పాతబస్తీలోని ఆలయాలకు నిధుల పంపిణీ:తలసాని

ABN , First Publish Date - 2021-07-26T22:49:45+05:30 IST

ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఓల్డ్ సిటీ, గోషామహల్, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని 572 ఆలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 2.37 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చెక్కులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పాతబస్తీలోని ఆలయాలకు నిధుల పంపిణీ:తలసాని

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఓల్డ్ సిటీ, గోషామహల్, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని 572 ఆలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 2.37 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చెక్కులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు ఈ నెల 27 వ తేదీ మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేస్తారు. ఉదయం 10.30 గంటలకు చత్రినాకలోని ఆర్డీ ఫంక్షన్ హాల్ లో 324 దేవాలయాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు.


ఇందులో ఉమ్మడి దేవాలయాలు 180, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గ పరిధిలోని 47, బహదూర్ పురా నియోజకవర్గ పరిధిలోని 27, యాకత్ పురా నియోజకవర్గ పరిధిలోని 61, చార్మినార్ నియోజకవర్గ పరిధిలోని 09 దేవాలయాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12.00 గంటలకు బేగంబజార్ లోని సుంగ్రిషి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోషా మహల్ నియోజకవర్గ పరిధిలోని 118 దేవాలయాలకు 36.48 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేస్తారు. కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని 130 దేవాలయాలకు 47.98 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు పంపిణీ చేస్తారు.


గత సంవత్సరం కరోనా నేపధ్యంలో బోనాలను నిర్వహించలేదని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ సంవత్సరం బోనాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలను వివిధ ఆలయాలకు అందించేందుకు విడుదల చేసింది. ఈ ఆర్ధిక సహాయాన్ని బోనాల ఉత్సవాలకు ముందే పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రకారం ఆగస్టు 1 వ తేదీన బోనాలు నిర్వహించనున్న ఓల్డ్ సిటీ పరిధిలోని ఆలయాలకు ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ అందజేస్తారు.  


Updated Date - 2021-07-26T22:49:45+05:30 IST