ఒక్క కేసు కూడా హైదరాబాద్‌కు వెళ్లొద్దు.. మంత్రి ఈటల వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-29T19:15:40+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఏ ఒక్క కరోనా కేసు కూడా హైదరాబాద్‌ వెళ్లకూడదని, అవసరమైన అన్ని సౌకర్యాలు ఎంజీఎంలోనే కల్పిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం, నిధులు కేటాయించే నిర్ణయం

ఒక్క కేసు కూడా హైదరాబాద్‌కు వెళ్లొద్దు.. మంత్రి ఈటల వ్యాఖ్యలు

ఎంజీఎంలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..

కేఎంసీ  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని వాడుకుంటాం..

కరోనా రోగుల కోసం అదనంగా 500 పడకలు ఏర్పాటు

ఎంజీఎంకు సూపరింటెండెంట్‌ను త్వరలో నియమిస్తాం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఏ ఒక్క కరోనా కేసు కూడా  హైదరాబాద్‌ వెళ్లకూడదని, అవసరమైన అన్ని సౌకర్యాలు ఎంజీఎంలోనే కల్పిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం, నిధులు కేటాయించే నిర్ణయం జిల్లా మంత్రి, జిల్లా అధికారులే తీసుకుంటారన్నారు. మంగళవారం ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కోవిడ్‌-19పై వరంగల్‌లోని సీఎస్సార్‌ గార్డెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.  జిల్లాల వారీగా కరోనా సంబంధిత సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రోగుల సంఖ్య పెరుగుతున్నందున ఎంజీఎంలో ఇప్పటికే  ఉన్న 200 పడకలకు అదనంగా మరో 250 పడకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటితో పాటు సీకేఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మరో 250 పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క కరోనా రోగి కూడా వైద్యం అందలేదనే పరిస్థితి రావద్దన్నారు. కావాల్సిన మందులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు ఆక్సిజన్‌ వంటి పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. వైద్యులు అంకిత భావంతో రోగులకు సేవలు అందించాలన్నారు.


నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు 

కరోనా అనుమానిత లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వారి సూచనలు పాటించాలని, నిర్లక్ష్యంతో సమస్య ముదిరే వరకు ఉంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశముందని మంత్రి ఈటల అన్నారు. నిజానికి కరోనా మృతుల సంఖ్య కేవలం 4 నుంచి 5 శాతమే ఉందన్నారు. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, 60 ఏళ్లు పైబడిన వారే కరోనా వల్ల మృతి చెందుతున్నారన్నారు. అనవసర భయాందోళనకు గురై ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవద్దని ప్రజలను కోరారు.  సామాజిక వ్యాప్తిగా  మారినప్పటికీ కూడా కరోనా వైరస్‌ విస్తృతిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 


వైద్యుల సేవలను అభినందించాలి

రక్తం పంచుకుని పుట్టిన పిల్లలే కరోనా బాధిత తల్లిదండ్రుల  వద్దకు రావడానికి వెనుకాడుతున్నారని, అలాంటిది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది మాత్రం వారికి సేవలు చేస్తున్నారని, వారి సేవలను అభినందించాలని మంత్రి ఉద్బోధించారు. కరోనాతో చనిపోయినా, ఇతర కారణాలతో చనిపోయినా వారిని ప్రజలు శ్మశానవాటికలకు రానివ్వడం లేదన్నారు. అలాంటి మృతదేహాలను  మునిసిపాలిటీల్లో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘హితమ్‌’ యాప్‌ ద్వారా కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామన్నారు. రిటైర్డ్‌ డాక్టర్ల బృందం ఈ యాప్‌ ద్వారా కరోనా రోగులకు ఫోన్‌లో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశ వర్కర్లు ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇస్తారన్నారు. దీంతో వెంటనే డాక్టర్లు అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. ప్రత్యేకంగా అవసరమైన చోట ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి త్వరలోనే సూపరింటెండెంట్‌ను నియమిస్తామన్నారు. 


చికిత్సతో పాటు ధైర్యాన్ని నింపాలి:  మంత్రి ఎర్రబెల్లి

కరోనా బాధితులకు వైద్యం అందించడంతో పాటు వారిలో ధైర్యాన్ని నింపాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. కరోనా వస్తే మరణిస్తారనే భయాన్ని పోగొట్టి నయమవుతారని భరోసా ఇవ్వాలన్నారు. వైద్య సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే నయం కావచ్చన్నారు. ప్రభుత్వ సూచనలు ఆచరిస్తే కరోనా వైర్‌సను ఎదుర్కోవచ్చన్నారు. ప్రతీ కరోనా బాధితుడిని కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఎంజీఎంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, ధనసరి అనసూయ, ఆరు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-29T19:15:40+05:30 IST