Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇక మరింత వేగం!

  • వ్యాక్సినేషన్‌ స్పీడ్‌ పెంచేలా కార్యాచరణ
  • మొదటి డోస్‌ వ్యాక్సినే షన్‌ 82శాతం పూర్తి
  • 2వ విడతలో 18శాతంతో వెనకబాటు
  • వ్యాక్సినేషన్‌లో వేగం పెంచేలా మంత్రి సబితారెడ్డి దిశానిర్దేశం
  • ఆ మేరకు చర్యలు తీసుకుంటున్న వికారాబాద్‌ జిల్లా యంత్రాంగం


కరోనా తగ్గుతుందనుకుంటున్న తరుణంలో ఒమైక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఇలాంటి వైరస్‌ రానప్పటికీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యాక్సినేషన్‌ స్పీడ్‌ పెంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వ్యాక్సినేషన్‌ విషయంలో జిల్లాలో మొదటి డోసు ఎక్కువ మందికి వేసినప్పటికీ.. రెండో విడతలో మాత్రం బాగా వెనుకబడింది. దీంతో అధికార యంత్రాంగం అందరికీ టీకా వేసేందుకు సన్నద్ధమైంది.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగవంతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెలాఖరులోగా జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రెండేళ్లుగా కొవిడ్‌ కేసులతో సతమతమైన జిల్లాలో నాలుగు నెలలుగా అక్కడక్కడా ఒకటి, రెండు కేసులు మినహా పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ముంచుకు వస్తున్న ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు అర్హులైన అందరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు నెలాఖరులోగా అందరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమం, విద్య, పోలీసు, రెవెన్యూ, మునిసిపల్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు గ్రామ వార్డు సభ్యుడి నుంచి జిల్లాస్థాయి ప్రజా ప్రతినిధుల వరకు అందరినీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. 


రెండవ డోస్‌లో తడబాటు

జిల్లాలో మొదటి విడత వ్యాక్సినేషన్‌ 82శాతం పూర్తి చేసి ముందంజలో ఉండగా, 18 శాతం వ్యాక్సినేషన్‌తో రెండవ విడతలో వెనకబడింది. రాష్ట్రంలో జరిగిన వ్యాక్సినేషన్‌ శాతం కంటే జిల్లాలో తక్కువ శాతం నమోదైంది. దీంతో మొదటి డోస్‌ తీసుకోకుండా మిగిలిన వారికి టీకా ఇవ్వడంతో పాటు రెండవ విడత వ్యాక్సినేషన్‌ వేగం పెంచేలా జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి రెండవ విడత వ్యాక్సినేషన్‌లో వేగం పెరగనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఏఎన్‌ఎం, ఆశ, వీఆర్‌ఏ, గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌, వార్డు సభ్యులతో ఏర్పాటైన బృందాలు ఇంటింటికీ వెళ్లి టీకా తీసుకోని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్‌ వేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. వ్యాక్సినేషన్‌లో జిల్లాలో రామయ్యగూడ పీహెచ్‌సీ ముందంజలో ఉంది. ఈ పీహెచ్‌సీ పరిధిలో మొదటి డోస్‌లో 94శాతం ప్రగతి సాధించింది. ఇక 46శాతం వ్యాక్సినేషన్‌తో అత్యల్పంగా జరిగిన పీహెచ్‌సీగా సిద్దులూరు నిలిచింది. ఇక రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌లో రామయ్యగూడ పీహెచ్‌సీ 41శాతం లక్ష్యం సాధించి జిల్లాలో మొదటి స్థానంలో ఉండగా, అత్యల్పంగా 7 శాతం వ్యాక్సినేషన్‌ జరిగిన యాలాల్‌, పెద్దే ముల్‌ పీహెచ్‌సీలు అట్టడుగున నిలిచాయి. అదేవిధంగా జిల్లాలో 72 హ్యాబిటేషన్లు, కాలనీల్లో 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు వైద్యాధికారులు గుర్తించారు. వీటిలో 61 హ్యాబిటేషన్లు, 11 కాలనీలు, మురికివాడలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో డబ్ల్యూహెచ్‌వో, ఆరోగ్య శాఖ రాష్ట్ర బృందాలు తనిఖీలు నిర్వహించి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


మాస్క్‌ ధరించకపోతే రూ.1,000 జరిమానా

కరోనా కొత్త వేరియంట్‌ ముప్పు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని, ధరించని వారికి రూ.1,000 జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక, వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా అన్ని రకాల పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో గురువారం నుంచి వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రాలను అధికారులు తనిఖీ చేయనున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారు బయట తిరగకుండా కట్టడి చేయనున్నారు.


గడువులోగా వ్యాక్సినేషన్‌ లక్ష్యం చేరుకుంటాం

డిసెంబరు నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సినేషన్‌ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. క్షేత్రస్థాయి బృందాలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న వారిని గుర్తించి వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. అదే విధంగా ఇంత వరకు 1,29,163 మంది రెండో డోస్‌ తీసుకున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు మొదటి, రెండో డోస్‌ల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా కృషి చేస్తున్నాం. 

- డాక్టర్‌ తుకారాం భట్‌, డీఎంఅండ్‌హెచ్‌వో, వికారాబాద్‌ 


18 ఏళ్లు నిండిన వారు  7,09,728

మొదటి డోస్‌ తీసుకున్నవారు  5,84,565

మొదటి డోస్‌ తీసుకోవాల్సిన వారు 1,25,163

మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ 82 శాతం

రెండవ డోస్‌ వేసుకున్నవారు 1,29,507

రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ 18 శాతం

వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సింది  5,50,221

Advertisement
Advertisement