వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి కృషి- మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-07-05T00:37:04+05:30 IST

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్దని బలోపేతం చేసే కార్యక్రమాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి కృషి- మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డిజిల్లా: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్దని బలోపేతం చేసే కార్యక్రమాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ నియోజక వర్గం, సంగంపేట లోని బాలికల వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో నూతన వసతి గృహాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం అనుబంద రంగాలని లాభసాటిగా మార్చేందుకు వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నామని వివరించారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమాలతో పాటు ఉచిత విద్యుత్‌, గోడౌన్‌ల నిర్మాణం,పంటల్ని మద్దతు ధరలకే కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాలని చేపట్టామని అన్నారు. 


వ్యవసాయం ఉద్యానపంటలతో పాటు మత్స్యపరిశ్రమలను , గొర్రెలపెంపకాన్ని ప్రోత్సహించడం వల్ల గ్రామాల్లో రైతులకు చేతినిండా పని దొరుకుతోందన్నారు. కరోనాతో అన్ని రంగాలు కుదేలు అయినప్పటికీ రైతులకు వ్యవసాయ రంగంలో చేతినిండా పని ఉండి అధిక దిగుబడులు సాధిస్తున్నారని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి మన రైతులు చేరుకోవడం గర్వకారణమని అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన తెలంగాణ సోనా వరి రకం మధుమేహులకు ఎంతో ఉపయోగమని అన్నారు.


ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అటవీ కళాశాల , ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జిల్లాలో ఈ రంగాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ అభివృద్ధికి తన వంతు సహకారం ఇస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, జిల్లాపరిషత్‌ఛైర్‌పర్సన్‌ మంజుశ్రీ, తదితరులుపాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T00:37:04+05:30 IST