గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు- సత్యవతి రాథోడ్‌

ABN , First Publish Date - 2020-08-10T00:04:24+05:30 IST

తెలంగాణలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలుచేస్తున్నారని గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు.

గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు- సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలుచేస్తున్నారని గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం ఉట్టిపడేలా గిరిజన మ్యూజియం కూడా రూపొందినట్టు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్‌ సంక్షేమభవన్‌లోని నెహ్రూ ట్రైబల్‌ మ్యూజియంలో ఏర్పాటుచేసిన ఆదిమజాతులు, ఆదివాసీలు, గిరిజనుల గ్యాలరీని మంత్రి సందర్శించారు. ఆధునాతన సాంకేతిక  పరిజ్ఞానంతో రూపొందించిన గిరిజన సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు విహబ్‌తో ఒప్పందం చేసుకోవడం మంచి పరిణామమని అన్నారు. గిరిజన బిడ్డలు మాతృభాషను వదిలి తెలుగు భాషలో చదువుకోవడం వల్ల జరుగుతున్నఇబ్బందులను తొలగించేందుకు గిరిజన భాషల్లో పుస్తకాలు తేవడం సంతోషకరమని చెప్పారు. 


గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది వారికి స్వయం ఉపాది కల్పించడమే కాకుండా మరి కొంత మందికి వారు ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజన ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లోనూ గిరిజన గురుకుల విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ఉత్తమమైన మార్కులు సాధించారని తెలిపారు. ఆదివాసీలకు మేమున్నామనే విఽధంగా వారికి అన్ని హక్కులు, వసతులు కల్పిస్తూ అందరితో సమానంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కే సీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. 


కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి గిరిజన కుటుంబంలో అభివృద్ది జరగాలని అన్నారు. వారి మాతృభాషలోనే చదువుకోవడానికి పుస్తకాలు తేవడం సంతోషమని చెప్పారు. సుప్రీం కోర్టులో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం తరపున కొట్లాడుతున్నామని చెప్పారు. గిరిజన వాఖలో ఉన్న ఈటీమ్‌తో ఈశాఖను దేశంలోనే రోల్‌మోడల్‌గా చేయగలమన్ననమ్మకం ఉందన్నారు. గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా ఆదిమజాతుల పిల్లలకు నాలుగుసెంటర్‌ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుచేసినట్టు తెఇలపారు. వీటిలో నలుగురు ఐఐటిలలో సీటు సంపాదించడం అభినందనీయమన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు. 

Updated Date - 2020-08-10T00:04:24+05:30 IST