మిర్చికి కూలీల కొరత

ABN , First Publish Date - 2020-03-24T11:12:22+05:30 IST

మొక్కలను తొలిచే క్రిమి కీటకాలే కాదు.. మనుషులకు వచ్చే వైర్‌సలు కూడా పంటలపై ప్రభావం చూపుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోతకు వచ్చిన మిర్చిని ఏరేందుకు కూలీలు దొరకడం లేదు. కరోనా కారణంగా కర్ఫ్యూ

మిర్చికి కూలీల కొరత

లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితం.. పంటను కోసుకోలేని దైన్యం

అదును దాటితే అన్నదాతకు తీరని నష్టం 


ఖమ్మం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మొక్కలను తొలిచే క్రిమి కీటకాలే కాదు.. మనుషులకు వచ్చే వైర్‌సలు కూడా పంటలపై ప్రభావం చూపుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోతకు వచ్చిన మిర్చిని ఏరేందుకు కూలీలు దొరకడం లేదు. కరోనా కారణంగా కర్ఫ్యూ ప్రకటించడంతో కూలీలు లేక పంట చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న, మొన్నటి వరకు పొరుగు రాష్ట్రాలు, పొరుగు జిల్లాలు, గ్రామాలనుంచి జనాన్ని తీసుకొచ్చి.. పంటలు కోయించిన రైతు లు ఇప్పుడు కరోనా కష్టాలను ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూలీల ను తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడం, స్థానికులు ఇళ్లకే పరిమితమవడం, వాహనాల రాకపోకలను నిలిపేయడంతో కూలీల కొరత ఏర్పడింది.


ఎక్కువ కూలీ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో వేలల్లో పెట్టిన పెట్టుబడులు చేతికందని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35వేల హెక్టార్లకుపైగా మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం క్వింటా రూ.15వేలకు పైగా ఉంది. రైతులు త్వరగా కోసి ఆరబెడితేనే నాణ్యతను బట్టి గిట్టుబాటు ధర వస్తుంది. అలా కాకుండా పొలాల్లోనే ఎండిపోతే నాణ్యత దెబ్బతిని, తూకంలో కూడా తేడా వచ్చి అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్ప టి వరకు రెండు, మూడు కోతలు పూర్తి చేయగా మిగిలిన పంట తోటల్లోనే ఉంది. ఇప్పుడు కూలీలు రాకపోతే ఆ పంట ఎండిపోయి రైతులు నష్టపోతారు. ఈ నేపథ్యంలో కోతలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  


ట్రాక్టర్‌ తీసుకెళ్లినా రావట్లేదు

రెండెకరాల్లో మిర్చి వేసి.. రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టా. మిర్చిని కోసేందుకు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి తీసుకువెళ్తామన్నా ఒక్కరూ రావడం లేదు. అసలే కూలీల కొరత ఏర్పడింది.. మరోవైపు మేఘాలు కమ్ముతున్నాయి. అకాల వర్షం పడితే మిర్చి తాలయ్యే ప్రమాదం ఉంది. 

 వెంకటరమణ, రైతు, వల్లాపురం



వెళ్లాలంటేనే భయమేస్తుంది

రోజూ పనులకు వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. కానీ కరోనా విస్తరిస్తుండటంతో కూలికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఇద్దరు, ముగ్గురి కంటే ఎక్కువ మంది కలిసి ఉండకూడదని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో చేలకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. 

కమర్తపు సరిత, కూలీ, ముదిగొండ

Updated Date - 2020-03-24T11:12:22+05:30 IST