ఎన్జీటీ నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందన

ABN , First Publish Date - 2020-06-07T01:48:58+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎన్జీటీ నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందన

హైదరాబాద్ : నగరంలోని గండిపేట చెరువుకు ఎగువన జన్వాడ గ్రామంలో జీవో 111కు విరుద్ధంగా ఫామ్‌హౌజ్‌ నిర్మించారంటూ దాఖలైన పిటిషన్‌లో మంత్రి కేటీఆర్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ ‌(ఎన్జీటీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం నాడు ఈ నోటీసులపై మంత్రి తాజాగా స్పందించారు. ఒక కాంగ్రెస్ నేత ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ భూమి తనది కానే కాదని ఇదివరకే ఆ విషయంపై స్పష్టత ఇచ్చానని మరోసారి కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై చేసిన తప్పుడు దుష్ప్రచారంపై న్యాయపరంగా ఎదుర్కొంటానని మంత్రి తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమైనవేనని నిరూపిస్తానని ఈ సందర్భంగా మంత్రి ఒకింత సవాల్ విసిరారు. 


నిజనిర్ధారణ కమిటీ..

కాగా.. శుక్రవారం నాడు కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోర్డు, హెచ్‌ఎండీఏ, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ, హైదరాబాద్‌ లేక్స్‌ అండ్‌ వాటర్‌ బాడీస్‌ మెనేజ్‌మెంట్‌ సర్కిల్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. జీవో నంబర్‌ 111ను ఉల్లంఘిస్తూ జన్వాడలో అనుమతులు లేకుండా అక్రమంగా ఫామ్‌హౌజ్‌ నిర్మించారంటూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఎన్జీటీ న్యాయ సభ్యులు జస్టిస్‌ రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం అక్రమ నిర్మాణం, అనుమతులు ఇతర అంశాలపై అధ్యయనం చేయడానికి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

Updated Date - 2020-06-07T01:48:58+05:30 IST