Advertisement
Advertisement
Abn logo
Advertisement

మదర్‌ డెయిరీని టీఆర్‌ఎస్‌ డెయిరీగా మార్చారు

హయత్‌నగర్‌లోని మదర్‌ డెయిరీ వద్ద ధర్నా చేస్తున్న పాల ఉత్పత్తిదారుల సంఘాల చైర్మన్లు, రైతులు

  • ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి, పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌ బీర్ల ఐలయ్య
  • రైతులతో కలిసి మదర్‌ డెయిరీ వద్ద ధర్నా

హయత్‌నగర్‌: రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మదర్‌ డెయిరీని పాలకులు టీఆర్‌ఎస్‌ డెయిరీగా మార్చారని ఆలేరు నియోజకవర్గం కాం గ్రెస్‌ ఇన్‌చార్జి, పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌ బీర్ల ఐలయ్య ఆరోపించారు. గురువారం భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన 80మంది పాల సంఘాల చైర్మన్‌లు, పాడి రైతులతో కలిసి 12 హయత్‌నగర్‌ మదర్‌ డెయిరీ వద్ద ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రాన్ని డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డికి అందజేశారు. మదర్‌ డెయిరీలో జరుగుతున్న అక్రమాలను, పరోక్షంగా డైరక్టర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. జనవరి 20నుంచి లీటరు పాలపై రూ.5 చొప్పున పెంచాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. డెయిరీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన మాజీ డైరక్టర్‌ ఒగ్గు భిక్షపతిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపసంహరించుకోవాలన్నారు. ఐలయ్య మాట్లాడుతూ లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి 37నెలలు అవుతున్నా ఇవ్వడం లేదన్నారు. రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన పాడి పశువులకు బీమా ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. పాలకవర్గం సభ్యులు కొందరు డెయిరీకి 100లీటర్ల పాలు పోస్తున్నట్లు దొంగ లెక్కలు రాసుకుంటున్న విషయాన్ని ఆధారాలతో బయట పెట్టినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన భిక్షపతిపై కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలెక్కలతో ఒక్కో పాలకవర్గం సభ్యుడు నెలకు రూ.2లక్షలు దండుకుంటున్నాడని ఆరోపించారు. పరిగి, మల్లెపల్లిలోని వ్యాపార సముదాయానికి రూ.16లక్షల అద్దె రావాల్సి ఉండగా రూ.8లక్షలే వస్తున్నట్లు లెక్కలు చూపించడం ఏమిటని ప్రశ్నించారు. రాజాపేట, భువనగిరి చిల్లింగ్‌ స్టేషన్లలో జరిగిన కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రైవేటు మార్కెటింగ్‌ చేస్తున్న వారిని తొలగించాలని, 159వ బోర్డు సమావేశంలో పెట్టిన ప్రమోషన్లను వెంటనే నిలిపి వేయాలని అన్నారు. మదర్‌ డెయిరీ ఆధ్వర్యంలో గతంలో ఉన్న పార్లర్లను ప్రైవేటు వ్యక్తులు కాకుండా సంస్థనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాల ఉత్పత్తిదారుల సంఘాల చైర్మన్లు ధర్నా సమాచారంతో మదర్‌ డెయిరీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, ఎండీ అశోక్‌, ఏజీఎం కృష్ణ అక్కడకి చేరుకుని పాల సంఘాల చైర్మన్‌ల నుంచి మెమోరాండాన్ని తీసుకున్నారు. అన్ని విషయాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చైర్మన్‌ హమీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాలసంఘాల చైర్మన్లు వెంకటనర్సింహ్మరెడ్డి, పడమటి పావని, కృష్ణ, సొమయ్య, ఇంద్రసేనారెడ్డి, పాడి రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement