తెలంగాణ సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి: కేటీఆర్

ABN , First Publish Date - 2022-02-16T23:58:44+05:30 IST

తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు

తెలంగాణ సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి: కేటీఆర్

నిజామాబాద్: తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో అమలు చేస్తున్నకార్యక్రమాల వల్లనే తెలంగాణ  గుణాత్మక మార్పు దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో 119.41 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణం పనులకు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ బుధవారం స్థానిక శాసన సభ్యులు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. 

  

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలోనే ఇతర ఏ రాష్ట్రాలలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక్కో నీటి బొట్టును వొడిసిపడుతూ, కోటిన్నర ఎకరాలలో ప్రతి గుంటకు రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందించాలనే కృత నిశ్చయంతో తమ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాలయను వెచ్చిస్తోందన్నారు. ఇందులో భాగంగానే సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 120 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గడిచిన డెబ్బై సంవత్సరాలలో సాధ్యపడని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామసాగర్, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం, నిజాంసాగర్ కు కాళేశ్వరం జలాల మల్లింపు తదితర పథకాలతో తెలంగాణా సస్యశ్యామలంగా మారి పచ్చదనంతో అలరారుతోందని అన్నారు. రాష్ట్రంలో 46 వేల చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయ పథకం ద్వారా జీవం పోశామన్నారు. రైతును రాజుగా మార్చాలనే సదాశయంతో సీఎం కేసీఆర్ రైతులు పంటల సాగు కోసం 50 వేల రూపాయలను పెట్టుబడి రూపేణా అందిస్తున్నారని, రైతు బీమా అమలు చేస్తూ అన్నదాత కుటుంబాల్లో ధీమాను నింపారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

     

ఏ ఉద్దేశ్యంతో తెలంగాణను సాధించుకున్నామో, ఆ లక్ష్యం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి ధ్యేయమని, ఎవరు సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ అభివృద్దే తమ లక్ష్యమని అన్నారు. కాగా, అందమైన గుట్టలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న సిద్ధాపూర్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, బాన్సువాడ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లులు కురిపించారు. స్పీకర్ పోచారంకు ఆయన  ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గురించి ఉన్నంత అవగాహన మరెవరికి ఉండదని అన్నారు. పట్టుబట్టి మరీ నిధులను సాధించుకోవడంలో పోచారం సిద్దహస్తులని, ఆయన ఏ పని చేసిన నిత్యా విద్యార్థిలా ఎంతో ప్రణాళికాబద్ధంగా, అంకిత భావంతో చేస్తారని కొనియాడారు. 


Updated Date - 2022-02-16T23:58:44+05:30 IST