అమ్మ గది

ABN , First Publish Date - 2020-11-02T06:17:17+05:30 IST

ఇల్లు కట్టినపుడు అమ్మకోసం ఒక గది అని మురిపెంగా కట్టుకున్నాను...

అమ్మ గది

ఇల్లు కట్టినపుడు

అమ్మకోసం ఒక గది

అని మురిపెంగా కట్టుకున్నాను.


ఇంతకీ ఎపుడూ అమ్మ

ఆ గదిలో వుండనే లేదు.


నెమ్మదిగా నా పుస్తకాలు

ఆ గదిలో చేరాయి.


ఎవరి వెతుకులాటలు

వాళ్ళవన్నట్టు

అమ్మగదిలో నేనూ చేరాను.


మా యింట్లో

ఎవరి ప్రపంచం వారిది

ఎవరి ఉద్యోగాలో వ్యాపకాలో వారివారివి


ఒక పైకప్పు కింద

విడిపోకుండా కలిసివుండటమే

ఇపుడు కుటుంబ నిర్వచనం


మనం సమిష్టి కుటుంబం గురించి

చదువుకున్నట్టు

భవిష్యత్తరాలు

అనగనగా కుటుంబం గురించి 

తప్పక చదువుకుంటారు.


ఇపుడు మా యింట్లో

మూడు వేర్వేరు మహాప్రపంచాలు

మూడు మూడు మహాసముద్రాలు

దాటినా తగ్గని దూరాలు


ఎవరి ఫోనులు వాళ్ళవి.

ఎవరి కంప్యూటర్లు, ఎవరి గదులు, 

ఎవరి ముఖపుస్తకాలు వారివి

సామాజిక మాధ్యమాలలో

తెల్లారి కడతేరుతున్న కాలం


అమ్మ గదిలో ఇపుడు నేను

మూడు ప్రపంచాల ఏకాంతాన్ని 

మోస్తున్న ఒకేఒక్క బందీని

ఆకెళ్ళ రవిప్రకాష్‌

94905 17777


Updated Date - 2020-11-02T06:17:17+05:30 IST