వానకురిసింది.. నేల మురిసింది..

ABN , First Publish Date - 2020-07-08T10:50:45+05:30 IST

వరణుడు కరుణించాడు.. ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి.

వానకురిసింది.. నేల మురిసింది..

 ఈ ఏడాది భారీ వర్షపాతం నమోదు

వికారాబాద్‌ జిల్లాలో 73శాతం అధిక వర్షపాతం

రంగారెడ్డిలో 68శాతం ఎక్కువ

మేడ్చల్‌లో 46శాతం అధికం

మూడు మీటర్లకుపైగా పెరిగిన భూగర్భజలాలు

ఇప్పటికే 60శాతం పంటలు సాగు 

అత్యధికంగా పత్తి 78 శాతం సాగు


వరణుడు కరుణించాడు.. ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో ఉమ్మడి జిల్లాలో  వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. రాష్ట్రసగటు కంటే అధికంగా మూడు జిల్లాలో వర్షాలు పడ్డాయి. ఇప్పటికే చెరువుల్లో వరదనీరు చేరింది.  వాగులు, వంకలు  పొంగిపొర్లాయి. ఈ ఏడాది భూగర్భ జలాలు కూడా భారీగా పెరిగాయి.   వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో  సాగు విస్తీర్ణం పెరగనుంది.  ఇప్పటికే  కొన్ని చోట్ల పల్లెటూళ్లలో పచ్చటి పొలాలు భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తున్నాయి.  కొద్ది రోజులుగా 

కురుస్తున్న చిరుజల్లులతో పంటలకు జీవం వచ్చింది. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): వరణుడు కరుణించడంతో ఉమ్మడి జిల్లాలో జోరుగా వ్యవసాయ పనులు  సాగుతున్నాయి. మూడు జిల్లాల్లో ఈఏడాది వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈ ఏడాది సగటు కంటే 46 శాతం అధికంగా వర్షాలు కురవగా మూడు జిల్లాల్లో అంత కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే వికారాబాద్‌జిల్లాలో సగటు కంటే 73శాతం అధికంగా వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 68శాతం అధిక వర్షపాతం నమోదైంది. మేడ్చల్‌జిల్లాలో 46శాతం అధిక వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని మండలాల్లోనూ వాన దేవుడు కరుణించాడు. దీంతో  ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ఇప్పటికే చెరువుల్లో వరదనీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు కూడా భారీగా పెరిగాయి. జిల్లాలో సగటు మూడు మీటర్ల భూగర్భ జలాలు పెరగడంతో బావుల్లో నీరు పుష్కలంగా లభ్యమవుతోంది.


ఇదిలా ఉంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడంతో వ్యవసాయసాగు క్రమంగా పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో పంటలు సాగు విస్తీర్ణం పెరగనుంది. ఈ ఏడాది పెద్దగా కూలీల కొరత కూడా ఉండకపోవచ్చంటున్నారు అధికారులు. కరోనా కారణంగా పట్టణ ప్రాంతాల్లో కూలీలంతా తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది వ్యవసాయ  పనులకు వెళుతున్నారు. దీనికి తోడు వ్యవసాయానికి అనువైన పరిస్థితులు ఉండడంతో పంటలు సాగు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. రైతుబంధు కింద దాదాపు 95శాతం మంది రైతులకు ఫ్రభుత్వం నుంచి సాయం అందింది. దీంతో పంటలు వేసుకునేందుకు అవసరమైన డబ్బు రైతుల చేతికి అందింది. ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలో రైతులు  60శాతం పంటలు వేశారు.  జిల్లాలో ఈ ఏడాది ఖరీ్‌ఫలో సగటు 3.99 లక్షల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.4 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో పత్తి అత్యధికంగా 78 శాతం వేశారు. జిల్లాలో సగటు పత్తి 2.48 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు  1.92 లక్షల్లో సాగు చేశారు. 


బంట్వారంలో అధికవర్షపాతం

ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో బంట్వారం మండలంలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 138.4 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అంతకు మించి అంటే 238.6 మి.మీ వర్షం కురిసింది. సగటు కంటే 72శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే 116శాతం  జిల్లాలో అధికంగా ఈఏడాది వర్షాలు కురిశాయి. బంట్వారం మండలంలో సగటుకంటే దాదాపు రెండు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. ఈ మండలంలో సగటు ఇప్పటి వరకు 127.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 378.9 మి.మీ వర్షం కురిసింది. అలాగే పెద్దేముల్‌, ధారూర్‌, మర్పల్లి, మోమిన్‌పేట, దోమమండలాల్లో సగటు కంటే వందశాతం అధికంగా వర్షాలు కురిశాయి. అయితే  పరిగి మండలంలో మాత్రం సగటు వర్షపాతం నమోదైంది. 


రంగారెడ్డిజిల్లాలో..

రంగారెడ్డిజిల్లాలో కూడా ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. సగటుతో పోలిస్తే ఈఏడాది ఇప్పటి వరకు 68శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. గతేడాదితో పోలిస్తే 83శాతం అధికంగా వర్షాలు కురవడం గమనార్హం.  జిల్లాలో ఇప్పటి వరకు 114.9 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 192.5 మి.మీ వర్షం కురిసింది.  శంకర్‌పల్లి, చేవెళ్ల మినహా అన్ని మండలాల్లో అధికవర్షపాతం నమోదైంది. ఆమనగల్లులో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ మండలంలో సగటు కంటే 135 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. అలాగే నందిగామ, తలకొండపల్లి, ఆమన గల్లు, యాచారం, హయత్‌నగర్‌, అబ్ధుల్లాపూర్‌ మెట్‌, రాజేంద్రనగర్‌, బాలాపూర్‌ మండలాల్లో సగటు కంటే వందశాతానికిపైగా వర్షాలు కురిశాయి. 


మేడ్చల్‌ జిల్లాలో.. 

మేడ్చల్‌ జిల్లాలో ఈ ఏడాది 46శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 116శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో  ఇప్పటి వరకు 128.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 187.7 మి.మీ వర్షం కురిసింది. బాచుపల్లి మండలంలో 84శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడసగటు  144.6 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా266.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే కూకట్‌పల్లి, బాలానగర్‌, ఆల్వాల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కాప్రా, కీసర, ఘట్‌కేసర్‌, మూడుచింతలపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అయితే మేడిపల్లి, కుత్భుల్లాపూర్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2020-07-08T10:50:45+05:30 IST