రైతుల మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలి-మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2020-04-10T00:32:08+05:30 IST

కరోనా వ్యాప్తి నేపధ్యంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

రైతుల మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలి-మంత్రి పువ్వాడ

ఖమ్మం: కరోనా వ్యాప్తి నేపధ్యంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. రైతులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నిముందు జాగ్రత్తలు తీసుకుంటున్నదని చకకెప్పారు. రైతులు పండించిన పంటలు తక్కువ రేటుకు వ్యాపారులు, దళారులు కొనకూడదనే భావంతో ప్రభుత్వమే వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నదని అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం వేంసూర్‌ మండలంని పెద్దబీరపల్లి, కల్లూరుగూడెం, మార్లపాడు, వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొక్కజొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్కల కొనుగోలు కోసం ప్రభుత్వం దాదాపు 30 వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. 


ఖమ్మం జిల్లాలో 88వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయ్యిందని, దాదాపు 3లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ఇక 2.34 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు అయ్యిందని, సుమారు 8లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే 40 లక్షల గన్నీ బ్యాగ్‌లు వచ్చాయన్నారు. మిగిలి వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.పౌరసరఫరాల శాఖ, ఐకేపీ, పిఎస్‌ఎస్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. లాక్‌డౌన్‌ వల్ల కష్టాలున్పప్పటికీ తప్పని చర్య అన్నారు. ప్రతికూల పరిస్థితిల్లో ఇదే ఉత్తమమైన మార్గం మనం ఒకసారి పట్టువిడిస్తే పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతాయని ప్రజలు సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామానాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2020-04-10T00:32:08+05:30 IST