్రి పేర్కొన్నారు.


సిద్ధిపేట జిల్లా కోమటి బండలో మిషన్‌ భగీరధ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  మంత్రితో పాటు సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సిద్ధిపేటలో సీఎం కేసీఆర్‌ సాధించిన విజయాన్ని ఇప్పుడు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతోందన్నారు. తన రాజకీయ జీవితంలో నీళ్ల కోసం ప్రజలు పడ్డబాధల్ని ఎన్నో చూశాను. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ఎన్నో నిధులు ఖర్చు చేసేవారు. మిషన్‌ భగీరధ ప్రాజెక్టు వల్ల రాష్ర్టానికి అవార్డులు వస్తున్నాయని తెలిపారు.


చాలా రాష్ర్టాలు బోరింగ్‌లు వేసి నీళ్లు సరఫరా చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం శుద్ధిచేసిన నీటిని సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ఈసందర్భంగా స్మితాసబర్వాల్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరధ పూర్తిఅయ్యిందని భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సుమారు 56లక్షల ఇండ్లకు నల్లాలతో శుద్ధిచేసిన నీరు సరఫరా అవుతోందని తెలిపారు. 

Updated Date - 2021-01-20T20:02:40+05:30 IST