నిజాం సాగర్ నుంచి సాగు కోసం నీటి విడుదల

ABN , First Publish Date - 2021-07-05T23:59:41+05:30 IST

రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం సోమవారం నీటిని విడుదల చేశారు

నిజాం సాగర్ నుంచి సాగు కోసం నీటి విడుదల

కామారెడ్డి జిల్లా: రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం సోమవారం నీటిని విడుదల చేశారు.ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జూలైలో సాగు నీటిని అందించడం గొప్ప విషయమని,కాళేశ్వరం ద్వారా 1.5  టి.ఎం.సి.ల నీరు నిజాంసాగర్ లో కలపడం వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. అవసరమైతే ఇంకో రెండు టీఎంసీల నీటిని ముఖ్యమంత్రి ఇస్తారని, గోదావరి, మంజీరా జలాలు కలిపి నిజాంసాగర్ లో సాగునీటిని రైతులకు విడుదల చేయడం వల్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.


దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి గ్రామాల  అభివృద్ధి కోసం ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నారని,  ప్రతి గ్రామ పంచాయతీకి  ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ మంజూరు చేసి గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జుక్కల్ శాసన సభ్యుల కోరిక మేరకు నిజాంసాగర్ మండలం హాసన్ పల్లి గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైయిన్స్ నిర్మాణాలకు 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  అంతకుముందు శాసనసభాపతి పోచారం హాసన్ పల్లి గ్రామంలో పల్లె ప్రగతి లో భాగంగా  మొక్కలు నాటారు.  అనంతరం గుల్ దస్తా గెస్ట్ హౌస్ ను పరిశీలించారు. 


శాసన సభాపతి  పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను మనమిప్పుడు చూస్తున్నామని,  రాష్ట్రంలో కోటి  50 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించి రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు.మంజీరా నదిపై కట్టిన నిజాంసాగర్ కు వర్షాలు లేక, పైన ఉన్న రాష్ట్రాల కారణంగా నిజాంసాగర్  నీటిని త్రృప్తికరంగా వాడుకోలేదని, దీనిని దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1.5 టీఎంసీల నీటిని అందించినట్టు తెలిపారు. ఇప్పుడు సాగర్ లో 7.4 టీఎంసీల నీరు  రిజర్వు చేశామని చెప్పారు. ఈ నీటిని విడుతల వారీగా లక్షా 30 వేల ఎకరాలకు వర్షాకాలం పంట కోసం సాగునీటిని అందించడానికి ముఖ్యమంత్రి ఆదేశించారని, ఇది  మంచి సమయమని, అందుకే ఈరోజు నుండి నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.  

Updated Date - 2021-07-05T23:59:41+05:30 IST