దీపావళికి చాచా నెహ్రూ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్‌ల గృహప్రవేశం

ABN , First Publish Date - 2021-10-02T00:12:59+05:30 IST

దీపావళి కి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చాచా నెహ్రూ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు

దీపావళికి చాచా నెహ్రూ నగర్‌లో  డబుల్ బెడ్ రూమ్‌ల గృహప్రవేశం

హైదరాబాద్: దీపావళి కి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చాచా నెహ్రూ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్ లోని చాచా నెహ్రూ నగర్ లో నిర్మిస్తున్న 19.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్ కుర్మ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో వసంత, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. 264 ఇండ్లకు గాను 232 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 16 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. 


మిగిలిన 16 ఇండ్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో కమ్యునిటీ హాల్, అంగన్ వాడి స్కూల్ నిర్వహణ కోసం ఒక భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని అన్నారు. 


పేద ప్రజలకు ఉచితంగా ఇండ్లను నిర్మించే ఇచ్చే కార్యక్రమం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు అవుతుందని చెప్పారు. సరైన వసతులు లేక, ఇరుకైన ఇండ్లలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. మంత్రి వెంట వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, తహసిల్దార్ బాలశంకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-02T00:12:59+05:30 IST