మొబైల్‌ పోయినాఇలా చేస్తే మనీ సేఫ్‌!

ABN , First Publish Date - 2021-09-04T06:17:26+05:30 IST

స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న వాలెట్ల సహాయంతో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్న రోజులివి. ఒకరకంగా ఇది కొవిడ్‌ సంక్షోభం తరవాత మరింత పెరిగింది.

మొబైల్‌ పోయినాఇలా చేస్తే మనీ సేఫ్‌!

స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న వాలెట్ల సహాయంతో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్న రోజులివి. ఒకరకంగా ఇది కొవిడ్‌ సంక్షోభం తరవాత మరింత పెరిగింది.  అయితే ఇటీవలి పరిశీలనల్లో ఆసక్తికర విషయం ఒకటి వెల్లడైంది. తస్కరించే ఫోన్లను అమ్మేయడం నిన్నటి రివాజు. ఇప్పుడు అందులో ఉన్న బ్యాంకింగ్‌ సమాచారాన్ని తెలుసుకుని సొమ్ము చేసుకోవడం దొంగల కొత్త టెక్నిక్‌.  అయితే కొన్ని జాగ్రత్తలు మనమూ పాటిస్తే వాలెట్ల నుంచి సొమ్ములు పోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


ఫోన్‌ పోయిన వెంటనే మొదట సిమ్‌ను బ్లాక్‌ చేసేయాలి. ఫలితంగా ఆర్థిక సంస్థల నుంచి వాటిని తస్కరించిన వ్యక్తులకు ఓటీపీ మెసేజ్‌లు రావు. అలాగే వ్యక్తిగత మెసేజ్‌లు కూడా రావు. కొత్త సిమ్‌తో మీ మొబైల్‌నూ పని చేయించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మీ పాత నంబరుతో కొత్త సిమ్‌ కార్డు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ సమయం కీలకం. అదే దొంగలకూ ప్రయోజనకరం కూడా. అందుకే సిమ్‌ను బ్లాక్‌ చేయించడంతో పాటు మరికొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 


ఫోన్‌ పోయిన వెంటనే మీకు అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌కు ఫోన్‌ చేసి, ఆన్‌లైన్‌ సర్వీస్‌ను ఆపేయండని అభ్యర్థించాలి. బ్యాంక్‌ అకౌంట్‌ యాక్సెస్‌ పొందిన పక్షంలో దొంగలు తమ మొబైల్స్‌కు ఓటీపీ తెప్పించుకుని పని కానిచ్చేయవచ్చు. యాక్సెస్‌ను కట్‌ చేయడానికి టెలికం ఆపరేటర్‌కు కొంత సమయం పడుతుంది. ఇది కూడా గమనించి తీరాలి. 


ఫోన్‌ తస్కరణకు గురైనప్పుడు అప్పటివరకు ఉన్న నంబర్‌నే మళ్ళీ ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదు. బ్యాంకుకు వ్యక్తిగతంగా వెళ్ళి నంబర్‌ మార్చుకోవాలి. పాస్‌వర్డ్‌ను కూడా రీసెట్‌ చేసుకోవాలి. ఆ తరవాతే మళ్ళీ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకోవాలి. 


మీ ఆధార్‌ అథెంటికేషన్‌ను దొంగలు పొందగలిగితే మరింత పెద్ద నేరాలకు వారు పాల్పడే అవకాశం ఉంది. అందుకని వెంటనే దగ్గర్లోని ఆధార్‌ సెంటర్‌ వద్దకు వెళ్ళి పోయిన ఫోన్‌లో ఉన్న నంబర్‌ను అక్కడ మార్పించాలి. 


ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసులను నిలిపివేసుకున్న వెంటనే, యూపీఐ అలాగే దాంతో లింక్‌ అయి ఉన్న ఇతర వాలెట్లను వెంటనే డీయాక్టివేట్‌ చేసేయాలి. 


పేటీఎం, గూగుల్‌ పే తదితర వాలెట్‌ సర్వీసులన్నింటినీ రద్దు చేసుకోవాలి. యాప్‌ లేదంటే హెల్ప్‌ డెస్క్‌ సహకారంతో చేసే వేటినైనా వెంటనే బ్లాక్‌ చేసుకోవాలి. 


తస్కరణకు గురైన ఫోన్‌లో ఉపయోగిస్తున్న నంబర్‌ను లింక్‌ చేసి ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియా అకౌంట్లను కూడా డీయాక్టివేట్‌ చేసుకోవాలి. దీంతో ముఖ్యంగా మీ సన్నిహితులు, మిత్రులు దొంగలకు టార్గెట్‌ కాకుండా కాపాడవచ్చు. 


ఫోన్‌ పోయిందని గమనించిన వెంటనే దగ్గర్లోని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయడం మర్చిపోవద్దు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా తీసుకుంటే దాని సహాయంతో బ్యాంకుల దగ్గర పనిని సులువుగా చేసుకోవచ్చు. ఎవరైనా మీ సొమ్ము దొంగలించినా అందుకు సాక్ష్యంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఉపయోగించుకోవచ్చు. 

Updated Date - 2021-09-04T06:17:26+05:30 IST