సెల్‌ఫోన్‌ రేపిన చిచ్చు

ABN , First Publish Date - 2021-10-22T08:27:47+05:30 IST

సెల్‌ఫోన్‌ రేపిన చిచ్చు తల్లి, కూతురు చావుకు కారణమైంది. గురువారం కడపలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

సెల్‌ఫోన్‌ రేపిన చిచ్చు

  • చిన్న వివాదానికి తల్లి, కుమార్తె బలి 
  • కూతుర్ని చున్నీతో బిగించి చంపేసిన తల్లి
  • చెల్లిని చంపిందని తల్లిని పొడిచిన కొడుకు


కడప(క్రైం), అక్టోబరు 21: సెల్‌ఫోన్‌ రేపిన చిచ్చు తల్లి, కూతురు చావుకు కారణమైంది. గురువారం కడపలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కడపలోని రవీంద్రనగర్‌కు చెందిన షేక్‌ కుషీద(45), మహమ్మద్‌ హుసేన్‌ దంపతులకు కుమార్తె షేక్‌ ఆలియా (14), కుమారుడు (17) ఉన్నారు. కుషీద బతుకుదెరువుకోసం కొంతకాలం కువైట్‌ వెళ్లి వచ్చింది. కుమార్తె 9వ తరగతి, కొడుకు డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కుషీద 4నెలల నుంచి పిల్లలతో కలసి నఖాష్‌లో నివాసం ఉంటోంది. గురువారం వారి ఇంటిలోనే షేక్‌ ఆలియా, కుషీద హత్యకు గురయ్యారు. ఆలియా మెడకు చున్నీ బిగించి, కుషీద గొంతులో కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


తన సోదరి సెల్‌ఫోన్‌ ఎక్కువసేపు చూసిందంటూ తల్లి మందలించడంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగిందని, సోదరిని చున్నీతో గొంతుకు బిగించడంతో మృతిచెందిందని, తాను ఆగ్రహానికి గురై కత్తితో గొంతులో పొడవడంతో తల్లి కూడా మృతిచెందిందని బాలుడు తెలిపాడు. అయితే.. సోదరిని భయపెట్టేందుకు సరదాగా మెడకు చున్నీ బిగించడంతో చనిపోయిందని, అడ్డుకున్న తల్లిని కూడా కొడుకే చంపేశాడనే మరో వాదన వినిపిస్తోంది. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కడప అర్బన్‌ సీఐ మహమ్మద్‌ అలీ తెలిపారు. 

Updated Date - 2021-10-22T08:27:47+05:30 IST