సహకార రంగమే దేశానికి వెన్నుముక: మంత్రి నిరంజన్ రెడ్డి
ABN , First Publish Date - 2021-07-30T00:43:55+05:30 IST
సహకార రంగమేదేశానికి వెన్నుముక అని,అది బలంగా ఉంటేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు
హైదరాబాద్: సహకార రంగమేదేశానికి వెన్నుముక అని,అది బలంగా ఉంటేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో సహకార శాఖను బలోపేతం చేసుకుందామని,స్పష్టమయిన ప్రణాళికతో ముందుకుసాగుదామని అన్నారు. సమర్దవంతమయిన ఎందరో అధికారులు సహకార శాఖలో ఉన్నారు. అందరం కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సహకార శాఖలో డీఆర్ నుంచి ఎస్ సి వరకు పదోన్నతులు పొందిన అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార శాఖ మీద ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకు కృషి చేద్దామని,ఏ విధంగా ముందుకెళ్తే సహకార శాఖ ప్రతిష్టను ఇనుమడించగలమో సూచించండి అని అధికారులకు సూచించారు. కొన్ని రాష్ట్రాలలో సహకారరంగం చాలా బలంగాఉంది. వారిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్దామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలలో పదోన్నతులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వాల నిర్ణయాలు, కోర్టు కేసులు పదోన్నతుల విషయంలో చిక్కుముళ్లుగా ఉన్నాయి. పదోన్నతుల కోసం నియమించిన కమిటీ విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేయడాన్ని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కమీషనర్ వీరబ్రహ్మయ్య, సహకార గెజిటెడ్ అధికారులు సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి భీం రాజ్ తదితరులు పాల్గొన్నారు.