ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వంద శాతం టీకాలు- మంత్రి ఈటల

ABN , First Publish Date - 2021-04-18T20:42:00+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడిన వారిలో 5శాతం మందికే లక్షణాలు కనపిస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వంద శాతం టీకాలు- మంత్రి ఈటల

హైదరాబాద్‌: కరోనా సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడిన వారిలో 5శాతం మందికే లక్షణాలు కనపిస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ , ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు 100శాతం టీకాలు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆదివారం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ ప్రతి పిహెచ్‌సిలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి రోఉకు 10లక్షల టీకాలు వేసే సామర్ధ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. 


రాష్ట్రంలో కోవిడ్‌ తాజా పరిస్థితిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కాగా కోవిడ్‌ బారిన పడిన వారందరికీ చికిత్సనందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు తగినన్ని ఉన్నాయని, కొరత వుందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సీజన్‌ సరఫరా విషయం పైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సీజన్‌ అవసరం ఉంటుంది. కేసులు పెరిగితే 350టన్నుల అవసరం ఉండొచ్చని చెప్పారు. రోగులకు అవసరమైన చికిత్స అందించే విషయంలో వైద్యులు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-04-18T20:42:00+05:30 IST