సమైక్య రాష్ట్రంలో విధ్వంసానికి గురైన వ్యవసాయం: జగదీశ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-28T20:59:24+05:30 IST

సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం విధ్వంసానికి గురైందని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాతనే వ్యవసాయానికి పూర్వవైభవం వచ్చిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు.

సమైక్య రాష్ట్రంలో విధ్వంసానికి గురైన వ్యవసాయం: జగదీశ్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి: సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం విధ్వంసానికి గురైందని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాతనే వ్యవసాయానికి పూర్వవైభవం వచ్చిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. దేశ భాండాగారంగా తెలంగాణను మలిచిన ఘనం ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి తుంగతుర్తిలో పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో వెలికి మాటలు మాట్లాడిన వారంతా ఆశ్చర్య పోయేలా సుభిక్షమైన పాలన అందిస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆకలి అన్నదే లేదని, ఆత్మహత్యలు లేని తెలంగాణ మనకళ్లముందు సాక్షాత్కారమైందన్నారు. 


ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌, బిజెపిలు తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆపార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు,గ్యాస్‌,పెట్రోల్‌ ధరలను పెంచి ప్రజల్ని దోచుకుతింటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఏం ముఖం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన సంగ్రామం అంటున్నారు. అదే ఎవరిపైనా చెప్పాలని డిమాండ్‌చేశారు. అభివృద్ధి నిరోధకులైన కాంగ్రెస్‌, బిజెపి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేక పోతే తెలంగాణ అవస్ధలు పడే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్‌,లింగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T20:59:24+05:30 IST