తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే మహాధర్నా:హరీశ్ రావు

ABN , First Publish Date - 2021-11-17T22:43:30+05:30 IST

తెలంగాణ రైతుల ప‌క్షాన నిల‌బ‌డి వారి ప్రయోజనాలను కాపాడేందుకే టీఆర్ఎస్ పార్టీ మ‌హాధ‌ర్నాను త‌ల‌పెట్టింద‌ని ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే మహాధర్నా:హరీశ్ రావు

హైద‌రాబాద్: తెలంగాణ రైతుల ప‌క్షాన నిల‌బ‌డి వారి ప్రయోజనాలను కాపాడేందుకే టీఆర్ఎస్ పార్టీ మ‌హాధ‌ర్నాను త‌ల‌పెట్టింద‌ని ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు పేర్కొన్నారు. గురువారం ఇందిరా పార్కు వ‌ద్ద మ‌హాధ‌ర్నా జరగనున్న నేపధ్యంలో బుధవారం ఏర్పాట్ల‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ  రాష్ట్ర రైతుల ప‌క్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధ‌ర్నా నిర్వ‌హించ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 


టీఆర్ఎస్ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, ప్ర‌భుత్వంలో ఉన్నా తాము ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటామ‌న్నారు. ల‌క్ష‌లాది మంది రైతుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల‌కు ఒకే విధానం ఉండాలి. పంజాబ్‌లో పండించే ప్ర‌తి గింజ‌ను కొంటున్నారు. తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని మాత్రం కొన‌డం లేదు. ఈ ప‌ద్ధ‌తి స‌రికాదు. వ‌డ్లు కొనాల్సిన బాధ్య‌త కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మహాధ‌ర్నాలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్య‌లో పాల్గొంటాయని అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.



Updated Date - 2021-11-17T22:43:30+05:30 IST