Abn logo
Aug 2 2021 @ 04:34AM

కవిత్వంలో ఎత్తుగడలు

‘‘అట్లా అని పెద్ద బాధా ఉండదు

వెల్ల వేసిన గోడలేమో తెల్లబోతూ ఉంటాయి

మహా అయితే ఏ బల్లో పాకుతుంటుంది గోడమీద’’

(వేగుంట మోహనప్రసాద్‌, ‘చితి - చింత’) 


‘మో’ని అస్పష్టకవిగానే ఆమోదించటాన చాన్నాళ్లకిగాని పై వాక్యాలు ఆధునిక కవిత్వంలో గొప్ప ఎత్తుగడల్లో ఒకటిగా గుర్తించలేకపోయాను. ఇక్కడ కవి లోలోపలి ఆలోచనల ప్రారంభం, కవిత ప్రారంభం ఒకటి కావు. కవి ఆలోచన ఎక్కడో ముందే మొదలైంది. ‘‘ఇది దిగులు చిత్త ప్రవృత్తి సీన్‌’’ అంటూ ఒంటరి గది గోడలో, నీడలో, గోడ మీద బల్లిలో, గోడకు తగిలించిన గళ్ల టెరిలిన్‌ చొక్కాలో, బలాదూరు గాలిలో అధివాస్తవిక విచారాన్ని ఆరోపిస్తాడు కవి. తనలోని ‘నిరీహ’ని, నిర్వేదాన్ని తలపోసుకుంటూ ఆ తలపోతల కొనసాగింపుగా ఉన్నట్టుండి కవితలోకి అడుగుపెట్టాడు. ఈ అసంబద్ధతే (oddity) దాన్ని విలక్షణమైన ప్రారం భంగా నిలబెట్టింది. 


కవితే కాదు, దాని ఎత్తుగడ కూడా ముఖ్యమే. కావ్య ప్రారంభానికి ముందు కృత్యాద్యవస్థ ఉంటుందంటారు. ఏ కథావస్తువు గ్రహించాలి, కథానాయకుడెవరు, ఏ విశేషంతో ప్రారంభించాలి- ఇటువంటివన్నీ కలిపితే కృత్యాద్యవస్థ అవుతుంది. ఆ అల్లకల్లోలం సమసిపోయినాక వెనకటి కవి ‘‘అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన యిమ్మహాప్రబంధంబునకు కథాక్రమం బెట్టిదనిన’’ అని ఎత్తుకొంటాడు. అలాగే వచన కవిత ప్రారంభంలోనైనా కవి కొక అవస్థ ఉంటుంది. (అంత అవస్థ పడకుండా తోచింది తోచినట్టు రాసుకెళ్లిపోయేవాళ్లూ ఉంటారు.) చెప్పదలచిన విషయాన్ని ఎట్లా మొదలుబెట్టాలి? ఒక సానుకూల ప్రతి పాదనతోనా? వ్యతిరేక ప్రతిపాదనతోనా? సూటిగానా? వ్యంగ్యం గానా? సరళంగానా? ఆలంకారికంగానా? ఇటువంటి ఆలో చనలన్నీ కందిరీగల్లా ముసురుకుంటుంటే ఏదో ఒక దారి చూసుకోవాలి. అది తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించటం లాంటిది. ఈతగాడు చెరువునీళ్లలోకి తొలి అడుగు దిగటం లాంటిది. విమానానికి take off లాంటిది.  


ఒక కవితా ప్రారంభం, ఆ కవితను పాఠకుడుగా నేనెందుకు కొనసాగించాలో సూచించేటట్టు ఉంటే బాగుం టుంది. తొలి వాక్యం కవితకి పునాది. మొదటి వాక్యం చదవటంతో పాఠకుడిలో ఒక ఉన్ముఖత, ఆ తర్వాత ఏం చెపుతున్నాడనే ఉత్సుకత ఏర్పడాలి. తదుపరి వివరణ చదవాల్సిన అక్కర కలగాలి. కనుక ఆ ప్రారంభవాక్యం ప్రత్యేకంగా ఉండాలి. ప్రభావశీలంగా ఉండాలి. మెల్లగా చదువరిని తనలోకి లాక్కుపోవాలి. అయితే అది ఆశ్చర్య కరంగా, పిడుగుపాటులా ఉండాలని లేదు. సాధారణం అనిపిస్తూనే అసాధారణంగా ఉండ వచ్చు. లేదా beginning with a bang కావచ్చు. ఇక్కడ కొన్ని ప్రముఖ/ ప్రత్యేక కవితా ప్రారంభాలను పరిశీలిద్దాం. కాస్త పక్కకి జరిగి పద్య కవిత్వం లోకి పోతే కరుణశ్రీ కవితాఖండిక ప్రారంభం ఒకటి:


అది రమణీయ పుష్పవన మా వనమందొక మేడ - మేడపై

నది యొక మాఱుమూల గది - ఆ గది తల్పులు తీసి మెల్లగా

పదునయిదేండ్ల యీడు గల బాలిక - పోలిక రాచపిల్ల - జం

కొదవెడి కాళ్లతోడ దిగుచున్నది క్రిందకు మెట్ల మీదుగన్‌!


కమనీయమైన క్రమానుగత దృశ్యీకరణ ఇది. పద్యం చదవ గానే మనకొక కుతూహలం కలుగుతుంది. ఎవరా రాచ పిల్ల? ఏమా కథ? జంకుతున్న కాళ్లతో ఎక్కడికి వెళ్లటానికి మెట్లు దిగుతున్నది? ఇలా మొదటిలోనే పాఠకుడిలో ఆసక్తి రేకెత్తించటం విశేషం. అయితే కవితాఖండిక శీర్షిక ‘కుంతీ కుమారి’. అది చదివినాకే కవితలోకి వెళతాం. ఆమె కుంతి అని ముందే చెప్పెయ్యటం వల్ల ప్రారంభపద్యంలో కవి ఆశించిన ఉత్సుకత ఏమంత కలగదు. (ఆ మహాకవి గనక మళ్లీ గుంటూర్లో కనపడితే ఆ పద్యఖండిక పేరు ‘కుమారి’ అంటే బాగుండేది గదా అని సూచిస్తా!) ఇదే కవి రాధాకృష్ణుల ప్రణయకవితకు ‘పారవశ్యము’ అని సూచనాత్మకంగా మంచి శీర్షిక పెట్టాడు. 


మామూలుగా వస్తువుతో సూటి సంబంధంతో కవిత మొదలు కావచ్చు. శీర్షికే తిరిగి కవితా ప్రారంభంగా ఉండ వచ్చు. శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’ అవే మాటల్తో, సంబో ధనతో మొదలవుతుంది. ప్రారంభవాక్యంలోనే కవి దేన్ని ఉద్దేశిస్తున్నాడనేది తెలిసిపోతుంది. ఎలాంటి మరుగూ ఉండదు. ఇది సూటి ప్రారంభం. మన కవిత్వంలో చాల వరకు ఎత్తుగడలు సూటి ప్రారంభాలుగానే కనపడుతున్నాయి. ఇటువంటి దాపరికం లేని తిన్న నైన ఎత్తుగడలతో కవిత మొదలు పెట్టేటప్పుడు దాన్ని ప్రభావవంతంగా నిర్వహించటంలో చాలా పటుత్వం కావాలి. ‘‘యువకాశల నవపేశల సుమగీతావరణంలో’’ సాగిన శ్రీశ్రీ కవితలో ఆ పటుత్వం, అందులోని భావావేశం వల్ల, అంతర్గత గాఢత వల్ల సమకూరింది.


శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’ అనగానే ‘‘O captain, my captain!/ Our fearful trip is done’’ అనే Walt Whitman కవితా ప్రారంభం స్ఫురిస్తే స్ఫురించవచ్చు. (రెండింటికీ సంబోధన సారూప్యం తప్ప సంబంధమేమీ లేదు.) అబ్రహాం లింకన్‌ మరణసందర్భంలో (1865) రాసిన ఆ ప్రభావవంతమైన కవిత సూటిగా ఆ మహానాయకుడిని సంబోధిస్తూ ప్రారంభమైంది. కెప్టెన్‌ అనే మాట దేశాన్ని నడిపిన లింకన్‌ని నిరూపిస్తుంది. ఆ రూపకం Exult O shores, and ring O bells! అంటూ కవిత కడదాకా కొనసాగుతుంది. Extended metaphor poem అది.


‘‘విశాల వినీల వ్యోమపు విస్తృతిలో/ ఒంటరి డేగనై/ మందలో తప్పిపోయిన లేగనై/ వెదకుతున్నాను, వెదకుతున్నాను, అర్థం కొరకు/ అమ్మవంటి అర్థం కొరకు’’ (ఆలూరి బైరాగి, ఒంటరి డేగ)- ఇట్లాంటి దీర్ఘవాక్యం కూడా ఒక్కొకసారి ఎత్తుగడగా ఉండవచ్చు. అయితే అంత దీర్ఘత్వాన్ని కవిత అపేక్షిస్తుందా, లేదా అనేది ఆలోచించుకోవాలి. దానికి తగినంత విస్తృతి కవితలో ఉన్నప్పుడు అట్లాంటి ప్రారంభం పొందికగానే ఉంటుంది. ‘‘బాధల నెత్తుటి జీరల పచ్చ సొనతో / పగిలే గుడ్డులాగు భూమి’’ కన్పించేటప్పుడు సమస్త విశ్వం ఉనికికి అర్థం ఏమిటనే ప్రశ్న, అన్వేషణ బైరాగిలో ఉత్పన్నమయ్యాయి. దానికి తగ్గట్టుగా కవిత విస్తరిస్తుంది గనుక ఆ దీర్ఘ ప్రారంభం నప్పింది. 


‘‘నువ్వు లేవు నీ పాట వుంది ఇంటిముందు జూకా మల్లె తీగల్లో అల్లుకుని లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని నా గుండెల్లో చుట్టుకుని గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని నీరవంగా నిజంగా వుంది’’ (దేవరకొండ బాలగంగాధరతిలక్‌, నువ్వు లేవు నీ పాట వుంది) - దూరమైన ఒకానొక అనామక స్నేహితురాలిని గుర్తు చేసుకుంటున్న ఈ కవిత ప్రారంభం సౌందర్యభరితం. తొలి వాక్యంలో ఒక వ్యతిరిక్తత ఉంది. ఒకటి లేకపోవటం; మరొకటి ఉండటం. ఏది చిరకాలంగా జ్ఞాపకాల్లో పదిలంగా మిగిలిందో, ఏది ప్రకృతి అంతటా వ్యాపించినట్టు తోస్తుందో ఆ పాట అవిచ్ఛిన్నతని సుదీర్ఘవాక్యంలో అద్భుతంగా ఆవిష్కరించాడు కవి. కవిత చివర లోనూ అవే వాక్యాలు పునరుక్తం చెయ్యటంతో ఆ ఎడతెగనితనం అర్థమవుతుంది. అందుకే ఈ కవితలో పాద విభజన, కామాలు, ఫుల్‌స్టాప్‌లు ఉండవు. ఆ పాట ఇంకా తన గుండెల్లో చుట్టుకుని ఉందంటే ఆ పాటగత్తె కూడా గుండెల్లో ఉన్నట్టే.


‘‘ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను/ ఖదం తొక్కి పదం పాడి/ ఇదే మాట అనేస్తాను’’ (దాశరథి, ‘పదే పదే అనేస్తా’) అని గేయం ఎత్తుకొన్న కవి ఎంతకీ ఆ మాట అనెయ్యడే! కవిత చివరికి, నిజాం నవాబును ‘‘దిగిపోవోయ్‌, తెగిపోవోయ్‌/ తెగిపోవోయ్‌, దిగిపోవోయ్‌’’ అని ముక్తాయిస్తాడు. ఈ లోపల ఎవరిని దిగిపొమ్మ న్నాడో అతని దుర్మార్గాలన్నీ చెపుతూ, దిగిపొమ్మనటానికి తగినంత భూమిక కల్పిస్తాడు. ఉత్సుకత రేపే పునశ్చరణ గల ఈ ప్రారంభం ఆ కవితానిర్మాణ శిల్పంలో ఒక భాగం. ఇదే కవి ‘‘ఎవరి పాద చిహ్నములివి/ ఎవరి పాదచిహ్నములు’’ అని గొప్ప ఊహాశాలితతో ఒక కవిత మొదలుపెడతాడు. మధ్య మధ్య ‘‘దానవులను కరగించిన/ మానవుడతడెవ్వడు’’, ‘‘హిమా లయము కన్న నెత్తు/ ఎవడాతం డెవ్వడు’’, ‘‘కత్తికి కన్నీరు గూర్చు/ కరుణాకరు డెవ్వడు’’ అని అడుగుతూ సాగుతాడు. కాని ఎక్కడా అతని ఊరూ పేరూ చెప్పడు. స్ఫురింపజేస్తాడు, అవి మహాత్మ గాంధీ కాలి గుర్తులని. ‘‘Art lies in concealing art’’ అనే సూక్తికి నిదర్శ నంగా నిలిచే మేలైన కవిత.


‘‘అడుగు అడుగులో సహారా ఎడారి/ ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద / ఒక్కొక్క హిమాలయం’’ (చెరబండ రాజు, ‘ఫో’) అన్నప్పుడు ప్రారంభంలోనే ఒక గాఢమైన భావచిత్రణ గమనిస్తాం. అలాగే ‘‘జీవితం మిథ్య అనడం అబద్ధం’’ (నగ్నముని, ‘కొయ్యగుర్రం’) అని తాత్త్వికంగా మొదలైనప్పుడు ఒక విషాద వాస్తవిక భూమికలోకి అడుగు పెడుతున్నామని గ్రహిస్తాం.


‘‘అలలపైన నిఘా/ అలలు కనే కలలపైన నిఘా/ అలలపై అనురాగం చూపించే చిరుగాలి సితారా సంగీతంపై నిఘా’ (శివసాగర్‌) అన్నప్పుడు ‘అలలు’ అనే సంకేతం అర్థమైతేనే కవిత అర్థమవుతుంది. ‘ఉరికంబం మీద అలలు/ కటకటాల వెనుక అలలు/ కన్నీళ్లలో అలలు అలలు/ కార డవిలో అలలు అలలు/ కడలి జనం అలలు దళం’’ అన్న చోట ఆ సంకేతం తేటతెల్లమవుతుంది. అలలకు తగిన ప్రవాహశీలత గల సంకేతాత్మక ప్రారంభం ఇది.


ఒక్కొకసారి ప్రారంభంలో రెండు సరి తూగు వాక్యాలుం టాయి. ఆ రెండు విభాగాల తూకం సమానంగా కనిపి స్తుంది. అయితే రెండో దానికే మొగ్గు చూపిస్తాడు కవి. ‘‘సూర్యుడ్నించి సూర్యుడికి/ ఇరవై నాలుగు గంటల దూరం/ మనిషి నుంచి మనిషికి / రెండు గుండెలే దూరం’’ (గుంటూరు శేషేంద్ర, ‘నా దేశం నా ప్రజలు’). ఇక్కడ మొదటి వాక్యానికి కాక రెండో వాక్యానికే ప్రాధాన్యం. మొదటిది సుదూరం. రెండవది అతిసన్నిహితం. మనిషికి మనిషికి మధ్య ఆ సాన్నిహిత్యమే కవి ఆశిస్తున్నాడు. 


ప్రారంభవాక్యమే ముగింపు వాక్యం కూడా అయితే అప్పుడది ఏకవాక్య కవిత అవుతుంది. ‘తనని బాధిస్తున్న/ ప్రపంచపు ముల్లుని/ పీకి పారేసి/ ఈ పిల్ల చకచకా/ ఎటో నడిచిపోయింది’ (ఇస్మాయిల్‌, ‘ఆత్మహత్య’). ఇట్లా ఒకే ఆరంభాంత వాక్యం రాసినప్పుడు అందులో చాలా సాంద్రత ఉండాలి. బాధించే ప్రపంచాన్ని ముల్లుగా రూపు గట్టాడు కవి. ముల్లుని తేలిగ్గా పీకి పారేస్తాం. అట్లాగే ఆ పిల్ల తన బాధకి తేలిగ్గా ముగింపు చూసుకొంది. చకచకా ఎక్కడికో నడిచిపోవటం అంటే వెనకాముందూ తడుము కోక ఏ లోకానికో తుదిపయనం సాగించటం. ఈ సాంద్ర మైన వాక్యం ఒకే సందర్భంలో ఒక బాహ్య దృశ్యాన్ని, ఒక అంతర వేదనని స్ప్డురింపజేస్తుంది.  


‘‘హత్యలు వాస్తవమే కానీ హంతకులు నిర్దోషులు’’ (వర వరరావు, ‘మనుధర్మమూర్తి సుభాషితాలు’). ఇది 2014లో వచ్చిన ఒక న్యాయస్థానం తీర్పుపై విసురు. విరోధాభాస. అంటే ఆ వాక్యంలో అంతర్‌ వైరుధ్యం ఉంటుంది. తదుపరి వివరణతో అది తొలగిపోతుంది. సాక్ష్యాధారాలు సరిగా లేవనో, పోలీసుల ప్రాథమిక దర్యాప్తు రిపోర్టు బలహీనంగా ఉందనో ఏవో కారణాలతో దారుణ హత్యానేరాలు సైతం నీరుగారి పోతాయి. హంతకులు అందరి కళ్లముందే నిర్దోషులుగా నవ్వుతూ బయటికి వస్తారు. ‘‘హంతకులూ బాధితులూ సామరస్యంతో కలిసుండే/ గ్రామీణ శ్మశానశాంతిని నేను కోరుకుంటాను’’ అంటున్న న్యాయమూర్తి సుభాషితాల కింద వాస్తవం సమాధి అవుతుంది. ఈ విశేషం అంతా ఒకేఒక్క తొలి వాక్యంతోనే గమ్యమానం చేసింది కవి నిశిత దృష్టి.  


ఒక కవితాప్రారంభం ఇలాగే ఉండాలని ఎవరూ నిర్దే శించలేరు. వాస్తవానికి ఎన్నిరకాల కవితలుంటాయో అన్ని రకాల ప్రారంభాలూ ఉంటాయి. కవిత ఒక బ్రహ్మాండ మైన భవనం అనుకొంటే దానికి అనేక ద్వారాలు ఉండ వచ్చు. ఏ వాకిలి గుండా లోపలికి అడుగుపెట్టాలనేది కవి ఆలోచన బట్టి ఉంటుంది. 


ఉదాహరణకి కరోనా గురించి కవిత మొదలుపెట్టాలి. (కరోనా వేలమందిని చంపుతూనే, వేలమందిని కవుల్ని చేసింది!) ‘‘కరోనా! నీ మరణం నే కోరుకోనా’’ అంటూ అంత్య ప్రాసతో అందుకొన్నామనుకోండి. అంతకన్న చచ్చు ఎత్తుగడ మరొకటి ఉండదని నమ్మొచ్చు. ‘‘కాలమేఘంలా నువ్వొచ్చావు/ విషవర్షంలో నేను’’- ఇట్లా ఉత్తమ పురుషలో ఎత్తుకో వచ్చు. ‘‘పక్క బెడ్‌ మీద చివరి ఊపిరి చెవులకి సోకు తుంది’’- ఇట్లా ప్రథమ పురుషలో ప్రారంభం చెయ్యొచ్చు. ప్రతిరోజూ మరణాల సంఖ్యలు వింటూ ‘పదమూడో ఎక్కం’ దగ్గరైనా మొదలు పెట్టవచ్చు. అంటే ఒకే కవితావస్తువుకి భిన్న ప్రారంభాలుండవచ్చు అనేది సూత్రీకరణ. ఈ భిన్నత్వం ఆయా కవుల ఆలోచనని బట్టి, విషయ వివేచనని బట్టి, ఊహాశాలితని బట్టి, కవిత్వీకరణ శక్తిని బట్టి ఉంటుంది.  అయితే ఏ విషయానికి ఎట్టి ప్రారంభం నప్పుతుంది అనేది గమనించాలి. నా మట్టుకు నాకు ధ్వనిప్రాయమైన శీర్షికతో కవితను పరోక్షంగా ప్రారంభించటం నచ్చుతుంది. వర్తమాన కవిత్వంలో సాధారణ ప్రారంభాలే ఎక్కువ. కవులు ఎంత ప్రత్యేకంగా కవిత మొదలుపెట్టాము అనే దానికన్న వస్తునిర్వహణ మీదే చూపు సారిస్తున్నారు.


కవిత ఎత్తుగడ, ముగింపు విభిన్న పార్శ్వాలు. ఎత్తుగడ సార్థకత ముగింపులో తెలుస్తుంది. అంటే ఒక కవిత ఎత్తు గడను దాని ముగింపు సమర్థన (justify) చెయ్యాలి. అది వాటి మధ్య ద్విముఖ ఏకత్వం (bilateral unity). మేలైన కవితల్లో ఈ రెండు అంచుల మధ్య అంతర్గత సంబంధం, ఏకత్వం ఉంటాయి. అది తెలియనప్పుడు ఎత్తుగడ, ముగింపు దేనికవిగా తేలిపోయి మొత్తం కవితను గూడా తేల్చేసే ప్రమాదం ఉంది. ఎత్తుగడ కన్న ముగింపు మరీ ముఖ్యం. అయితే అది మరో ముచ్చట.

పాపినేని శివశంకర్‌

ప్రత్యేకంమరిన్ని...