కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది

ABN , First Publish Date - 2021-09-13T22:58:53+05:30 IST

కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతం లో కాంగ్రెస్ మోసం చేసింది .ఇపుడు బీజేపీ మోసం చేస్తోందని పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది

హైదరాబాద్: కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతం లో కాంగ్రెస్ మోసం చేసింది .ఇపుడు బీజేపీ మోసం చేస్తోందని పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్ లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోంది. కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ,తెలంగాణ ప్రజల హక్కు అని ఆయన అన్నారు.విభజన చట్టంలో కేసిఆర్ పట్టు పట్టి కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన పెట్టించారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ,ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా విభజన చట్టం లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రధాన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని,ఈ హామీలు సాధించకుండా బీజేపీ నేతలు సిగ్గు శరం లేకుండా పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. సోమవారం టీఆర్ఎస్ ఎల్పీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పోచంపల్లితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.


 కోచ్ ఫ్యాక్టరీ సాధించాకే బీజేపీ నేతలు తెలంగాణ లో తిరగాలని, తెలంగాణ కు బీజేపీ నేతలు ఏం చేయకున్నా ఫరవా లేదు...కానీ చెడగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కు మెడికల్ కాలేజీల కేటాయింపుల్లో కేంద్రం అన్యాయం చేసినా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర లాతూర్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలించినా బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. బీజేపీ నేతలు మాయ మాటలు బంద్ చేసి తెలంగాణ కు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని ఎర్రబెల్లి సూచించారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్షత ఇంకెన్నాళ్లు? ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు తెలంగాణ లో తిరుగుతారని ఆయన ప్రశ్నించారు.

 

చీఫ్ విప్ వినయ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ కు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని, గతం లో కాంగ్రెస్ కాజీ పేట కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ని పంజాబ్ కు తరలిస్తే ఇపుడు బీజేపీ లాతూర్ కు తరలించింది.బండి సంజయ్ తన పాద యాత్ర ను ఢిల్లీ వైపు మార్చి తెలంగాణ కు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దొంగచాటున రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని కేంద్రం మహారాష్ట్ర లాతూర్ కు తరలించిందని విమర్శించారు.హుజురాబాద్ కు బీజేపీ నేతలు ఏ మొఖం పెట్టుకొని వస్తారు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చిన తరువాతనే బీజేపీ నేతలు బయట తిరగాలని ఆయన డిమాండ్ చేశారు.


Updated Date - 2021-09-13T22:58:53+05:30 IST