మాంసం ధరలను నియంత్రిస్తాం- మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-03-30T20:21:35+05:30 IST

ప్రజలకు మాంసాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

మాంసం ధరలను నియంత్రిస్తాం- మంత్రి తలసాని

హైదరాబాద్‌: ప్రజలకు మాంసాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తెలంగాణ లాక్‌డౌన్‌ నేపధ్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్‌, చేపల లభ్యత పై సోమవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ లాక్‌డౌన్‌కారణంగా జిల్లాల నుంచి గొర్రెలు, మేకల సరఫరా నిలిపివేత కారణంగా మటన్‌ ధరలు పెరిగాయి. మాంసం విక్రయించే దుకాణాల పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారి పై చర్యలు తీసుకుంటామన్నారు. కూరగాయలు, పాలు, పండ్లు,కోళ్లు, గుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరాకు ప్రభుత్వం అన్నిరకాల అనుమతులు ఇచ్చిందన్నారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు తమ జీవాలను ఆయా జిల్లాల్లో,జంట నగరాలకు తీసుకొచ్చి విక్రయించుకునే విధంగా అనుమతుల కోసం అన్నిజిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. మత్స్య కారులు, చేపలను రవాణా చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లి చేపలు తీసుకొచ్చే వాహనాలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని మంత్రి తెలిపారు.


సైజుకు వచ్చిన చేపలను పట్టుకుని విక్రయించుకునేలా మత్స్య కారులకు అవకాశం కల్పిస్తామన్నారు. రవాణా చేసే వస్తువులను తెలిపేలా వాహనాలకు తప్పని సరిగా సరైన పోస్టర్లు ఏర్పాటు చేయాలనిసూచించారు. గోశాలలకు అవసరమైన గ్రాసం సరఫరా, జీవాలకు వైద్యం అందించడం తదితర అంశాలపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. చికెన్‌ దుకాణాలలోని వ్యర్థాలను ఎప్పటికప్పడు తరలించేలా జీహెచ్‌ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, పోలీసు,రవాణాశాఖ అధికారులతో జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేసి నోడల్‌అధికారిని నియమించనున్నట్టు మంత్రి తలసాని వెల్లడించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌,  ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి,జీహెచ్‌ఎంసి వెటర్నరీ ఆఫీసర్‌ అబ్ధుల్‌ వకీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T20:21:35+05:30 IST