దేవినేనికి మరోసారి మంత్రి నాని సవాల్.. దమ్ముంటే...

ABN , First Publish Date - 2021-01-19T17:26:17+05:30 IST

విజయవాడ వేదికగా టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.

దేవినేనికి మరోసారి మంత్రి నాని సవాల్.. దమ్ముంటే...

కృష్ణా జిల్లా : విజయవాడ వేదికగా టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మాజీ మంత్రి ఉమ ప్రతి సవాల్ విసిరి.. ఇవాళ దీక్షకు పూనుకున్నారు. అయితే.. ఆయన చేస్తున్న దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని పరిస్థితి. దీంతో గొల్లపూడి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు వైసీపీ కార్యకర్తలు.. మరోవైపు టీడీపీ కార్యకర్తల నినాదాలతో హోరెత్తిస్తున్నారు.


10 సార్లు ఫోన్ చేశా..

ఈ క్రమంలో మరోసారి మీడియా ముందుకొచ్చిన మంత్రి నాని సవాల్ విసిరారు. దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసే దేవినేని ఇలా నాటకం ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలి. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దాం. అక్కడే కొట్టకపోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళొపోతాను. సొల్లు ఉమా సొల్లు కబుర్లు చెబుతాడు. బహిరంగ చర్చకు సిద్ధమని రాత్రి నుంచి ఉమకు 10 సార్లు ఫోన్ చేశాను. ఉమతో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నేను చర్చకు రమ్మంటే దేవినేని నాటకాలాడుతున్నాడుఅని నాని మరోసారి సవాల్ విసిరారు. నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రిని ముఖ్యమంత్రి జగన్ కంట్రోల్‌లో పెట్టాలని కూడా చెప్పుకొస్తున్నారు.


అసలేం జరిగింది..!?

దేవినేని ఉమా.. నీకంటే బ్రోకర్లు ఎవరైనా ఉన్నారా.. వదిన్ని చంపి శాసనసభ్యుడవయ్యావు. నేను రాజకీయాల్లో లేకుంటే నిన్ను చెప్పు తీసుకుని కొట్టేవాడిని. మంచి మర్యాద లేకుండా జగన్‌పై నోరు పారేసుకుంటే నా చేతుల్లోనో, కేపీ చేతుల్లోనో, వంశీ చేతుల్లోనే తన్నులు తినక తప్పదు. ప్రెస్‌మీట్‌లు పెట్టి కుక్కలా మొరుగుతావు.. నేరుగా ఫోన్‌ చేసి తిడితే మాట్లాడవు. నీఇంట్లోనైనా చర్చకు వస్తా.  చంద్రబాబు ఏం చేశాడో, జగన్‌ ఏం చేశాడో తేల్చుకుందాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే.. నా సవాల్‌ స్వీకరించు. పిచ్చి వాగుడు మానకుంటే నీ ఇంటికొచ్చి బడిత పూజ చేయకుంటే నాపేరు కొడాలి నానినే కాదుఅని నాని సవాల్ విసిరారు.


దమ్ముంటే రా! తేల్చుకుందాం!!

దమ్ముంటే రండి. ప్రజల ముందే తేల్చుకుందాం రండి. నువ్వు వస్తావో, లేక సీఎం జగన్మోహన్‌ రెడ్డి వస్తారో రండి. ఎవరూ టచ్‌ చేస్తారో టచ్‌ చేసి చూడండి. చిల్లర మాటలు మాట్లాడే నువ్వు అసలు మంత్రివేనా. పేకాట, కోతాట ఆడిస్తూ అడ్డంగా దొరికిపోయిన నువ్వు గొల్లపూడి వచ్చి పిచ్చి వాగుడు వాగుతావా. తంతాం.. పొడుస్తాం, బడిత పూజ చేస్తాం.. నరికేస్తాం.. అంటూ చిల్లర వ్యాఖ్యలు చేస్తావా? చంద్రబాబుపై, నాపై చేసిన వ్యాఖ్యలకు నిరసగా మంగళవారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట నిరసన చేస్తా. ప్రభుత్వానికి కానీ, మంత్రికి కానీ, జగన్‌కు కానీ దమ్ముంటే రండి తేల్చుకుందాంఅంటూ కొడాలి నానికే ఉమ ప్రతి సవాల్ విసిరారు.

Updated Date - 2021-01-19T17:26:17+05:30 IST