Abn logo
Oct 22 2020 @ 01:40AM

అమరుల స్మరణ మన బాధ్యత

Kaakateeya

పోలీసు అమరుల సంస్మరణ సభలో మంత్రి పువ్వాడ


ఖమ్మం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తాము సమిధలుగా మారి దేశానికి రక్షణ వలయంగా నిలిచి అమరులైన పోలీసులు వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలస్తున్నారనీ, కొవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులతోపాటు పలు విపత్తులను దీటుగా ఎదుర్కొని ప్రజాసేవలు, పౌరసేవలు అందిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన అమరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ధైర్యవంతులను దేశానికి ఇచ్చిన కుటుంబాలకు భవిష్యత్తు తరాలు ఎప్పటకీ రుణపడి ఉంటాయన్నారు. శాంతి సమాజ నిర్మాణం కోసం అమరుడైన పోలీసు ఉన్నతాధికారి ఉమేష్‌చంద్రను గుర్తుచేసుకుంటూ ఎంతోమంది పోలీసు అమరుల ప్రాణ త్యాగ ఫలితంగానే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నా మన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ అహర్నిశలు బాధ్యతయుతమైన విధులు నిర్వహిస్తున్నారన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లో ప్రజలకు తామున్నామనే భరోసా కల్పించిన పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు.


జిల్లాకు కమిషనరేట్‌ అవసరమనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి హోదాను సాధించడం ద్వారా జిల్లాలో సేవలు మరింత విస్తృత పరిచేందుకు దోహదపడిందని తెలిపారు.  అమరుల కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అర్హులైన కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. 2020 వరకు ఉగ్రవాదుల చర్యలలో అమరులైన 284 మంది పోలీసులు పేర్లను చదువుతూ వారికి సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల స్మృత్యర్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. 


అంకితభావంతోనే నేరాల నియంత్రణ: జిల్లా జడ్జి లక్ష్మణ్‌

పోలీసులు నిర్వహిస్తున్న విధుల పట్ల నిబద్ధత, అంకితభావంతోనే నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు భరోసా ఉంటుందని జిల్లా జడ్జి ఎం. లక్ష్మణ్‌ అన్నారు. కొవిడ్‌ సమయంలో రక్త సంబంధీకులకు దూరంగా ఉంటూ ముందుండి పోరాటం చేశారన్నారు. అలాంటి వారి త్యాగాలను స్మరించడం ద్వారా పోలీసు సిబ్బందిలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ నిరంతరం శాంతిభద్రతల కోసం పనిచేసే పోలీసుల పాత్ర చాలా కీలకమైందన్నారు. కోవిడ్‌, లాక్‌డౌన్‌, వరదముంపు సమయంలో పోలీసులు చూపిన చొరవతో ఎలాంటి అపశ్రుతి లేకుండా జిల్లాలో పరిపాలన సజావుగా కొనసాగిందన్నారు.  పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి విచ్ఛిన్నకరమైన నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులను అరికట్టి అసువులుబాసిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 35వేల మందికి పైగా అమరులయ్యారన్నారు.


ప్రధానంగా జిల్లాలో తీవ్రవాదుల చేతుల్లో అమరులైన 22మంది అమరులను ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా జిల్లాలో కోవిడ్‌ విధి నిర్వహాణలో 404 మంది కరోనా వ్యాధిబారిన పడ్డారనీ, ఎర్‌ఎస్‌ఐ సొందు కరోనా మరణించడం బాధకరమన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, నగర మేయర్‌ పాపాలాల్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమలరాజ్‌, సబ్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీలు ఇంజరపు పూజ,  మురళీధర్‌, మాధవరావు, ఏసీపీలు విజయబాబు, వెంకటరెడ్డి, వెంకటేశ్‌, ప్రసన్నకుమార్‌, వెంకట్రావు, జహంగీర్‌, వెంకటప్రసాద్‌, ఎల్‌సీ నాయక్‌, విజయబాబు, ఏవో అక్తరున్నీసాబేగం, సీఐలు, ఆర్‌ఐలు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 


అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం..అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌) వి. తిరుపతి 

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం జరిగింది. హేమచంద్రాపురం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో అమరవీరుల స్మారక స్థూపానికి అడిషనల్‌ ఎస్పీ ఆపరేషన్స్‌ (ఓఎస్‌డీ) వి. తిరుపతి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ బి. కిష్టయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పోలీస్‌ అమరుల కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్‌, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ రవి, బాలాజీ,  సీఐలు రాజు, సత్యనారాయణ, నాగరాజు, గురుస్వామి, ఆర్‌ఐలు సీహెచ్‌ ఎస్‌వీ. కృష్ణ, సోములు, కామరాజు, దామోదర్‌ ప్రసాద్‌, ఎస్‌ఐలు అంజయ్య, శ్రావణ్‌, అరుణ పాల్గొన్నారు.   చాతకొండ గ్రామ పరిధిలో ఉన్న 6వ బెటాలియన్‌ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. బెటాలియన్‌ కమాండెంట్‌ బీవీ రమణారెడ్డి అమరులకు నివాళులర్పించారు.  

Advertisement
Advertisement