Abn logo
Nov 25 2021 @ 16:58PM

మోటొరోలా తీసుకొస్తున్న ఈ ఫోన్ గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌లోని ఫీచర్ల కంటే కెమెరాపైనే ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారు. మెగాపిక్సల్ ఎక్కువగా ఉన్న ఫోన్లను కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్ మేకర్లు కూడా కెమెరాపైనే దృష్టిసారించి మెగాపిక్సల్స్‌ను పెంచుకుంటూ పోతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం 108 మెగాపిక్సల్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ మెగాపిక్సల్‌ను ఏకంగా 200కు పెంచేస్తూ మోటొరోలా త్వరలోనే ఓ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.


ఈ ఏడాది సెప్టెంబరులో శాంసంగ్ 200 ఎంపీ ఐఎస్ఏ‌సీఈఎల్ఎల్ కెమెరా సెన్సార్‌ను పరిచయం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా దానిని ఉపయోగించలేదు. అయితే, ఇప్పుడు ఈ కెమెరా సెన్సార్‌తో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్న తొలి కంపెనీగా మోటొరోలా నిలవనున్నట్టు తెలుస్తోంది. 200 మెగాపిక్సల్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొబైల్ మేకర్ షియోమీ, 2023లో శాంసంగ్ నుంచి 200 మెగాపిక్సల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. 


 మోటొరోలా నుంచి త్వరలోనే రాబోతున్న ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సల్ కెమెరాను ఉపయోగించారని, కాబట్టి 200ఎంపీ కెమెరా కోసం వచ్చే ఏడాది వరకు ఆగక తప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, మోటొరోలా ఇప్పటికే విక్రయిస్తున్న ‘ఎడ్జ్ 20 సిరీస్’‌లో 108 మెగాపిక్సల్ సెన్సార్ ఉపయోగించారు. అలాగే, మిడ్ రేంజ్ ఫోన్ అయిన మోటో జి60లోనూ 108 ఎంపీ కెమెరా ఉంది. మోటొరోలా త్వరలోనే మోటో జి71, మోటో జి31‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండిImage Caption